దీపను అలా వేధిస్తున్నారట

Update: 2017-03-13 06:58 GMT
అమ్మ మేనకోడలు దీప మరోసారి వార్తల్లోకి వచ్చారు. అమ్మమరణం నేపథ్యంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేయటంతో ఎన్నికల సందడి షురూ అయ్యింది. అదే సమయంలో దీపకు వేధింపులు అంతకంతకూ పెరిగిపోతున్నాయనట. జయలలిత వారసురాలిగా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తహతహలాడుతున్న దీప.. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలన్న విషయాన్ని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే.. తనను ఆర్కేనగర్ నుంచి పోటీ చేయొద్దంటూ పలువురు తనను వేధిస్తున్నారని.. కనీసం తాను ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి ఉందని ఆమె చెబుతున్నారు. తన ఇంటికి గూండాలు వచ్చి బెదిరిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె.. తనను వేధిస్తున్న గుండాలు ఎవరన్న విషయం తనకు తెలీదని చెబుతున్నారు.

‘‘వారు ఏ వర్గానికి చెందినవారో తెలీదు. ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు హెచ్చరికలు చేస్తున్నారు. కుట్రలు పన్నుతున్నారు’’ అని దీప ఆరోపించారు. ఎంజీఆర్ అమ్మదీపా పెరవై అన్న పేరుతో కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు దీప ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్కే నగర్ కు జరిగే ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని భావిస్తున్న దీప.. తాజాగా చేసిన వేధింపు ఆరోపణలు మాట చర్చనీయాంశంగా మారింది.

ఇంటికి వచ్చి మరీ ఆమెను వేధిస్తున్న గూండాలు ఎవరు? వారిని నియంత్రించే విషయంలో పోలీసులు చేస్తున్నదేమిటి?అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరోవైపు అమ్మ వారసురాలిగా చిన్నమ్మను చూసేందుకు ఏమాత్రం ఇష్టపడని ఆర్కేవాసులు దీప విషయంలో మాత్రం పాజిటివ్ గా ఉండటం తెలిసిందే. తాజా పరిణామాల్నిచూస్తుంటే.. ఉప ఎన్నికల బరిలో దీప దిగితే రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారతాయనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News