టీటీడీలో మ‌ళ్లీ వివాదం - బాబుకు త‌గిలిన సెగ‌

Update: 2018-04-21 11:51 GMT
దేశంలో తిరుమ‌ల అత్య‌ధిక హుండీ ఆదాయం ఆర్జించే పుణ్యక్షేత్రం. క‌లియుగ‌పాల‌కుడి నివాసం. మ‌హిమాన్విత‌మై శ్రీ వేంకటేశ్వ‌రుని స‌న్నిధి. కానీ ఈ మ‌ధ్య ఆ ప‌విత్ర తిరుమ‌ల‌లో రాజకీయ క్రీడ పెరుగుతోంది. మ‌రోవైపు తిరుమ‌ల‌లో అన్య‌మ‌త ప్ర‌చారంపై పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత పెద్ద దేశం ఉండ‌గా... పోయి పోయి గుళ్ల‌లోనే ప్ర‌చారం ఏంటన్న‌ది సార్వ‌జ‌నీక అభ్యంత‌రం. నిజ‌మే. అయితే, అస‌లే ఏడాది పాటు పాల‌క మండ‌లి లేకుండా అంత పెద్ద టీటీడీని గాలికి వ‌దిలేసిన బాబు తాజాగా క‌మిటీని నియ‌మించారు. కానీ కొత్త వివాదాన్ని నెత్తిన వేసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నియ‌మించిన‌ పూర్తిస్థాయి టీటీడీ ధర్మకర్తల మండలిలో మ‌హిళ‌లు కూడా ఉన్నారు. వారిలో ఒక‌రు ఎంఎల్ ఏ అనిత‌. ఆమె ఎంపికపై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే ఆమె తాను ఏసు భ‌క్తురాలిని అని స్వ‌యంగా ప్ర‌క‌టించుకున్న వ్య‌క్తి. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

నూతన పాలకమండలిలో చైర్మన్ - ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులతో పాటు 14 మంది సభ్యులు ఉన్నారు. అయితే టీటీడీ బోర్డులో ఏంఎల్ఏ అనిత సభ్యత్వం పొందడం పట్ల స్వామి పరిపూర్ణానంద అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏంఎల్ఏ అనిత స్వయంగా తాను క్రిస్టియన్ అని ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకున్న విషయాన్ని స్వామి పరిపూర్ణానంద తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

"టీటీడీ నూతన పాలక మండలిలో ఓ క్రిస్టియన్ కి అవకాశం ఇవ్వడం ఏమిటి?.. ఇది ఏమి గ్రహచర్యం.. ఇది ఏమి న్యాయం?.. హిందువుల మౌనం చేతకానితనంగా భావిస్తున్నారా?.. ప్రశ్నించే సమయం ఆసన్నం అయింది" అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు.

మ‌రీ విచిత్రం కాక‌పోతే చంద్ర‌బాబు నియ‌మాకం చేసిందే ఏడాది లేటు. దాంట్లోనూ వివాద‌మే. అయినా, ఈకాలంలో ప్ర‌తి ప‌నికి ముందు మ‌నిషి వివ‌రాలు తెలుసుకుంటున్నారు. తిరుమ‌ల నిబంధ‌న‌ల్లో అన్య‌మ‌త వ్య‌క్తుల‌ను నియ‌మించ‌కూడ‌ద‌న్న‌ది ఒక ప్ర‌ధాన నిబంధ‌న. అస‌లే ఇప్ప‌టికే త‌ప్పులుమీద త‌ప్పులు చేసి న‌వ్వుల పాల‌వుతున్న చంద్ర‌బాబు మ‌ళ్లీ ఈ నిర్ణ‌యంతో వివాదాస్పదం అయ్యారు. అంత పెద్ద క‌మిటీని నియ‌మించేట‌పుడు అభ్య‌ర్థులు, వారి పూర్వాప‌రాలు తెలుసుకోకుండా నియ‌మిస్తే ఎలా? పైగా చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ప్ర‌తి రాజ‌కీయ నాయకుడు ఎపుడు ఎక్క‌డ ఏం మాట్లాడాడు అన్న విష‌యాలు కూలంకుషంగా లైబ్ర‌రీ చేస్తార‌ట‌. వారైనా ఈ నిర్ణ‌యం తెలిసిన వెంట‌నే ఆమె మాట్లాడిన వీడియో గురించి ప్ర‌స్తావించాల్సిందేమో! ఎక్క‌డ లోపం ఉన్నా ఇపుడు హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీశారంటూ ర‌చ్చ న‌డుస్తోంది.

దీనిపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించిన‌ట్టు తెలుస్తోంది. అనిత వ్య‌వ‌హారంపై నివేదిక కోరిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఆమెను మారుస్తారా? లేక కొన‌సాగిస్తారా? అన్న‌ది ఇంకా తేలాల్సి ఉంది.


Tags:    

Similar News