జ‌గ‌న్‌ కు అధికారం ప‌క్కా!... ఇదిగో సాక్ష్యం!

Update: 2018-04-08 12:12 GMT
ఏపీలో విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గ‌డ‌చిన ఎన్నికల్లో విజ‌యం వెంట్రుక వాసిలో చేజారిన విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా జ‌రిగిన సర్వేల‌న్నీ కూడా జ‌గ‌న్‌ దే గెలుపు అని తేల్చేశాయి. అయితే ఓ వైపు బీజేపీతో పొత్తు - మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ను రంగంలోకి దించిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు... చాలా స్వ‌ల్ప మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత కూడా అస‌లు గ‌ణాంకాలు కూడా ఇదే విష‌యాన్ని తేల్చేశాయి. అయితే ఆ ఎన్నిక‌లు జ‌రిగి ఇప్ప‌టికే నాలుగేళ్లు దాటిపోయింది. ఈ నాలుగేళ్ల‌లో రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌తో పాటు రాష్ట్ర ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానంలోనూ మార్పు వ‌చ్చేసిన‌ట్లుగానే చెప్పాలి. అస‌లు ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీల్లో ఇటు చంద్ర‌బాబు గానీ, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గానీ... పెద్ద‌గా ఒర‌గ‌బెట్టిందేమీ లేద‌న్న వాద‌న లేక‌పోలేదు. అంతేకాకుండా బీజేపీతో మైత్రి ఉన్నంత కాలం చంద్ర‌బాబు వల్లించిన నీతులు - ఆ మైత్రి ఊడిన త‌ర్వాత తవ్వుతున్న గోతులు ప‌రిశీలిస్తే... జ‌నం మ‌దిలో చంద్ర‌బాబుకు ఎలాంటి స్థానం ద‌క్క‌నుందో ఇట్టే తేలిపోతుంద‌న్న భావ‌న లేక‌పోలేదు.

ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర... బాబులోని ఈ నీతుల‌ను, గోతుల‌ను బ‌య‌ట‌పెడుతూ ముందుకు సాగుతోంది. అంతేకాకుండా జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌సంగాల‌తో ఎవరు ఏ వైఖ‌రితో ముందుకు సాగుతున్నార‌న్న విష‌యంపైనా జ‌నం త‌మ‌కు తాముగా ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చేస్తున్న వైనం కూడా బాగానే క‌నిపిస్తోంది. ఈ కారణంగానే జ‌గ‌న్ పాద‌యాత్ర సాగుతున్న కొద్దీ... దానికి జ‌నాద‌ర‌ణ పెరుగుతున్న‌ట్లుగా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలో కొన‌సాగుతున్న జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు పోటెత్తుతున్న జ‌నాద‌ర‌ణ‌ను చూసిన ఏ ఒక్క‌రైనా ఇదే మాట చెబుతున్న వైనం తెలిసిందే. జ‌గన్ సొంత జిల్లా క‌డ‌ప నుంచే యాత్ర ప్రారంభ‌మై... రాయ‌ల‌సీమ‌లోని మిగిలిన మూడు జిల్లాల‌ను చుట్టేసిన త‌ర్వాత గానీ... ఈ యాత్ర ఇత‌ర కోస్తాంధ్ర‌లోకి కాలు పెట్ట‌లేదు. అయితే జ‌గ‌న్ సొంత జిల్లా ఉన్న రాయ‌ల‌సీమ‌లో ఆయ‌న యాత్ర‌కు ఆమాత్రం జ‌నాద‌ర‌ణ ల‌భించ‌డం మామూలే క‌దా? అన్న రీతిలో టీడీపీ వ‌ర్గాలు కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అయితే రాయ‌లసీమ దాటిన త‌ర్వాతే జ‌గ‌న్ యాత్ర‌కు అంత‌కంత‌కూ మ‌ద్ద‌తు పెరిగింద‌ని చెప్ప‌క తప్ప‌దు. రాయ‌ల‌సీమ దాటిన త‌ర్వాత తొలుత నెల్లూరు, ఆ త‌ర్వాత ప్ర‌కాశం జిల్లాల మీదుగా సాగిన జ‌గ‌న్ యాత్ర‌కు భారీ స్పంద‌నే ల‌భించింది.

అయితే టీడీపీకి కంచుకోటా ఉన్న గుంటూరు జిల్లాలో రాయ‌ల‌సీమ జిల్లాల‌తో పాటు నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో వ‌చ్చిన స్పంద‌న కంటే కూగా మెరుగైన‌, రెండింత‌లు, మూడింత‌ల కంటే కూడా అధిక‌మైన మ‌ద్ద‌తు ల‌భించింద‌న్న వాద‌న వినిపిస్తోంది. గుంటూరు జిల్లాలో టీడీపీ సీనియ‌ర్లు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సత్తెన‌ప‌ల్లి, న‌ర‌స‌రావుపేట, తెనాలి, గుంటూరు న‌గ‌రంలో జ‌గ‌న్ యాత్ర‌కు ల‌భించిన స్పంద‌నే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పాలి.  టీడీపీ సీనియ‌ర్లు కోడెల శివ‌ప్ర‌సాద్ వంటి హేమాహేమీలు సిట్టింగులుగా ఉన్న స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌కవ‌ర్గంలో జ‌గ‌న్‌ కు ల‌భించిన జ‌నాద‌ర‌ణ‌ను చూసిన టీడీపీ నేత‌ల నోట మాట రాలేద‌ట‌. మొత్తంగా జ‌నం స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న పెంచుకోవ‌డంతో పాటుగా అధికార పార్టీగా ఉన్న టీడీపీ ఏం చేయాలి? ఏం చేయ‌కూడ‌దు? ఏం చేస్తోంది? అంటూ జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌సంగాల‌తో జ‌నంలో ఇప్పుడు భారీగానే మార్పు వ‌చ్చింద‌ని, ఈ కార‌ణంగా టీడీపీ నేత‌ల నియోజ‌కవ‌ర్గాల్లోనూ జ‌గ‌న్ యాత్ర‌ల‌కు భారీ స్పంద‌న ల‌భిస్తోంద‌ని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మొత్తంగా జ‌గ‌న్‌కు వ‌చ్చే ప‌ర్యాయం ఓటేద్దామ‌ని భావిస్తున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంద‌న్న వాద‌న గ‌ట్టిగానే వినిపిస్తోంది. అంటే... వ‌చ్చే ఎన్నికల్లో జ‌గ‌న్ గెలుపు ఖాయ‌మేన‌న్న మాట‌.

Tags:    

Similar News