అమెరికాపై ప్ర‌కృతి విసిరిన ఆటంబాంబ్ హార్వీ!

Update: 2017-08-30 05:09 GMT
ప్ర‌పంచంలో ఏదైనా దేశానికి అనుకోని రీతిలో భారీ ప్ర‌కృతి విప‌త్తు ఎదురైతే.. అండ‌గా ఉండేందుకు.. అప‌న్న హ‌స్తం అందించేందుకు ముందుకు వ‌చ్చే అగ్ర‌రాజ్యం అమెరికా. మ‌రి..ఇప్పుడా దేశ‌మే ప్ర‌కృతి విప‌త్తుకు బాధితురాలిగా మారింది. ప్ర‌కృతి ముందు ఎంత అగ్ర‌రాజ్య‌మైనా.. ఎంత అల్ప‌మ‌న్న విష‌యాన్ని హార్వీ హ‌రికేన్ స్ప‌ష్టం చేసింది.

అమెరికా దేశ చ‌రిత్ర‌లో అత్యంత విధ్వంస‌క‌ర తుపానుల్లో హార్వీ ఒక‌టిగా నిలిచిపోనుంది. అమెరికాలో నాలుగో పెద్ద‌ది.. టెక్సాస్ త‌ర్వాత ఎక్కువ మంది జ‌నాభా నివ‌సించే న‌గ‌ర‌మైన హూస్ట‌న్ ను హార్వీ ఎంత‌గా దెబ్బేసిందో చూస్తే.. నోట మాట రాదంతే. తుపాను కార‌ణంగా బిలియ‌న్ల కొద్దీ డాల‌ర్ల ఆస్తి న‌ష్టం వాటిల్లింద‌ని చెబుతున్నారు. హార్వీ చేసిన డ్యామేజ్ నుంచి కోలుకోవ‌టానికి హుస్ట‌న్ న‌గ‌రం కొన్ని సంవ‌త్స‌రాలు ప‌డుతుంద‌న్న విశ్లేష‌ణ చూస్తేనే.. తుపాను ప్ర‌భావం ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

తుపాను ప్ర‌భావం టెక్సాస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.3 కోట్ల మందిపై హార్వీ ప్ర‌భావం ఉందంటున్నారు. వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న వారికి సాయం అందించేందుకు ఏకంగా 12 వేల మంది సిబ్బంది నిర్విరామంగా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాలు పంచుకుంటున్నారు. గ‌డిచిన కొద్ది రోజులుగా టెక్సాస్ లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. భార‌త కాల‌మానం ప్ర‌కారం మంగ‌ళ‌వారం రాత్రి నుంచి టెక్సాస్ లో విద్యుత్ స‌ర‌ఫ‌రా పున‌రుద్ధ‌ర‌ణ మొద‌లైంది.

తుపాను కార‌ణంగా ర‌హ‌దారులు కొట్టుకుపోయాయి. దీని కార‌ణంగా అంబులెన్స్ ల ప్ర‌యాణానికి సైతం ఇబ్బందిక‌రంగా మారింది. హార్వీ తుపాను కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కూ 10 మంది మృత్యువాత ప‌డ్డారు. వ‌ర‌ద‌లో ఒక వ్యాన్ మునిగిపోవ‌టంతో అందులో ప్ర‌యాణిస్తున్న ఆరుగురు మ‌ర‌ణించారు. వీరిలో న‌లుగురు చిన్నారులు. శుక్ర‌వారం హార్వీ బీభ‌త్సం షురూ అయ్యింది.

గంట‌కు 130 మైళ్ల వేగంతో పెనుగాలులు వీసి హూస్ట‌న్ న‌గ‌రాన్ని వ‌ణికిపోయేలా చేశాయి. అప్ప‌టి నుంచి విజృంభిస్తోన్న తుపాను బుధ‌వారం ఉద‌యం మ‌రోసారి తీరాన్ని దాటుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. టెక్సాస్ - లూజియానా స‌రిహ‌ద్దుల్లో తీరం దాటే తుపాను కార‌ణంగా మ‌రోసారి భారీ వ‌ర్ష‌పాత న‌మోద‌వుతుంద‌ని భావిస్తున్నారు. హార్వీ తుపాను నేప‌థ్యంలో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌.. వాతావ‌ర‌ణ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ప్ర‌క‌టించారు.

టెక్సాస్ ను గ‌డ‌గ‌డ‌లాడించిన హార్వీ తీవ్ర‌త అక్క‌డున్న భార‌తీయ అమెరిక‌న్ల మీద తీవ్ర ప్ర‌భావాన్ని చూపించింద‌ని చెబుతున్నారు. దాదాపు ల‌క్ష‌కు పైగా భార‌తీయ అమెరిక‌న్ల‌పై తుపాను ప్ర‌భావం ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. వ‌ర‌ద నీరు చేరిన ఇళ్ల‌ల్లో నివ‌సిస్తున్న 200 మందికి పైగా భార‌తీయ విద్యార్థులకు భార‌త కాన్సులేట్ సాయం అందిస్తోంది.  బ్య్రాన్ స‌రస్సులో మునిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్ద‌రు భార‌తీయ విద్యార్థుల్ని స‌హాయ‌క సిబ్బంది కాపాడి వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇద్ద‌రు బాధితుల‌ను టెక్సాస్ లోని ఏ అండ్ ఎం వ‌ర్సిటీలో చ‌దువుతున్న నిఖిల్ భాటియా.. షాలినిలుగా గుర్తించారు. స‌ర‌స్సులో ఈత కొట్టేందుకు వారు వెళ్లిన‌ట్లుగా భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. త‌న భార్య మెలానియాతో క‌లిసి టెక్సాస్ లోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం (అమెరికా కాల‌మానం ప్ర‌కారం) ప‌ర్య‌టిస్తార‌ని. . స‌హాయ‌క చ‌ర్య‌ల్ని స‌మీక్షిస్తార‌ని చెబుతున్నారు. తుపాను కార‌ణంగా తీవ్రంగా ప్ర‌భావిత‌మైన ప‌లువురు త‌మ‌కు ఎదుర‌వుతున్న ఇబ్బందుల్ని పేర్కొంటూ సోష‌ల్ మీడియాలో ఫోటోల్ని పోస్ట్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు త‌మ దీన స్థితిపై పోస్టులు పెడుతున్నారు. సాయం కోసం అర్థిస్తున్న వారూ పెద్ద సంఖ్య‌లో ఉన్నారు.

తుపానులో చిక్కుకున్న వారికి అమెరికాలోని ప్ర‌తి వ్య‌క్తి త‌మ మ‌ద్ద‌తును.. ప్రేమ‌ను పంపుతున్నార‌ని.. తుపానును ఎదుర్కొని మ‌రింత శ‌క్తివంతులుగా ఎదుగుతామ‌ని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే.. ట్రంప్ ప‌ర్య‌ట‌న తుపాను కార‌ణంగా బాగా డ్యామేజ్ అయి.. వ‌ర‌ద తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న హూస్ట‌న్ లో కాకుండా శుక్ర‌వారం హార్వీ తీరాన్ని దాటిన కార్ప‌స్ క్రిస్టీ ప్రాంతంలో ప‌ర్య‌టిస్తుండ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News