పాక్ పై భారత్ విజయం...జాదవ్ కు ఉరి రద్దు!

Update: 2019-07-17 17:32 GMT
పాక్ చెర లోని భారత వాయుసేనకు చెందిన మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కు నిజంగానే ఊపిరి నిలిచింది. పాకిస్థాన్ కోర్టు ఖరారు చేసిన ఉరి శిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించిన నేపథ్యంలో... జాదవ్ కు నిజంగానే ఊపిరి నిలిచిందని చెప్పక తప్పదు. జాదవ్ కు విధించిన ఉరి శిక్షను నిలిపివేయడంతో పాటు కేసును పున:సమీక్షించాలని కూడా హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం పాకిస్థాన్ కు సూచించింది. తమ భూభాగంలోకి చొరబడ్డ జాదవ్ కు ఉరి వేయాల్సిందేనని పాక్... పాక్ ఆరోపణలు నిరాధారమని, జాదవ్ ను తమకు అప్పగించాలని భారత్ చాలా కాలం నుంచి వాదులాడుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా... బుధవారం మధ్యాహ్నం ఈ కేసును విచారించిన అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పును ఇచ్చింది.

ఈ తీర్పుతో పాక్ పై భారత్ విజయం సాధించగా, జాదవ్ ప్రాణాలను రక్షించుకుందనే చెప్పాలి. ఈ కేసు విచారణకు మొత్తం 16 మంది న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఏర్పాటు కాగా... అందులో ఏకంగా 15 మంది న్యాయమూర్తులు భారత్ కు అనుకూలంగా తీర్పు చెప్పడం గమనార్హం. అంతేకాకుండా ఈ కేసు విచారణకు సంబంధించి న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కూడా భారత్ కు కల్పించాల్సిందేనని కోర్టు పాక్ కు తేల్చి చెప్పింది. భారత్ తరఫున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే విచారణకు హాజరై భారత వాదనను సమర్థంగా వినిపించారు.

ఇక జాదవ్ కేసు పూర్వపరాల విషయానికి వస్తే... 2016 మార్చి 3న వ్యాపార నిమిత్తం ఇరాన్ కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో బలూచిస్థాన్ లో కులభూషణ్ జాదవ్ ను పాకిస్ధాన్ సైన్యం అరెస్ట్ చేసింది. గూఢచర్యం చేసేందుకు తమ భూభాగంలోకి వచ్చాడని జాదవ్ పై కేసు నమోదు చేసింది. అయితే జాదవ్ కిడ్నాప్ నకు గురయ్యాడంటూ భారత్ చేసిన వాదనను తొలుత అంగీకరించని పాక్.. ఆ తర్వాత తమ వద్దే ఉన్నాడని ఒప్పుకుంది. అదే సమయంలో లెక్కలేనన్ని ఆరోపణలను జాదవ్ పై మోపిన పాక్... విచారణను వేగిరం చేసిన జాదవ్ ను దోషిగా తేల్చేసి ఆయనకు ఉరి శిక్షను ఖరారు చేసింది. అయితే భారత్ కూడా జాదవ్ ను రక్షించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంది.

భారత్ పోరాటంతో తమ జైల్లో ఉన్న జాదవ్ ను చూసేందుకు ఆయన తల్లి భార్యకు రెండేళ్ల క్రితం పాక్ అనుమతించక తప్పలేదు. ఆ తర్వాత భారత్  ఈ కేసులో మరింతగా జోక్యం చేసుకుని ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో భారత్ లో హర్షారేతికాలు వ్యక్తమవుతున్నాయి. ఇక జాదవ్ కేసులో అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని పాక్ తరఫు న్యాయవాదులు కూడా ప్రకటించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో జాదవ్ కు ఉరి శిక్ష దాదాపుగా నిలిచిపోయినట్టే. మరి ఈ కేసు పున:విచారణలో పాక్ ఏ తరహా వైఖరిని అవలంబిస్తుందన్న దానిపై జాదవ్ ఎప్పుడు విడుదలవుతారన్న అంశం ఆదారపడి ఉందన్న వాదన వినిపిస్తోంది.  

Tags:    

Similar News