పిట్ట పోయింది..కనిపెట్టాలంటూ పోలీసులకు ఫిర్యాదు

Update: 2020-03-01 04:21 GMT
అది పోయింది.. ఇది పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు రోటీన్. అందుకు భిన్నంగా హైదరాబాద్ పోలీసులకు అందిన మిస్సింగ్ కంప్లైంట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడెంకు చెందిన రామలింగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఒక్కసారి ఉలిక్కిపడిన పరిస్థితి. ఎందుకంటే.. అతగాడి ఫిర్యాదు అలా ఉంది మరి.

విదేశాల నుంచి తెప్పించుకున్న ఖరీదైన కాక్ టేల్ పక్షి కనిపించకుండా పోయిందని.. దాన్ని తానెంతో ముద్దుగా పెంచుకుంటున్నట్లుగా వాపోయాడు. మిస్ అయిన తన పక్షిని వెతికి ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. మామూలుగా అయితే.. ఇలాంటి కంప్లైంట్లు తమ వద్దకు వస్తే పోలీసుల రియాక్షన్ మరోలా ఉంటుంది. ఇటీవల కాలంలో మారిన పరిస్థితి.. ఏదైనా ఫిర్యాదు వస్తే.. లైట్ తీసుకున్నంతనే అది కాస్తా సంచలనం కావటం.. చివరకు ఉన్నతాధికారులు అక్షింతలు వేసే వరకూ వెళ్లటంలో.. పోలీసులు సైతం ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

తాజా ఎపిసోడ్ లోనూ ఇలాంటి పరిస్థితి. పక్షి మిస్ అయ్యిందంటూ ఫిర్యాదు తీసుకొచ్చిన వ్యక్తిని కూర్చొబెట్టి.. ఎవరిమీదైనా అనుమానం ఉందా? అని ప్రశ్నించారు. తనకు ఎవరి మీదా అనుమానం లేదని చెప్పగా.. రామలింగేశ్వరరావు ఇంటి వద్ద.. చుట్టుపక్కల సీసీ కెమేరాల్ని పరిశీలిస్తున్నారు. అందులో ఏదైనా కీలక సమాచారం దొరుకుతుందని భావిస్తున్నారు. పోలీసులు టేకప్ చేసిన ఈ కేసు చివరకు ఏమవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News