డేటా చోరీ!... అంత ఉలుకెందుకో?

Update: 2019-03-03 12:41 GMT
ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఏపీ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన కీల‌క స‌మాచారం త‌స్క‌ర‌ణ‌కు సంబంధించిన విష‌యంపై చ‌ర్చే న‌డుస్తోంది. అస‌లు ఏపీ ప్ర‌జ‌ల‌కు చెందిన డేటా...ఏ ఏపీకి చెందిన విజ‌య‌వాడో - లేదంటే గుంటూరో - ఇంకా లేదంటే... ఐటీ హ‌బ్‌గా ఎదురుగుతున్న తిరుప‌తి - విశాఖ‌ల్లోని సంస్థ‌ల్లో క‌నిపిస్తే... ఓ మోస్త‌రు అనుమానాలతో స‌రిపెట్టుకోవ‌చ్చు. అలాంటిది తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాదులోని ఓ గ‌ల్లీలో ఉన్న చిన్న గ‌ది కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న ఐటీ కంపెనీలో ఏపీ ప్ర‌జ‌లకు చెందిన స‌మాచారం మొత్తం ఉందంటే... నిజంగానే పెద్ద ఎత్తున అనుమానాలు రావాల్సిందే క‌దా. ఈ విష‌యంపై అన్ని పార్టీల కంటే ముందుగా ఏపీ ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన టీడీపీనే ఆందోళన చెందాలి. వెంట‌నే రంగంలోకి దిగి... ఏపీ ప్ర‌జ‌ల డేటా హైద‌రాబాదులోని ఓ సంస్థ చేతికి ఎలా చిక్కింద‌ని టీడీపీ స‌ర్కారు విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేయాలి.

అలాంటిది ఈ వ్య‌వ‌హారంపై తెలంగాణ పోలీసుల ద‌ర్యాప్తు అంటేనే టీడీపీ స‌ర్కారు... ప్ర‌త్యేకించి టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు - ఆయ‌న కుమారుడు - మంత్రి నారా లోకేశ్ ప‌డుతున్న హైరానా చూస్తుంటే... నిజంగానే పెద్ద అనుమానాలే రేకెత్తుతున్నాయి. అయినా హైద‌రాబాద్ ప‌దేళ్ల పాటు రెండు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్నా... త‌న‌కు తానుగా హైదార‌బాద్‌ ను వ‌దిలేసి విజ‌య‌వాడ‌కు ప‌రుగు ప‌రుగున ఎందుకు వ‌చ్చేశార‌న్న విష‌యం నిన్న‌టిదాకా చంద్ర‌బాబుకు గుర్తే లేదు. ఇప్పుడు డేటా చోరీకి సంబంధించిన కేసులో సోదాలు అన‌గానే... చంద్ర‌బాబుకు ప‌దేళ్ల పాటు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధాని అన్న విష‌యం గుర్తుకు వ‌చ్చేసింది. అయినా ఏపీ ప్ర‌జ‌ల‌కు సంబంధించి అన్ని ర‌కాలుగా ర‌క్ష‌ణ బాధ్య‌త‌లు తీసుకోవాల్సిన టీడీపీ సర్కారు... ఏపీ ప్ర‌జ‌ల డేటా పొరుగు రాష్ట్రంలోని ఓ కంపెనీలో దొరికితే కేసులు పెట్టాల్సింది పోయి... కేసులెలా పెడ‌తారంటూ గ‌గ్గోలు పెట్ట‌డం చూస్తుంటే... ఈ వ్య‌వ‌హారం మొత్తం టీడీపీ క‌నుసన్న‌ల్లోనే జ‌రిగింద‌న్న అనుమానాలు వ్య‌క్తం కాక మాన‌వు.

అయినా అక్క‌డ ద‌ర్యాప్తు చేస్తున్న తెలంగాణ పోలీసుల‌ను అడ్డుకునేందుకు ఏపీ నుంచి వంద‌లాది మంది పోలీసుల‌ను అక్క‌డికి త‌ర‌లించడం చూస్తుంటే... త‌మ అస‌లు రూపం ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డుతుందోన‌న్న భ‌యాందోళ‌న‌లే టీడీపీలో క‌నిపిస్తున్నాయ‌ని కూడా చెప్ప‌క త‌ప్ప‌దు. ఏపీ ప్ర‌జ‌లకు చెందిన స‌మాచారాన్నంతా గుప్పిటి ప‌ట్టేసిన సంద‌రు సంస్థ త‌మ పార్టీదేన‌ని ఓ వైపు ఒప్పుకుంటూనే... అస‌లు ఆ స‌మాచారం ఆ కంపెనీకి ఎలా చేరింద‌న్న విష‌యాన్ని దాట‌వేస్తున్న వైనం చూస్తుంటే... ఇందులో ఏతో భారీ మ‌త‌ల‌బు ఉన్న‌ట్లుగానే అనుమానించాల్సి ఉంద‌న్న విశ్లేష‌ణ‌లు వెలువడుతున్నాయి. అస‌లు విష‌యాల‌ను వెల్ల‌డించ‌కుండా... ఏదో త‌మకు చెందిన సంస్థ‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఏడ్వ‌డం చూస్తుంటే... నిజంగానే చంద్రబాబు, లోకేశ్... ఇద్ద‌రూ ఈ కేసు ఎక్క‌డ‌ త‌మ మెడ‌కు చుట్టుకుంటుందోన‌ని భ‌య‌ప‌డుతున్నార‌న్న వాద‌నా వినిపిస్తోంది. మొత్తంగా ఏపీ ప్ర‌జ‌ల ద‌న‌మాన ప్రాణాల‌తో పాటు ప్రస్తుత కాలంలో కీల‌కంగా మారిన డేటా చోరీ విష‌యంలో టీడీపీతో పాటు చంద్ర‌బాబు, లోకేశ్ ఉలికిప‌డుతున్న వైనం నిజంగానే త‌ప్పు జ‌రిగిపోయిన‌ట్టుగా ఒప్పేసుకున్నార‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News