అత్యంత ఖ‌రీదైన తుఫాను ఇదేనా!

Update: 2017-09-01 11:45 GMT
అమెరికాను చివురుటాకులా వ‌ణికించిన హార్వీ తుఫాను.. వ‌ల్ల ఆ దేశానికి సుమారు ఇప్ప‌టి వ‌ర‌కు అందిన వివ‌రాల ప్ర‌కారం  రూ.1,02,500 కోట్ల (160 బిలియన్‌ డాలర్లు) నష్టం వాటిల్లింది. దీంతో ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన తుఫానుగా హార్వీ నిలిచిపోయింద‌ని అంటున్నారు నిపుణులు. అమెరికాలోని టెక్సాస్‌ను గ‌త నాలుగు రోజులుగా వ‌ణికించేస్తున్న ఈ తుఫాను మ‌రింత బ‌ల‌ప‌డింది. రోడ్ల‌న్నీ న‌దుల మాదిరిగా మారిపోయాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వైప‌రీత్యంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.

అదే స‌మ‌యంలో అగ్ర‌రాజ్యంలో 32 వేల మంది కూడూ గూడుకు దూర‌మ‌య్యారు.  ఈ పెనుతుపాను బీభత్సానికి టెక్సాస్ పూర్తిగా న‌ష్ట‌పోయింద‌ని అధ్య‌క్ష భ‌వ‌నం సైతం వెల్ల‌డించింది. ఇక‌, బుధవారం రెండోసారి లూసియానా తీరాన్ని దాటిన క్రమంలో భారీ వర్షాలతో టెక్సాస్‌ సరిహద్దు ప్రాంతాలను వరదతో ముంచెత్తింది.  దీంతో స్థానిక నివాసాలు పూర్తిగా నేల‌మ‌ట్టం అయిపోయాయి. ప్ర‌స్తుతం  పునరావాస కేంద్రంలో 30 వేల మందికి మందికి సరిపోయే ఏర్పాట్లు చేశామని టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ చెప్పారు.

ఇదిలావుంటే, తుఫానుకు తోడు హూస్టన్‌ సమీపంలోని ఓ రసాయన పరిశ్రమలో రెండు పేలుళ్లు సంభవించాయి. దీంతో అమెరికా మ‌రింత ఉలిక్కి ప‌డింది. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి వార్త‌లూ వెల్ల‌డి కాలేదు. కాగా, హార్వీ హరికేన్‌ సృష్టించిన విధ్వంసాన్ని మరచిపోకముందే తూర్పు అట్లాంటిక్‌ సముద్రంలో ఇర్మా హరికేన్‌ ఏర్పడినట్లు మియామీలోని నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ అధికారులు తెలిపారు. మొత్తానికి అగ్ర‌రాజ్యం ఇప్పుడు ఆప‌ద‌లో చిక్కుకుంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News