నా పదవికి రాజీనామా చేస్తా... బుచ్చయ్య చౌదరి

Update: 2019-08-13 09:59 GMT
తెలుగుదేశం సీనియర్ నేతల్లో ఒకరైన బుచ్చయ్య చౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేసమయంలో పార్టీ నేతలకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. సంక్షేమ పథకాలు- జనాదరణ పథకాలు- ప్రత్యక్ష ఆర్థిక లబ్ధి పథకాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినా టీడీపీ ఇంత దారుణంగా ఓడిపోయిందంటే... కచ్చితంగా మనలో లోపం ఉందన్న విషయాన్ని గుర్తించాలని చంద్రబాబుకు హితవు పలికారు. మంత్రులు మొదలుకొని జిల్లా స్థాయి నాయకత్వం, మండల స్థాయి నాయకత్వం తప్పులు చేసిన ఫలితంగానే ఇంత దారుణమైన ఓటమి తెలుగుదేశం చవిచూసిందని చౌదరి విశ్లేషించారు. కొన్ని సార్లు చంద్రబాబు నిర్ణయాలు తనను ఆశ్చర్యపరుస్తాయన్నారు. ఐదారుసార్లు ఓడిన వారికి ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చి నెత్తికి ఎక్కించుకుంటారు? పార్టీకి ఉపయోగపడే వారుంటే పార్టీ బలపడుతుంది... పార్టీయే భరించాల్సిన వారుంటే పార్టీ చితికిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెల్ల ఏనుగులను దూరం పెడితే మంచిదన్నట్లు పార్టీకి సూచించారు.

తాను టీడీఎల్పీ ఉప నేత పదవికి రాజీనామా చేస్తానని, తన పదవిని ఎవరైనా బీసీ నేతకు కేటాయించాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన ప్రకటన చేశారు. బుచ్చయ్య ప్రకటనపై- అధిష్టానానికి బుచ్చయ్య వేసిన ప్రశ్నలపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తనతో పాటు ఇతర సీనియర్లు కూడా తప్పుకుని పార్టీలో యువతకు అవకాశాలు కలిగేలా చూడాలని అందరికీ పిలుపునిచ్చారు.

ఇప్పటికే 60 ఏళ్లు పైపడిన బుచ్చయ్య చౌదరి వచ్చేసారి కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదనుకున్నారో ఏమో...  భవిష్యత్తులో తాన ఎన్నికల్లో పోటీ చేయనని ప్రటించారు. పైగా బుచ్చయ్య టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా చేయడం గమనార్హం. బుచ్చయ్య మాటలను చూస్తుంటే... సమావేశంలో సీనియర్ క్యాడర్ కు నచ్చని నిర్ణయాలేవో చంద్రబాబు తీసుకున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఆ అసంతృప్తిని ఇలా వెళ్లగక్కారేమో అనుకుంటున్నారు.
    

Tags:    

Similar News