నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేః ఈట‌ల రాజేంద‌ర్

Update: 2021-07-22 13:30 GMT
రాష్ట్ర రాజ‌కీయాల‌పై గ‌ట్టి ప్ర‌భావం చూపించ‌బోతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు సంబంధించి ఎన్నిక‌ల న‌గారా మోగ‌కుండానే.. పార్టీలు యుద్ధంలోకి దిగాయి. ఈ ఎన్నిక ఇటు ఈట‌ల రాజ‌కీయ భ‌విష్య‌త్ ను నిర్ణ‌యించేది కావ‌డం.. అటు టీఆర్ఎస్ బ‌లాన్ని చాటిచెప్పేది కావ‌డంతో ఎవ‌రికి వారు సీరియ‌స్ గా తీసుకొని పోరాటం ఆరంభించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ‘ప్రజాదీవెన’ పేరుతో పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టారు.

గురువారం ఇల్లంత‌కుంట మండ‌లంలోని మ‌ర్రివానిప‌ల్లె, సీతంపేట గ్రామాల్లో ఈట‌ల ప‌ర్య‌టించారు. వ‌ర్షాన్ని సైతం లెక్క చేయ‌కుండా పాద‌యాత్ర కొన‌సాగించారు. ఈట‌ల వెంట బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు క‌ద‌లివ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌తో మాట్లాడిన ఈట‌ల.. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ప్ర‌శ్నించే వాళ్లు ఉండొద్ద‌నే త‌న‌పై నింద‌లు వేసి బ‌య‌ట‌కు పంపించార‌ని అన్నారు. అంతేకాదు.. తాను రాజీనామా చేసిన ప‌రిస్థితుల గురించి కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

వాస్త‌వానికి త‌నంత‌ట తానుగా.. హుజూరాబాద్ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌లేద‌ని ఈట‌ల చెప్ప‌డం గ‌మ‌నార్హం. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తేనే.. తాను చేసిన‌ట్టు చెప్పారు. అంతేకాదు.. టీఆర్ఎస్ పార్టీని తాను వ‌ద‌ల‌లేద‌ని, వ‌దిలేలా వాళ్లే చేశార‌ని చెప్పారు. అయిన‌వాళ్ల‌కు ఆకుల్లో.. కానివాళ్ల‌కు కంచాల్లో పెట్టే కేసీఆర్.. నిజాయితీగా ఉన్నందుకు, ప్ర‌శ్నించినందుకే త‌న‌ను బ‌య‌ట‌కు పంపించార‌ని అన్నారు.

ఈటల చేసిన ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. మ‌రి, దీనిపై అధికార పార్టీ నుంచి ఎలాంటి కౌంట‌ర్ వ‌స్తుంద‌న్న‌ది చూడాలి. ఇదిలాఉంటే.. అన్ని పార్టీల‌క‌న్నా ముందే మేల్కొన్న ఈట‌ల‌.. పాద‌యాత్ర పేరుతో ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. దీంతో.. హుజూరాబాద్ లో ఇప్ప‌టి నుంచే రాజ‌కీయ వేడి మొద‌లైంది. మ‌రి, ప్ర‌జ‌లు ఎటువైపు నిల‌బ‌డ‌తారు? ఎవ‌రికి ప‌ట్టం క‌డ‌తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News