హైద‌రాబాద్ నుంచి వెళ్లిపోనున్న అమ్ర‌పాలి!

Update: 2019-07-12 04:55 GMT
ఐఏఎస్ లు ఎంతోమంది ఉంటారు. కానీ.. వారిలో కొంద‌రికి ఉండే గుర్తింపు అంతా ఇంతా కాదు. వారు అడుగు తీసి అడుగు వేస్తే సంచ‌ల‌నం అన్న‌ట్లుగా ఉంటుంది. అలాంటి మ‌హిళా ఐఏఎస్ అధికారుల్లో సెల‌బ్రిటీ స్టేట‌స్ అమ్ర‌పాలి సొంతం. ట్రైనీ ఐఏఎస్ గా హైద‌రాబాద్ కు వ‌చ్చిన‌ప్పుడే ఆమె మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపించేవారు. త‌న మానాన తాను ఉన్న‌ప్పటికి అమ్ర‌పాలి మీద మీడియా అటెన్షన్  కాస్తంత ఎక్కువ‌గా ఉండేది.

మిగిలిన ఐఏఎస్ ల‌తో పోలిస్తే ఆమె తీరు భిన్నంగా ఉండ‌ట‌మే కార‌ణంగా కొంద‌రు చెబుతుంటారు. అంద‌రితోనూ స్నేహంగా ఉండ‌టం.. నిజాయితీ విష‌యంలో ఏ మాత్రం వంక పెట్ట‌లేని రీతిలో ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రించ‌టంతో పాటు.. యాక్టివ్ గా ఉండ‌టం.. ప‌ని విష‌యంలోనూ ఎలాంటి కంప్లైంట్స్ లేన‌ప్ప‌టికీ ఆమె త‌ర‌చూ మీడియాలో నానుతూ ఉండేవారు.

ఎక్క‌డిదాకానో ఎందుకు ట్రైనీగా హైద‌రాబాద్ లో ప‌ని చేసిన ఆమె.. త‌ర్వాతి కాలంలో వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆమె బ‌స చేసిన బంగ్లాలో దెయ్యం ఉందంటూ ప్ర‌చారం చేస్తార‌ని చెప్పిన మాట సంచ‌ల‌నంగా మారింది. 133ఏళ్ల చ‌రిత్ర ఉన్న బంగ్లాలో తాను బ‌స చేస్తున్నంత‌నే త‌న‌కు ప‌లువురు ఐఏఎస్ లు ఫోన్ చేసి అభినందిస్తూ.. మొద‌టి అంత‌స్తులో దెయ్యం ఉంద‌ని చెప్పార‌న్నారు. అయితే.. సామాన్లు చెల్లాచెదరుగా ఉన్నాయ‌ని.. వాటిని తాను స‌ర్దించిన‌ట్లు చెప్పటంతో పాటు.. రాత్రిళ్లు ప‌డుకోవాలంటే భ‌యంగా ఉంటుంద‌న్న వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య పెను సంచ‌ల‌నంగా మారింది.

అమ్ర‌పాలికి సంబంధించి ఏదో ఒక అంశం వార్త‌ల్లో ప్ర‌ముఖంగా రావ‌టంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసంతృప్తితో ఉంటార‌ని చెబుతారు. అయితే.. ఇక్క‌డ పాయింట్ ఏమంటే.. మ‌న‌సుకు అనిపించిన విష‌యాల్ని దాచి పెట్టే ధోర‌ణి అమ్ర‌పాలిలో త‌క్కువ‌. అడిగిన ప్ర‌శ్న‌కు నిర్మోహ‌మాటంగా మాట్లాడేస్తారు. మాట‌ల‌తో ఇరికించాల‌న్న‌ట్లుగా ప్ర‌య‌త్నించే వారి విష‌యంలోనూ ఆమె ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడేస్తారు. నిజానికి అదే ఆమెకు శాపంగా మారింద‌న్న మాట కొంద‌రి నోట వినిపిస్తూ ఉంటుంది. వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ గా పని చేస్తున్న ఆమెను జీహెచ్ ఎంసీ జోన‌ల్ క‌మిష‌న‌ర్ అన్న అప్రాధాన్య‌త ప‌ద‌వికి  బ‌దిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

బ‌దిలీకి కాస్త ముందే ఆమెకు వివాహమైంది.  జీహెచ్ ఎంసీ జోన‌ల్ క‌మిష‌న‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఆమె పెద్ద‌గా వార్త‌ల్లో క‌నిపించ‌ని ప‌రిస్థితి. త‌న పని తాను అన్న‌ట్లుగా ఉండిపోవ‌టం కూడా ఒక కార‌ణంగా చెబుతారు. ఇలాంటివేళ‌లో ఆమె కేంద్ర స‌ర్వీసుల్లోకి వెళ్ల‌నున్నారు. కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న కిష‌న్ రెడ్డి కార్యాల‌యంలో విధులు నిర్వ‌హించేందుకు ఆమె ఎంపిక‌య్యారు.

కిష‌న్ రెడ్డి కార్యాల‌యంలో ఓఎస్డీగా ఆమె బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈ మేర‌కు ఆమెను కేంద్ర స‌ర్వీసులోకి పంపాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ‌ర్త‌మానం అందింది. మొత్తానికి సెల‌బ్రిటీ ఐఏఎస్ అమ్ర‌పాలి హైద‌రాబాద్‌ కు  గుడ్ బై చెబుతున్న‌ట్లే.
Tags:    

Similar News