సీఎం కేసీఆర్ మాటల్ని పోలీసులు లైట్ తీసుకున్నారా?

Update: 2020-04-24 22:30 GMT
ఒక రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాటే ఫైనల్. ఒక అంశంపైన సీఎంగా తనకున్న క్లారిటీ ఏమిటో చెప్పేసిన తర్వాత కూడా దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోకుండా.. ఎవరికి తోచినట్లు వారు వ్యవహరిస్తున్న ధోరణి హైదరాబాద్ మహానగరంలో ఎక్కువైంది. కరోనా ముప్పు నుంచి తప్పించేందుకు లాక్ డౌన్ ను విధించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. నిత్యవసర షాపులకు సంబంధించి తన నిర్ణయాన్ని సూటిగా.. స్పష్టంగా చెప్పేశారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ షాపుల్ని తెరిచి ఉంచాలని.. అలా చేయటం ద్వారా అనవసరమైన ఒత్తిడి ఉండదని.. ప్రజలు ఒకేసారి బయటకు వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని.. అందుకే షాపుల్ని ఎక్కువసేపు తెరిచి ఉంచాలన్న వివరణను ఇచ్చారు.

సీఎం మాట ఇలా ఉంటే.. హైదరాబాద్ మహానగరంలోని పోలీసులు.. ఎవరికి వారు తమకు తోచిన రీతిలో షాపుల్ని మూసివేయిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ మహానగరం మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఉంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దుకాణాల్ని తెరిచే ఉంచేలా అనుమతులు ఉండటంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.

కొన్నిచోట్ల ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతుంటే.. మరికొన్ని చోట్ల ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉదయం ఆరు నుంచి మధ్యామ్నం 2 గంటల వరకూ షాపులు ఓపెన్ అయ్యేందుు అనుమతి ఇస్తున్నారు. కొద్ది ప్రాంతాల్లో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ తెరిచి ఉంచుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఏ పోలీస్ స్టేషన్ కు సంబందించిన పోలీసులు.. తమ పరిధిలోని షాపుల్ని తెరిచి ఉంచే విషయంపై పూర్తి కంట్రోల్ ను ప్రదర్శిస్తున్నారు. దీని కారణం.. షాపుల్ని తెరిచి ఉంచే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాల్ని ఇవ్వకపోవటమేనని చెబుతున్నారు. కరోనా లాంటి ప్రత్యేక సమయాల్లో తీసుకునే నిర్ణయాలు ఆచితూచి అన్నట్లు ఉండాలి. అందుకు భిన్నంగా నా రాజ్యం.. నా ఇష్టం అన్నట్లుగా నిర్ణయాలు ఉండకూడదు. దీని వల్ల అనవసరమైన తలనొప్పులు రావటం ఖాయం. మరీ.. విషయంపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News