చిరు వ్యాపారుల‌కు షాకిస్తున్న ఇవాంక టూర్‌

Update: 2017-11-23 05:30 GMT
వ‌స్తుంది అమెరికా అధ్య‌క్షుడి కుమార్తె. అయినా.. హ‌డావుడి చూస్తే అమెరికా అధ్య‌క్షుడికి ఎంతిస్తారో అంత కంటే పిస‌రంత ఎక్కువే అన్న‌ట్లుంది ప‌రిస్థితి. ఇవాంక న‌గ‌రానికి వ‌స్తున్నార‌న్న అతృత కంటే ఇప్పుడామె ప‌ర్య‌ట‌న హైద‌రాబాదీల‌కు చుక్క‌లు చూపిస్తోంది. ట్రంప్ కూతురు ఎందుకు వ‌స్తుంద‌న్నది సామాన్యుల‌కు అర్థం కానిదిగా మారింది. ఏదో మీటింగ్ కోసం ట్రంప్ కూతురు వ‌స్తోంద‌ట క‌దా అని సామాన్యులు చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఇవాంక రాక‌తో భారీ ఎత్తున ఆంక్ష‌లు విధిస్తున్నారు. ముఖ్యంగా ఇవాంక బ‌స చేస్తున్న వెస్టిన్ హోట‌ల్ ప‌రిస‌రాల్లో ఇవి భారీగా ఉంటున్నాయి. ఆమె బస చేసే మాదాపూర్ తో పాటు.. విందుకు హాజ‌ర‌య్యే ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ వ‌ద్ద పోలీసులు బారీ ఎత్తున ఆంక్ష‌లు పెడుతున్నారు.

వెస్టిన్ హోట‌ల్ స‌మీపంలోని చిరు వ్యాపారుల వ్యాపారాల్ని ఇప్ప‌టికే మూసివేయించిన అధికారులు.. చుట్టుప‌క్క‌ల ప్రాంతాల మీద ప‌లు ఆంక్ష‌ల్ని పెడుతున్నారు. వెస్టిన్ కు చుట్టుప‌క్క‌ల ప్రాంతాలైన ఖానామెట్‌.. ఇజ్జ‌త్ న‌గ‌ర్ లోని చిరు వ్యాపారుల‌ను కూడా స‌ద‌స్సు జ‌రిగే మూడు రోజులు మూసేయాల‌న్న ఆదేశాలు జారీ చేశారు. అక్క‌డ నివ‌సించే వారు ఇళ్ల‌ల్లో నుంచి బ‌య‌ట‌కు రావాల‌న్నా.. ఇంట్లోకి వెళ్లాల‌న్నా క‌చ్ఛితంగా గుర్తింపు కార్డు చూపించాల‌నే ష‌ర‌తు విధించారు.

స‌ద‌స్సు జ‌రిగే హెచ్ ఐసీసీ ప్ర‌వేశ ద్వారా ముందు రోడ్డు మీద రెండు వైపులా వ్యాపార స‌ముదాయాలు ఉన్నాయి. వాటిని స‌ద‌స్సు జ‌రిగే మూడు రోజులు మూసేయాల‌ని మాదాపూర్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హైటెక్స్ క‌మాన్ నుంచి న్యాక్ గేట్ వ‌ర‌కు రెండు వైపులా.. సైబ‌ర్ ట‌వ‌ర్స్ నుంచి కొత్త‌గూడ జంక్ష‌న్ వ‌ర‌కు రెండు వైపులా.. కొత్త‌గూడ నుంచి గ‌చ్చిబౌలి ఔట‌ర్ జంక్ష‌న్ వ‌ర‌కు రెండు వైపులా ఉన్న చిన్న హోట‌ళ్లు.. పాన్ షాపులు.. పండ్ల దుకాణాలు.. మెకానిక్ షాపులను తొల‌గించారు. ప‌లుచోట్ల రోడ్ల‌ను మూసి వేస్తున్నారు. ఇజ్జ‌త్ న‌గ‌ర్‌.. ఖానామెట్‌.. ఇజ్జ‌త్ న‌గ‌ర్ వీక‌ర్ సెక్ష‌న్ ల‌లో ఉండే వాహ‌నదారుల‌కు పోలీసులు పాసులు జారీ చేయ‌నున్నారు. ఆ పాసులున్న వాహ‌నాల్ని మాత్ర‌మే హైటెక్స్ క‌మాన్ నుంచి లోప‌లికి అనుమ‌తిస్తారు.  

ఇవాంక టూర్ సంగ‌తేమో కానీ.. ట్రాఫిక్ ఆంక్ష‌లు.. భ‌ద్ర‌తా ప‌ర‌మైన ఆంశాల నేప‌థ్యంలో ఆమె హైద‌రాబాద్ న‌గ‌రానికి ఎందుకు వ‌స్తున్నార‌న్న భావ‌న క‌లిగేలా చేస్తోంది. భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై స్థానికుల్లో చికాకు వ్య‌క్త‌మ‌వుతోంది. ఎంత ట్రంప్ కూతురైతే మాత్రం మాపై ఇన్ని ఆంక్ష‌లు విధిస్తారా? అన్న ఆగ్ర‌హాం ప‌లువురిలో వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News