15 ఏళ్లు దాటితే వాహనాలు 'తుక్కు' కిందే లెక్క..!

Update: 2023-01-20 05:10 GMT
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఎన్నో సంచనాలను తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. వీటి వల్ల ప్రజలు ఏ మేలు జరిగిందో తెలియదు గానీ సంచనాలకు కేరాఫ్ గా మోదీ సర్కార్ నిలిచింది. తాజాగా కేంద్ర సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు దాటిన అన్ని పాత వాహనాల రిజిస్ట్రేషన్లను కేంద్రం రద్దు చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

2023 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు అమలు కానున్నాయి. దీంతో ఇకపై 15 ఏళ్లు దాటిన పాత వాహనాలన్నీ చెలామణిలో ఉండవు. వీటన్నింటిని తుక్కు కిందకే వాహనదారులు పరిగణించాల్సి ఉంటుంది. ఈ పాత వాహనాలు రిజిస్టర్డ్ స్క్రాప్ సెంటర్లో విక్రయించాల్సి ఉంటుందని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాలుష్య నివారణలో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మోటారు వాహన చట్టంలో సవరణ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ వాహనాలు.. రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల వాహనాలు.. కార్పొరేషన్ల వాహనాలు, రాష్ట్ర రవాణా వాహనాలు.. పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌ వాహనాలు.. ప్రభుత్వ స్వయంప్రతిపత్త సంస్థల వాహనాలు 15 ఏళ్లు పైబడి ఉంటే వాటన్నింటిని రద్దు చేయాల్సి ఉంటుంది.

అయితే వీటిలో ఆర్మీ వాహనాలను మాత్రం చేర్చకపోవడం గమనార్హం. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2023 నుంచి అమల్లోకి రానున్నాయి. గతేడాది నవంబర్‌లోనే రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈమేరకు ఒక ముసాయిదాను విడుదల చేసింది. అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 15 ఏళ్ల నాటి వాహనాలు అన్నింటినీ రద్దు చేయాలని సూచించింది. ఈ నిబంధనలు కార్పొరేషన్లు.. రవాణా శాఖకు చెందిన బస్సులు.. వాహనాలకు వర్తింజేయాలని పేర్కొంది.

ఈ ముసాయిదాపై ప్రభుత్వం 30 రోజుల్లోగా సూచనలు.. అభ్యంతరాలను కోరింది. ఈ విషయంపై నాడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ప్రతి నగరం నుంచి 150 కిలోమీటర్ల లోపు కనీసం ఒక ఆటోమొబైల్ స్క్రాపింగ్ సౌకర్యాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కాగా ఈ తాజా నిబంధనలను కేంద్రం ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనుంది. అయితే కేంద్రం నిర్ణయంపై వాహనదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News