వీఆర్ఏల ఎఫెక్ట్: ఇంటెలిజెన్స్ వైఫల్యంపై కేసీఆర్ సీరియస్?

Update: 2022-09-15 04:44 GMT
తెలంగాణలో ఇంటెలిజెన్స్ వైఫల్యం మరోసారి బట్టబయలైంది. ఇంతకుముందు ఆర్మీ అభ్యర్థులంతా హైదరాబాద్ వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేసిన విధ్వంసకాండలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. దీనిపై ప్రభుత్వం అప్పుడే సీరియస్ అయ్యింది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వానికి 'వీఆర్ఏ'ల అసెంబ్లీ ముట్టడి అవమానకరంగా తయారైంది. అసెంబ్లీ సమావేశాల వేల వేల మంది వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ వచ్చినా కూడా పోలీసులు కనిపెట్టలేకపోయారు. హైదరాబాద్ కు మూడు రోజుల ముందే చాటుగా వచ్చి వారు చేసిన నిరసన అసెంబ్లీ సమావేశాల వేళ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసింది.

పోలీసులకు తెలియకుండా వేలమంది వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి ఎలా వచ్చారు? అనే అంశంపై ఇంటెలిజెన్స్ అధికారులపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. దీంతో అధికారుల వైఫల్యంపై డీజీపీ మహేందర్ రెడ్డి రివ్యూ చేశారు.

ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ కు తెలియకుండా సుమారు 6వేల మంది వీఆర్ఏలు ఎలా వచ్చారని ప్రశ్నించినట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ వీఆర్ఏల ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ ఇంటెలిజెన్స్ ఛలో అసెంబ్లీని పసిగట్టలేకపోయింది. మంగళవారం ఏడు సంఘాలు ఒకేసారి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించాయి.

హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అనేక మంది వీఆర్ఏలు మూడు రోజులు ముందుగానే హైదరాబాద్ లోని బంధువుల ఇళ్లకు చేరుకున్నారు. మంగళవారం విడతల వారీగా 6వేల మంది వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం, కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడిలను కూడా తెలంగాణ ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోవడం గమనార్హం.

వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపిన అనంతరం మాట్లాడారు. 15 మందితో భేటి అయిన కేటీఆర్ వారి డిమాండ్లు తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని.. ఈనెల 20న మరోసారి చర్చిద్దామని.. ఆందోళన విరమించాలని వారికి సూచించారు. దీంతో ఇందిరాపార్క్ వద్ద ఉన్న ఇతర వీఆర్ఏలతో చర్చించి తాము నిర్ణయం చెబుతామని వీఆర్ఏ ల ప్రతినిధులు మంత్రికి తెలిపారు.

అయితే వీఆర్ఏల ఆందోళనలు మాత్రం కేసీఆర్ సర్కార్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. అందుకే నష్ట నివారణ చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News