ఢిల్లీని ఆకర్షిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక... ఎవరి మధ్య అసలు పోటీ?

Update: 2021-10-15 04:10 GMT
హుజురాబాద్ ఉప ఎన్నిక తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే టీఆర్ఎస్ రెండవ శ్రేణి నేతగా ఉన్న మాజీమంత్రి ఈటల రాజేందర్, ఆ పార్టీకి రాజీనామా చేయడం.. ఆ తర్వాత బీజేపీలో చేరడం చాలా వేగంగా జరిగాయి. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని చూస్తున్న బీజేపీకి ఈటల ఆయువుపట్టు అయ్యారు. ఆయన బీజేపీలో చేరినప్పటికీ ఈ ఎన్నిక ఈటల వర్సెస్‌ కేసీఆర్‌గా మారాయి. ఇదే బీజేపీకి మింగుడుపడని అంశం. అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు తిరుగులేని బలం ఉంది. బలం ఉన్నా హుజురాబాద్ ఉప ఎన్నికను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని ఆపార్టీ నేతలు చెబుతున్నారు.

రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈటల ప్రాధాన్యతను కేసీఆర్ క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తున్నారని ఆపార్టీ నేతలు చెబుతున్న మాట. కేసీఆర్‌ వ్యవహారశైలిపై ఈటల ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. మంత్రి పదవి ఎవరి దయకాదని అనేక సందర్భాల్లో చెప్పేవారు. పార్టీ ఎవరి అబ్బసోత్తు కాదని, అందరూ పార్టీకి ఓనర్లేనని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే సీఎం పదవి నుంచి కేసీఆర్ తప్పుకుని కేటీఆర్‌ను సీఎంగా చేస్తారనే ప్రచారం జరిగింది. అందుకు ఎలాంటి ఆటంకం లేకుండా తన లాంటి వారిని బయటకు పంపించి జాగ్రత్త పడుతున్నారని కూడా ఈటల ఆరోపించారు. టీఆర్ఎస్‌ అధినాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తిరుగుబాటు చేసి బీజేపీలో చేరిన ఈటలను ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈటల ఈ ఉప ఎన్నికలో విజయం సాధిస్తే అది టీఆర్ఎస్‌లోని ఇతర నేతలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఎలాగైన ఈటలను ఓడించి.. అసంతృప్తి నేతలను అదుపులో పెట్టుకోవాలని అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకే హుజురాబాద్‌లో ఈటల ఓడించి ఇతర నేతలకు గుణపాఠం చెప్పాలని కేసీఆర్ ఆలోచనా ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందువల్లే హుజురాబాద్‌కు వరాలు కురిపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఎన్నిక బాధ్యతను ట్రబుల్ షూటర్‌గా పేరు గాంచిన మంత్రి హరీష్‌రావు అప్పగించారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ పోరాటాన్ని కేసీఆర్‌ వర్సెస్‌ ఈటలగానే చూస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగే ఈటల విజయం బీజేపీ ఖాతాలో కూడా పడే అవకాశం లేదు. ఇది బీజేపీకి మొదట్లో నచ్చలేదనే ప్రచారం కూడా జరిగింది. అయినప్పటికే ఈటల లాంటి నేతను అడ్డంపెట్టుకుని రాష్ట్రంలో ఎలాగైన పాగా వేయాలనే బీజేపీ అనుకుంటోంది. అందుకే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

అలాగే బీజేపీతో ఈటల రాజేందర్ అనుబంధం కూడా ఎన్నికల చర్చలో కీలకం మారింది. వాస్తవానికి ఈటల తీవ్రవాద వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి. తన భావజాలానికి విరుద్ధమైన బీజేపీలో ఎందుకు చేరాల్సివచ్చిందో అందరికీ తెలుసు. భూ కుంభకోణం ఆరోపణలతో నుంచి బయపడాలంటే బీజేపీలో చేరటం ఒక్కటే మార్గమని బహుశా ఆయన భావించి వుండవచ్చు. బీజేపీకి కూడా ఈటల అవసరం ఉంది. రాష్ట్రంలో పాగా వేయాలంటే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ చూస్తోంది. ఈ క్రమంలోనే ఈటల గతాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా బీజేపీలో చేర్చుకున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ నేతలు ధీమాతో ఉన్నారు. ఇప్పుడు రాజేందర్‌ గెలిస్తే ఆ పార్టీ మరింత బలం వస్తుంది.

పైగా ఉత్తర తెలంగాణలో సంఘ్‌కు బీజేపీకి బలమైన పునాదులున్నాయి. గ్రామస్థాయిలో కమిటీలు కూడా ఉన్నాయి. అందులో ఉత్తర తెలంగాణలో మూడు ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఇక హుజురాబాద్‌ ఈటల కంచుకోట. పైగా ఆయన సామాజిక వర్గానికి బలమైన ఓటు బ్యాంక్ కూడా ఉంది. హుజురాబాద్‌తో ఈటలకు సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఇవన్నీ గెలుపుకు సహకరిస్తాయనే ధీమాతో బీజేపీ నేతలున్నారు. దీనికి తోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర.. ఆయన వాగ్ధాటితో కేసీఆర్‌ను ఘాటుగా విమర్శిస్తూ ఓటర్లను ఆకర్షిస్తారని ఆ పార్టీ నేతలు గంపెడాశతో ఉన్నారు. అందువల్లే ఢిల్లీని కూడా హుజురాబాద్ ఉప ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లాగ.. హుజురాబాద్ ఉప ఎన్నికను చూడలేమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ బరిలో ఎవరు గెలుస్తారో నవంబర్ 2వరకు వేచిచూడాలి.




Tags:    

Similar News