ఈ యాప్‌..బ్లూవేల్ కంటే డేంజ‌ర‌స్‌

Update: 2017-09-11 09:44 GMT
మనం ఆకాశ రామన్న లేఖలు చూస్తుంటాం కదా.. రాసిన వారి వివరాలు ఉండవు కానీ చేరాల్సిన వారికి మాత్రం చేరుతుంది. కొత్త‌గా వ‌చ్చిన స‌రాహా యాప్ అచ్చూ  ఇలాగే ప‌నిచేస్తుంది. సరాహా.. ఈ అరబిక్ పదానికి అర్థం నిజాయితీ. ఇదో ఆండ్రాయిడ్ యాప్. దీనిని ఇప్పటివరకు కోటి మందికి పైగా డౌన్‌ లోడ్ చేసుకున్నారు. సరాహా ఈ యాప్ డౌన్‌ లోడ్ చేసుకొని ఇందులో అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మనం పెట్టే ఫొటోలు - పోస్టుల గురించి మిగతా సభ్యులు ఫీడ్‌ బ్యాక్ ఇస్తుంటారు. మెసేజ్‌ లు వస్తాయి కానీ ఎవరు పంపారో మాత్రం వివరాలు వెల్లడి కావు. దీంతో మన గురించి పది మంది ఏమనుకుంటున్నారో తెలుసుకొనేందుకు ఇదో వేదికని చాలా మంది యువత భావిస్తున్నారు. అయితే కొందరు సభ్యులు కొంతమందిని టార్గెట్‌ గా చేసుకొని అవమానకరమైన - అసభ్యకరమైన మెసేజ్‌ లు పంపుతూ వారిని మానసికంగా కృంగదీస్తున్నారు.

తాజాగా అలాంటి ఘ‌ట‌నే హైద‌రాబాద్‌ లో జ‌రిగింది. ``నన్ను మీరు ఎప్పటికీ కలువలేరు..నా నవ్వును మీరు ఇక చూడలేరు... ఇవే నా చివరి మాటలు``.. ఇటీవల ఓ యువతి తన ఫేస్‌ బుక్ ఖాతాలో పెట్టిన స్టేటస్ ఇది. ఆమె స్నేహితురాలు దీన్ని చూసి ఖంగారుపడింది. ఆమెను సంప్రదించడానికి ఎంత ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు. దీంతో మరో ఫ్రెండ్‌ కు విషయం చెప్పగా.. ఆయన అర్ధరాత్రి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌ కు ఫోన్ చేసి సహాయం కోరారు. సీపీ వెంటనే ఆ యువతి ఫేస్‌ బుక్ ప్రొఫైల్ ఆధారంగా వివరాలు సేకరించగా కర్ణాటకలోని మంగళూరు ప్రాంతంలో ఉన్నట్టు తెలుసుకున్నారు. వెంటనే మంగళూరులోని తన స్నేహితుడైన ఓ డీసీపీకి సమాచారం అందించారు. ఆయన సైబర్ క్రైం పోలీసుల సహకారంతో కొన్ని గంటల్లోనే మంగళూరులో యువతి ఆచూకీని కనుగొన్నారు. లా స‌ద‌రు అడ్ర‌స్‌ ను చేజిక్కించిన త‌ర్వాత ఆ యువ‌తితో మాట్లాడగా పూర్తి డిప్రెషన్‌ లో ఉన్నట్టు గుర్తించారు. మానసిక వైద్యులు పరీక్షించగా దీనికి కారణం ఆమె ఫోన్‌ లోని సరాహా యాప్ అని తేలింది. అందులో ఆమెకు వ్యతిరేకంగా వచ్చిన ఫీడ్‌ బ్యాక్ కారణంగా డిప్రెషన్‌ కు గురైందని, వేధింపులు పెరుగడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నదని తేలింది. వైద్యులు ఆమెకు చికిత్స అందించి యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రాణాలు నిలిచాయి.

``నువ్వు అందంగా లేవు.. నీకు సరిగా ఇంగ్లిష్ రాదు.. నీ ప్రవర్తన సరిగా లేదు.. నువ్వు వేస్ట్`` వంటివి రోజుకు 50 మెసెజ్‌ లు వస్తే అనుకోకుండానే ఒత్తిడికి గురవుతారు. వారికి కౌంటర్‌ గా ఏదైనా మెసేజ్ పెడితే మరింత రెచ్చిపోయి అసభ్యకరంగా పంపుతారు. దీంతో ధైర్యం లేనివాళ్లు కొన్నాళ్లకు వారు డిప్రెషన్‌ లోకి వెళ్లిపోతారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల ఫోన్‌లపై ఓ కన్నేసి ఉంచాలని, ఇలాంటి యాప్‌ల గురించి ఆరా తీయాలని పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలను ఈ యాప్‌కు దూరంగా ఉంచాలని, చిన్న చిన్న సంఘటనలకు కుంగిపోకుండా మానసిక ధైర్యం పెంచాలని సూచిస్తున్నారు.
Tags:    

Similar News