మనం ఒకటి అనుకుంటే అవతలోడు మరొకటి అనుకోవటం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి పరిస్థితే టీఆర్ఎస్ కు ఎదురుకానుందా?అన్నది క్వశ్చన్ గా మారింది. గ్రేటర్ ఎన్నికల్నిప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ సర్కారు.. అందులో భాగంగా తనకు అలవాటైన ఉచిత తాయిలాల్ని.. కలర్ ఫుల్ సినిమాను ఎన్నికల మేనిఫేస్టో పేరుతో 70ఎంఎంలో చూపించటం తెలిసిందే.
అయితే.. గులాబీ బాస్ అనుకున్న దానికి.. వాస్తవానికి మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందంటున్నారు. కేసీఆర్ భావించినట్లుగా ఉచిత నీళ్ల హామీ ఎదురుదెబ్బ వేసేలా ఉందంటున్నారు. ఎందుకంటే.. అధికారంలో ఉన్నది కేసీఆరే. అలాంటప్పుడు ఎన్నికల వరకు ఇలాంటి ఉచితాన్ని ఆపాలెందుకు. విడి రోజుల్లో ఎందుకు అమలు చేయలేదు? ఐదేళ్లు పాలించినప్పుడు లేని ఉచితం ఇప్పుడే ఎందుకు ఇస్తున్నట్లు? మా ఓట్ల కోసం ఇచ్చే ఉచితాన్నితిప్పి కొట్టేస్తామంటూ పలువురు మండిపడుతున్నారట.
మరీ.. మేమంత అమాయకులం మాదిరి కనిపిస్తున్నామా? కేసీఆర్ ఫ్రీ నీళ్లు అంటే ఓట్లు గుద్దేస్తామా? ఉచితాల పేరుతో మమ్మల్ని మభ్య పెట్టాలనుకుంటున్నారా? ఈసారి మేమేమిటో చూపిస్తామంటూ పలుకాలనీల్లో వినిపిస్తున్న మాటలు.. టీఆర్ఎస్ అధినాయకత్వానికి ఇబ్బందిగా మారినట్లు చెబుతున్నారు. ఉచిత నీళ్లతో సీన్ మొత్తం మారిపోతుందన్న తమ అంచనాలకు భిన్నమైన ఫీడ్ బ్యాక్ వస్తున్నట్లుగా గులాబీ బ్యాచ్ కు చెందిన కొందరు లోగుట్టుగా ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం.