వ‌రుణ్ గాంధీ..ఓ మంచి వార‌సుడు

Update: 2017-12-17 07:02 GMT
``నాపేరు వెనుక `గాంధీ` లేకుంటే...నేను రెండుసార్లు ఎంపీని కాలేకపోయేవాడ్ని...వారసత్వం అనేది యువత ఆలోచించే విధానాల నుంచి ఆవిర్భవించాలే తప్ప  - కుటుంబ నేపథ్యం నుంచి కాదు` ఇంత నిర్మొహ‌మాటంగా  త‌న వార‌స‌త్వాన్ని ఒప్పుకొని చెప్పుకున్న ఆ వ్య‌క్తి ఎవ‌రంటే...గాంధీ కుటుంబం నుంచి వ‌చ్చిన వ‌రుణ్ గాంధీ. యోధా ఉదయ్‌ సంస్థ ఆధ్వర్యంలో 'దక్కన్‌ డైలాగ్‌' పేరుతో ఆదివారం హైద‌రాబాద్‌ లోని  `సమానత్వ భారతదేశ నిర్మాణం` అనే అంశంపై ఆయన మాట్లాడారు. చట్టసభల్లో యువత పాత్ర గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉన్నదని పార్లమెంటు సభ్యులు ఫిరోజ్‌ వరుణ్‌ గాంధీ అన్నారు. యువతరం ఆశలు - ఆశయాలు - అభివృద్ధిపై చట్టసభల్లో చర్చలు జరిగి, అమల్లోకి వస్తే సామాజిక న్యాయం - చైతన్యం సాధ్యమౌతాయని అభిప్రాయపడ్డారు.

దేశంలో ఆర్ధిక - సామాజిక అసమానతలు పెరుగుతున్నాయని - వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత యువతరం పైనే ఉన్నదని వ‌రుణ్ గాంధీ చెప్పారు. మహారాష్ట్రలోని లాతూర్‌ ప్రాంతంలో రైలుమార్గంలో నీటిని తరలించేటప్పుడు కేవలం రెండు, నాలుగు లీటర్ల చొప్పున నీటిచౌర్యం జరుగుతుందని, ఇది అక్కడి క్షామానికి ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. అదే రాష్ట్రంలోని ముంబయి మహానగరంలో బహుళ అంతస్తుల భవనాలపై స్విమ్మింగ్‌ పూల్స్‌ నిర్మించి - వేల లీటర్ల నీటిని దుర్వినియోగం చేస్తున్నారని ఉదహరించారు. ఈ తరహా అసమానతల నుంచి సమాజం బయటపడాలని ఆకాంక్షించారు. పొరుగువారిని మనం గౌరవించకుంటే...మనకూ ఆదే తరహా అగౌరవం ఎదురౌతుందని, యువతరం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.

`దేశంలో 86 శాతం యువత పదవ తరగతి కంటే ఎక్కువ చదవట్లేదు. దీనివల్ల వారు దినసరి కూలీలుగానే మిగిలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు అనివార్యం` అని వ‌రుణ్ గాంధీ చెప్పారు. రూ.25వేల లోపు సొమ్మును బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్న 14 లక్షల మంది రైతులు జైలులో ఉన్నారని, అదే సమయంలో రూ.18వేల కోట్లు ఎగ్గొట్టిన ఓ పారిశ్రామికవేత్త మారిషస్‌లో తన కుమార్తె వివాహాన్ని రూ.300 కోట్లకు పైగా ఖర్చు పెట్టి చేశారని అన్నారు. దేశంలో ఆర్ధిక సమానత్వం లేదనడానికి ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. 1952 నుంచి 1972 వరకు పార్లమెంటు సమావేశాలు సంవత్సరానికి 130 రోజులు జరిగేవి...ఇప్పుడు 55 నుంచి 65 రోజులు మాత్రమే జరుగుతున్నాయి అని చెప్పారు. భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీరాజ్‌ మాట్లాడుతూ యువతరం లక్ష్యాలను నిర్దేశించుకొని, సవాళ్లను అధిగమిస్తూ - భవిష్యత్‌ పై ఆశలు పెంచుకోవాలని చెప్పారు. తన కెరీర్‌ లోనూ అనేక సవాళ్లు ఎదురయ్యాయని తెలిపారు. మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా, ధైర్యంగా చెప్పాలని, భవిష్యత్‌ విజయాలకు ఎలాంటి లింగభేదానికి తావులేదని వివరించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య గౌడ్‌ మాట్లాడుతూ దేశంలో 65 శాతం మంది యువకులే ఉన్నారని, సమాజ భవిష్యత్‌ ను నిర్దేశించేది వారేనని చెప్పారు. విలువలతో కూడిన జీవనాన్ని యువతరం అలవర్చుకోవాలని సూచించారు.
Tags:    

Similar News