న‌ర‌కాన్ని ప్ర‌త్య‌క్షంగా చూసిన హైద‌రాబాదీయులు!

Update: 2019-06-22 05:36 GMT
మొన్న‌టి వ‌ర‌కు ముఖం చాటేసిన వ‌ర్షం నిన్న (శుక్ర‌వారం సాయంత్రం) ఒక్క‌సారిగా ప‌లుక‌రించ‌టం తెలిసిందే. లేటుగా వ‌చ్చిన వ‌ర్షం లేటెస్ట్ గా ఉక్కిరిబిక్కిరి చేసింది. త‌క్కువ వ్య‌వ‌ధిలో భారీగా కురిసిన వ‌ర్షంతో న‌గ‌రం అత‌లాకుత‌ల‌మైంది. ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రానికి గుండెకాయ లాంటి ఐటీ కారిడార్ తాజా వ‌ర్షానికి ఉక్కిరిబిక్కిరి అయ్యింది.

కేవ‌లం రెండు గంట‌ల స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో దాదాపు 8 సెంటీమీట‌ర్ల‌కు పైనే కురిసిన వ‌ర్షంతో రోడ్ల మీద వ‌ర్ష‌పునీరు నిలిచిపోయింది. దీంతో వాహ‌నాలు ముందుకు క‌ద‌ల‌టం కుద‌ర్లేదు. దీంతో ట్రాఫిక్ అంత‌కంత‌కూ పెరిగిపోయింది. దీని తీవ్ర‌త ఎంతంటే.. సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. భారీ ట్రాఫిక్ జాం గురించి ప్ర‌స్తావిస్తూ.. రోడ్ల మీద‌కు వ‌చ్చే ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకోవాల్సిందిగా కోర‌టం చూస్తే.. ప‌రిస్థితి ఎంత ఇబ్బందిక‌రంగా ఉంద‌న్న విష‌యం ఇట్టే అర్థం కాక మాన‌దు.

కిలోమీట‌ర్ ప్ర‌యాణానానికి అర‌గంట‌కు పైనే ప‌ట్టిన ప‌రిస్థితి. ఇదొక్క‌టి చాలు.. శుక్ర‌వారం రాత్రి ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఎంత ఎక్కువ‌గా ఉంద‌న్న విష‌యాన్ని తెలుసుకోవ‌టానికి. మామూలు రోజుల్లో 40 నుంచి గంట ప్ర‌యాణంలో ఇంటికి చేరే వారు.. శుక్ర‌వారం రాత్రి మాత్రం ఏకంగా నాలుగైదు గంట‌లు ప‌ట్టింది. మ‌రికొంద‌రికి మ‌రో అర‌గంట ఎక్కువ ప‌ట్టిన ప‌రిస్థితి. ఐటీ కారిడార్.. ఆ దిశ‌గా వెళ్లే అన్ని ర‌హ‌దారులు ట్రాఫిక్ తో నిలిచిపోయాయి. వాహ‌నాల్లో ప్ర‌యాణించే క‌న్నా న‌డుచుకుంటూ వెళ్లినా త్వ‌ర‌గా ఇంటికి చేరుకునే ప‌రిస్థితి.

ఇంత భారీగా ట్రాఫిక్ జాం కావ‌టంతో వాహ‌న‌దారులు విప‌రీత‌మైన వేద‌న‌కు గుర‌య్యారు. తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యారు. మ‌రింత దారుణ‌మైన విష‌యం ఏమంటే.. ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న వారు ముందుకు వెళ్ల‌లేక‌.. వెన‌క్కి రాలేక అలా రోడ్ల మీద ఫిక్స్ అయ్యారు. ఇలా వంద‌లు.. వేలు కాదు.. ల‌క్ష‌ల్లో ఉండ‌టం గ‌మ‌నార్హం. శుక్ర‌వారం సాయంత్రం ఐదుగంట‌ల ప్రాంతంలో మొద‌లైన జాం అంత‌కంత‌కూ పెరిగి.. ఎనిమిది గంట‌ల వేళ పీక్స్ కు చేరుకుంది.

ట్రాఫిక్ జాం క్లియ‌ర్ కావ‌టానికి రాత్రి 11 గంట‌ల వేళ‌కు కాస్తంత అదుపులోకి వ‌చ్చింది. అయితే.. కొన్ని రూట్ల‌లో అర్థ‌రాత్రి 12 గంట‌ల వేళ‌లోనూ ట్రాఫిక్ జాం నెల‌కొని ఉంద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. ఏమైనా శుక్ర‌వారం సాయంత్రం మాత్రం హైద‌రాబాదీయుల‌కు ప్ర‌త్య‌క్ష న‌ర‌కం ఎలా ఉంటుంద‌న్న విష‌యం ల‌క్ష‌లాది మందికి అనుభ‌వ‌మైంది. ఈ భారీ ట్రాఫిక్ జాంతో విమానాలు.. రైళ్లు.. బ‌స్సులు మిస్ అయినోళ్లు బోలెడుమంది ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.
Tags:    

Similar News