మానవ సంబంధమా..? ఎక్కడికీ పతనం..?

Update: 2022-04-30 15:30 GMT
సంఘటన 1 : తండ్రి స్థానంలో ఉండి బాలికపై అత్యాచారం మచిలీపట్నంలో బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లితో సహజీవనం చేస్తూనే ఓ వ్యక్తి.. ఆమె కుమార్తెపై ఘాతుకానికి పాల్పడ్డాడు. పది నెలలుగా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక గర్భం దాల్చడంతో బంధువులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రభుత్వాసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. నిందితుడు ట్యాక్సీ డ్రైవర్.

సంఘటన 2: నిజామాబాద్ లో "పైసా'చిక పెద్దమ్మ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళ తన వద్ద ఆశ్రయం పొందుతున్న చెల్లెలి కూతురిని డబ్బుకు ఆశపడి కానిస్టేబుల్ కు అప్పగించింది. అతడు ఆ బాలికపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే అదనుగా ఆ మహిళ భర్త కూడా యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. యువతి గర్భం దాల్చింది. స్థానికులు గమనించడంతో వీరి అరాచకం బయటపడింది

సంఘటన 3: ప్రియుడితో కలిసి తండ్రిని కడతేర్చిన కుమార్తె ప్రేమ వ్యవహారానికి అడ్డుపడుతూ, భూమి పత్రాలు ఇవ్వడం లేదనే కక్షతో కన్న తండ్రిని ఓ కూతురు (17).. ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన మహబూబాబాద్‌ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న కన్నతండ్రి (45)ని నిర్దాక్షిణ్యంగా హతమార్చింది ఓ కుమార్తె. ఆ రైతు భార్య ఏడాది కిందట కరోనాతో మృతి చెందింది. దీంతో ఆ కుమార్తె  ఏడో తరగతి మధ్యలోనే చదువు మానివేసి ఇంట్లోనే ఉంటోంది. తండ్రికి అర ఎకరం వ్యవసాయ భూమి ఉంది.

ఇవీ రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఘటనలు. మానవత్వానికే మాయని మచ్చలా.. సమాజానికే తలవంపులుగా.. అయినవారినీ అనుమానించేలా.. వారినివారు అవమానించుకునేల చేసే ఘటనలివి. "మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు"అని దశాబ్దాల కిందటే చెప్పారు. కానీ, "మాయమైపోతున్నవమ్మా.. మానవత్వపు విలువలు"అని నేడు చెప్పుకోవాల్సి వస్తుంది. నిజామాబాద్ ఘటనే చూస్తే.. ఆ యువతికి తల్లదండ్రులు లేరు. మనో వైకల్యం ఉంది. అలాంటి యువతిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పెద్దమ్మ పైసలకు కక్కుర్తి పడింది. చెల్లెలు కూతురు తన కూతురు వేరు కాదనే  సోయి లేకుండా ప్రవర్తించింది. ఫలితంగా సభ్య సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇక మహబూబాబాద్ జిల్లాలో తండ్రినే హతమార్చిన ఉదాహరణ చూస్తే.. ఆ బాలికకు ప్రేమించిన వాడితో వివాహానికి తండ్రి అంగీకరించాడు కూడా. కాకపోతే మైనారిటీ తీరేంత వరకు ఆగాలని సూచించాడు. కానీ, ఆ బాలిక ప్రియుడి మోజులోనో, ఒక్కసారిగా డబ్బు వచ్చిపడే ఆస్తి వ్యామోహంలోనో ఏమో తండ్రినే హతమార్చింది. తల్లి ఏడాది కిందటే కరోనాతో చనిపోగా.. ఇప్పుడు తండ్రిని తన చేతులతోనే హతమార్చిన ఆమె అనాథగా మారింది. ఈ నేరంతో తనపై చెరగని ముద్ర వేసుకుంది.

డబ్బు, సామాజిక మాధ్యమాల ప్రభావం?దేశంలో,ప్రపంచంలో మహిళలపై అరాచకాలు, మహిళలే అరాచకానికి పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. అయితే, మారిన పరిస్థితుల్లో వీరిపై సామాజిక మాధ్యమాల ప్రభావం కనిపిస్తోంది. మరీ లోతుగా చూస్తే డబ్బు ప్రభావమూ ఉందనిపిస్తోంది. మారిన జీవన ప్రమాణాల్లో డబ్బు కీలక పాత్ర పోషిస్తోంది. ఉన్నతంగా జీవించాలనే తాపత్రయం పెరుగుతోంది. ఈ క్రమంలో స్థాయికి మించి ఆలోచించి దురాగతాలకు పాల్పడుతున్న వైనం కనిపిస్తోంది.

సులువుగా చిక్కుతారని తెలిసినా..ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగింది. ఎంతటి నేరమైనా చిటికెలో ఛేదింగల సాంకేతికత పోలీసుల దగ్గరుంది. ఆధారాల సేకరణ, సాక్షుల విచారణ ఇలా అన్నింటిలోనూ సాంకేతిక ప్రముఖ పాత్ర పోషిస్తోంది. నేరం చేసినవారు ఎంత పకడ్బందీగా వ్యవహరించినా.. రోజుల వ్యవధిలో దొరికిపోతున్నారు. జైలు పాలవుతున్నారు. కేసులను ఎదుర్కొంటూ కష్టాలు పడుతున్నారు. దీనీని గమనించైనా ప్రజల ఆలోచనా ధోరణుల్లో మార్పు రావడం లేదు. వారి కంటికి కనిపిస్తున్నది కేవలం డబ్బు.. వ్యామోహమే. అదే ఎంతటి నేరానికైనా ఒడిగట్టేలా చేస్తోంది.

మార్పు అవసరం డబ్బు కోసమో, గొడవ పడో గతంలో క్షణికావేశంలో నేరాలకు పాల్పడేవారు. ఇప్పుడూ ఇలాంటివి ఉన్నా.. నేరాల తీవ్రత పెరిగింది. అక్రమ సంబంధాలు, ఆస్తి తగాదాలతో దారుణ హత్యలకు పాల్పడుతున్నారు. ఒకటి కాదు రెండు హత్యలకైనా వెరవని పరిస్థితి. ఇలాంటి ఆలోచనా ధోరణుల నుంచి మార్పు అవసరం. పోలీసు, న్యాయ శాఖల సమన్వయంతో అవగాహన శిబిరాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో చైతన్యం తేవొచ్చు. ప్రభుత్వమూ కల్పించుకుని పెద్దఎత్తున ప్రచారం చేయడం ద్వారా మార్పును ఆశించవచ్చు.
Tags:    

Similar News