రేషన్, పింఛన్ కావాలంటే కిలో మీటర్ వెళ్లాల్సిందే ... ఆ గ్రామంలో వింత సమస్య !

Update: 2021-04-03 11:30 GMT
ప్రస్తుత రోజుల్లో ఇంటర్ నెట్ లేనిదే అసలు ఏ పని కూడా జరగడం లేదు. ఉదయం లేచిన సమయం నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ కూడా అదే ఇంటర్ నెట్ తో సహజీవనం చేస్తుంటారు. ఇంటర్ నెట్ కాసేపు లేకపోయినా కూడా జీవితంలో ఎదో కొంచెం వెలితి ఉన్నట్టే..పరిస్థితి ఎంతలా తయారయ్యింది అంటే తినే తిండి కూడా ఇంటర్ నెట్ లో చూసి చేసుకుంటున్నారు. అలాగే ,  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకి కూడా ఇంటర్ నెట్ కావాల్సిందే. ఇదే ఇప్పుడు ఆ గ్రామ ప్రజలకి శాపంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే...అనంతపురం జిల్లాలోని ఓ తండావాసులకు వింత సమస్య వెంటాడుతోంది.  వజ్రకరూరు మండలం NNP తండాలో రేషన్ బియ్యం, పింఛన్ పంపిణీకి అవరోధాలు ఎదురవుతున్నాయి. వాలంటీర్లు పథకాలను అందించేందుకు లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళితే ఏ మొబైల్ నెట్ వర్క్ అందుబాటులో ఉండటం లేదు. సిగ్నల్స్ రాక పంపిణీకి అష్టకష్టాలు పడుతున్నారు.. సరైన సమయానికి లబ్దిదారులకు అందించలేకపోతున్నారు.గ్రామంలో ఎవరికైనా పింఛన్ ఇవ్వాలంటే ఆ ఊరి నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దూరం వెళ్లాల్సిందే. అప్పుడు మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. అందుకే, చేసేదేమీ లేక ఆ గ్రామంలో పింఛన్ తీసుకోవాలన్నా బియ్యం తీసుకోవాలన్నా ఊరి బయటకు వచ్చి తీసుకుపోవాల్సిందే. అక్కడ లబ్దిదారులు తమ వేలిముద్రలు వేసి పింఛన్, రేషన్ తీసుకుంటున్నారు. అయితే కొంతమంది వృద్ధులు, వికలాంగులు రావాలంటే ఇబ్బందిపడుతున్నారు. రేషన్, పింఛన్ మాత్రమే కాదు అత్యవసరమైన 108కు ఫోన్ చేయాలన్నా సిగ్నల్ రావడం లేదట. విద్యార్థుల ఆన్లైన్ క్లాస్‌లకు సమస్యలు తప్పడం లేదు. 3వేలమంది జనాభా ఉన్న ఈ గిరిజన తండాలో సిగ్నల్ సమస్యను అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా కూడా సరైన  ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మా ఊరి సమస్య ను తీర్చండి అని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.
Tags:    

Similar News