కొత్త పుంతలు తొక్కుతున్న టెస్ట్ క్రికెట్!

Update: 2019-07-23 11:25 GMT
సంప్రదాయక టెస్ట్ క్రికెట్ లో కూడా సరికొత్త మార్పులకు స్వాగతం పలుకుతున్నాయి కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు. ఈ ప్రయోగాల విషయంలో ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ లు ముందుంటున్నాయి.  ఇప్పటికే  పింక్ బాల్ ప్రయోగం- డే అండ్ నైట్ టెస్టులు వంటి మార్పులకు శ్రీకారం చుట్టాయి ఆ దేశాల క్రికెట్ బోర్డులు. ఆ మార్పులకు మిశ్రమ స్పందన వచ్చింది.

అయితే మిగతా దేశాలు ఆ మార్పులను స్వాగతించడం లేదు. దీంతో అలాంటి ప్రయోగాలు కొన్ని దేశాల మధ్యన మ్యాచ్ లకే పరిమితం అవుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఆసీస్- ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు మరో మార్పుకు శ్రీకారం చుట్టాయి.

త్వరలో జరగనున్న యాషెస్ సీరిస్ కు తమ తమ జట్లను ఈ ఇరు దేశాలూ కాస్త డిఫరెంట్ గా పరిచయం చేస్తున్నాయి. ఇప్పటి వరకూ టెస్ట్ క్రికెట్ జెర్సీలు ఎలా ఉంటాయో క్రికెట్ ఫ్యాన్స్ కు తెలిసిన సంగతే. తెలుపు రంగు దుస్తుల్లోనే క్రికెటర్లు టెస్టులు ఆడతారు. దశాబ్దాల కిందటి వరకూ వన్డేలను కూడా తెలుపు రంగుల్లో ఆడే వారు. అయితే ప్రపంచకప్ నుంచి మార్పు జరిగింది. వన్డేలకు రంగుల దుస్తులు వచ్చాయి. టెస్టులకు మాత్రం తెలుపు దుస్తులే  మిగిలాయి.

అలాగే వన్డేల్లో జెర్సీ  నంబర్లు, జెర్సీలపై ఆటగాళ్ల పేర్లను మెన్షన్ చేయడం మొదలైంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్లు, పేర్లు  వంటివి ఇప్పటి వరకూ లేవు. ఈ క్రమంలో యాషెస్ సీరిస్ నుంచి మార్పు చేస్తున్నారు.

ఆసీస్, ఇంగ్లండ్ ల మధ్యన జరిగే ఆ టెస్టు సీరిస్ లో ఆటగాళ్ల నంబర్లు, పేర్లు వారి జెర్సీలపై ఉంటాయి. వన్డేలకే పరిమితం అయిన ఈ సొబగును టెస్టులకూ అద్దుతున్నారు. తెలుపు-గోధువ వర్ణాల్లోనే ఆటగాళ్ల జెర్సీలున్నా పేర్లు, నంబర్లు వాటికి యాడ్ కాబోతున్నాయి. మరి మిగతా దేశాలు ఈ మేరకు మార్పు చేస్తాయో చేయవో!
Tags:    

Similar News