జ‌గ‌న్ మిస్స్‌డ్ కాల్‌...ప్లాన్ సూప‌ర్ స‌క్సెస్‌!

Update: 2017-09-06 11:19 GMT
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డికి జ‌నంలో నానాటికీ ప్ర‌జాద‌ర‌ణ  పెరిగిపోయిందనటానికి  మ‌రో నిలువెత్తు నిద‌ర్శ‌నం సాక్షాత్క‌రించేసింది. జ‌గ‌న్ ఒక్క పిలుపునిస్తే... ల‌క్ష‌లాది గొంతులు ప‌లుకుతున్నాయి. ఆ ల‌క్ష‌ల గొంతుల సంఖ్య కోట్ల సంఖ్య‌ను తాక‌డంలో ఎలాంటి సందేహం లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే... త‌న తండ్రి, దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖర‌రెడ్డి వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ కేంద్రంగా *వైఎస్ ఆర్ ఫ్యామిలీ* పేరిట ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. వైఎస్ హ‌యాంలో ఆ ప్ర‌భుత్వం నుంచి సంక్షేమ ఫ‌లాలు అందుకున్న వారంతా త‌మ కుటుంబ స‌భ్యులేన‌ని, కొత్త‌గా వైఎస్ ఆర్ ఫ్యామిలీ పేరిట ప్రారంభించిన కుటుంబంలో వారంతా చేరాల‌ని పిలుపునిచ్చారు. ఇందుకోసం కేవ‌లం ఒక్క మిస్స్‌డ్ కాల్ ఇస్తే స‌రిపోతుంద‌ని కూడా నాడు జ‌గ‌న్ పేర్కొన్నారు. 9121091219 నెంబ‌రుకు మిస్స్‌డ్ కాల్ ఇవ్వాల‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ అంటే జ‌నం... జ‌నం అంటే జ‌గ‌న్ అన్న రీతిలో జ‌గ‌న్ ఎక్క‌డికెళ్లినా కూడా ప్ర‌జా స్పంద‌న బ్ర‌హ్మాండంగా వ‌స్తోంది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ఇచ్చిన పిలుపున‌కు కూడా భారీ రెస్పాన్స్ వ‌చ్చేసింది. జ‌గ‌న్ పిలుపు నిచ్చిన తొలి 72 గంట‌ల్లో ఈ నెంబ‌రుకు ఏకంగా 3,15,780 మిస్స్‌డ్ కాల్స్ వ‌చ్చాయ‌ట‌. అంటే వీరంతా జ‌గ‌న్ కొత్త‌గా ప్రారంభించిన వైఎస్ఆర్ ఫ్యామిలీలో భాగ‌మైన‌ట్లే లెక్క‌. వ‌చ్చే నెల 2 దాకా కొన‌సాగే ఈ మిస్స్‌డ్ కాల్ ప్రోగ్రాంకు తొలి మూడు రోజుల్లోనే ఈ మేర స్పందన వ‌చ్చిందంటే... నిర్దేశిత గ‌డువు ముగిసేలోగా... ఇంకెంత మంది వైఎస్ ఆర్ ఫ్యామిలీలో భాగ‌స్వాముల‌వుతారో ఇట్టే చెప్పేయొచ్చు. ఈ ప‌థ‌కం ప్రకారం ఇలా మిస్స్‌డ్ కాల్ ఇచ్చి వైఎస్ ఆర్ ఫ్యామిలీలో భాగ‌స్వాముల‌య్యే వారికి వ‌చ్చే నెల 11 దాకా ప్ర‌త్యేక శిక్ష‌ణా త‌ర‌గ‌తులు ఇస్తారు. ఆ త‌ర్వాత వీరిని బూత్ లెవెల్ స్థాయికి పంపి జ‌గ‌న్ కొత్త‌గా ప్ర‌క‌టించిన *న‌వ ర‌త్నాలు*పై ప్ర‌జ‌ల‌కు సంపూర్ణ అవ‌గాహ‌న క‌ల్పిస్తారు.  

 వైఎస్ అధికారంలో ఉండ‌గా... ఆయ‌న సర్కారు ప్ర‌వేశ‌పెట్టిన ప‌లు సంక్షేమ ప‌థ‌కాలు అందుకోని తెలుగు కుటుంబ‌మంటూ ఉండ‌ద‌న్న వాద‌న అంద‌రి నోటా వినిపిస్తోంది. ఆరోగ్య‌శ్రీ‌ - 108 - 104 - పెన్ష‌న్లు - ఫీజు రీయింబ‌ర్స్‌ మెంటు - రూ.2ల‌కే కిలో బియ్యం.... త‌దిత‌ర ప‌థ‌కాల్లో తెలుగు నేల‌కు చెందిన ప్ర‌తి కుటుంబం ఈ ప‌థ‌కాల్లోని దేనినో ఒక దానికి అందుకుని ఉంటుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. కాక‌లు తీరిన విశ్లేష‌కులు కూడా ఈ వాద‌న‌ను కాద‌న‌లేని వైనం మ‌న‌కు తెలిసిందే. అంటే.. జ‌గ‌న్ ప్లాన్ దాదాపుగా వ‌ర్క‌వుటైన‌ట్లుగానే క‌నిపిస్తోంది. మూడు రోజుల్లోనే జ‌గ‌న్‌ మిస్స్‌డ్ కాల్‌ కు 3 ల‌క్ష‌ల‌కు పైగా జ‌నాలు స్పందిస్తే... ఇంకో నెల పాటు స‌మ‌య‌మున్నందున ఈ పిలుపున‌కు ఇంకెంత మంది స్పందిస్తార‌న్న విష‌యం అంచ‌నాల‌కే అంద‌డం లేదు. ఈ దెబ్బ‌తో జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లుపెట్టేలోగానే ఆయ‌న‌కు ఎంత‌మేర ప్ర‌జాబ‌లం ఉంద‌న్న విష‌యం తేలిపోతుంద‌న్న మాట‌. వెర‌సి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌గ‌న్ రాష్ట్రంలో బ‌ల‌మైన నేత‌గా, వైసీపీ ప్ర‌జా బ‌ల‌మున్న పార్టీగా.. ప్ర‌స్తుత అధికార టీడీపీకి పెను స‌వాల్‌ నే విసర‌నుంద‌న్న మాట‌.
Tags:    

Similar News