లాక్ డౌన్ వేళ కారు ఆపితే..టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ అన్నాడు తర్వాతేమైందంటే?

Update: 2021-05-23 08:30 GMT
ఎవరెన్ని చెప్పినా లాక్ డౌన్ వేళ.. ఏదో ఒక కారణం చెప్పి బయటకు రావటం.. అదేమంటే.. తమ ‘స్థాయి’ గురించి బడాయి కబుర్లు చెప్పటం.. స్థానిక పరిచయాలతో పోలీసుల్ని ప్రభావితం చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. ఇలాంటి వారికి హైదరాబాద్ పోలీసులు తమదైన షాకిస్తున్నారు. తాజాగా ఈ తరహా ఉదంతం ఒకటి అత్తాపూర్ లో చోటు చేసుకుంది.

లాక్ డౌన్ సమయంలో ఒక కారును అత్తాపూర్ బ్రిడ్జి వద్ద సైబరాబాద్ పోలీసులు ఆపారు. ఆ కారు మీద టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ అని రాసి ఉంది. లాక్ డౌన్ వేళ బయటకు ఎందుకొచ్చారన్న పోలీసుల ప్రశ్నకు.. కారులో ఉన్న వ్యక్తి దురుసుగా సమాదానం ఇస్తూ.. తాను టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ అంటూ బదులిచ్చారు. పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్దంగా కారు రావటం.. అత్యవసర సేవలకు సంబంధించిన ఎలాంటి పత్రం లేకపోవటంపై పోలీసులు సదరు వ్యక్తిని ప్రశ్నించారు.

అయినప్పటికీ ఏ మాత్రం తగ్గని వ్యక్తి.. మరింత చెలరేగిపోయాడు. తానుటీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడ్ని అని.. తననే ఆపుతారా? అని ప్రశ్నించారు. దీంతో.. అక్కడే విధుల్లో ఉన్న ఏసీపీ శివమారుతి సదరు కారును సీజ్ చేసి షాకిచ్చారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పటంతో సదరు వ్యక్తి నోట మాట రాని పరిస్థితి. అయితే.. ఇలాంటి వారు నిజంగానే టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంటా? లేదా? అన్న విషయాన్ని చెక్ చేసి.. తప్పుడు సమాచారాన్ని చెబితే.. ఆ విషయంలోనూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News