చైనాను వణికిస్తున్న కరోనా.. షాంఘై నగరం విలవిల!

Update: 2022-04-15 06:32 GMT
కరోనా విజృంభణతో చైనా అల్లాడిపోతోంది. ముఖ్యంగా చైనా ఆర్థిక నగరం షాంఘై మహమ్మారి కారణంగా విలవిలలాడుతోంది. చాలా రోజులుగా లాక్ డౌన్ లో ఉన్న ప్రజలకు తినేందుకు బక్కెడు బువ్వ దొరకక నానా అవస్థలు పడుతున్నారు. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవడం ఏంటో కానీ... ఆకలికి తట్టుకోలేక ప్రాణులు విడుస్తామోననే భయంతో చైనీయులు విలపిస్తున్నారు. బ్రెడ్డు ముక్కలు ఇచ్చైనా సరే మమ్మల్ని కాపాడండి అంటూ..తమ ఇళ్లలోని బాల్కనీలు, కిటీకీల్లోంచి చూస్తూ అరుస్తున్నారు.

షాంఘై నగరంలో దాదాపు రెండున్నర కోట్ల మంది ఉన్నారు. అయితే వీరిలో ఉన్న సామాన్య ప్రజలే కాకుండా కోటీశ్వరులు కూడా ఆహారం లేక అల్లాడిపోతున్నారంటేనే విషయం అర్థమవుతోంది. షాంఘై నగరంలో అధికారులు ఆహారం సరఫరా చేస్తున్నప్పటికీ... అవి సరిపోక జనం ఆకలితో అలమటిస్తున్నారు.

కొంత మంది అయితే ధైర్యం చేసి ఆహారం కోసం రోడ్లపైకి పరుగులు తీస్కున్నారు. అక్కడక్కడా లూటీలు జరుగుతున్నాయి. మరో వైపు నిత్యావసర వస్తువులు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారి వల్ల కావట్లేదు.

రెండున్నర కోట్ల జనాభా కలిగిన మహా నగరం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్నప్పటికీ నిత్యం రికార్డు స్థాయి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గురువారం ఒక్కరోజే 27 వేల పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. 'డైనమిక్‌ కొవిడ్‌ వ్యూహాన్ని' కచ్చితంగా అమలు చేస్తామని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఉద్ఘాటించిన మరుసటి రోజే కేసుల సంఖ్య మరింత పెరిగాయి. అయితే వీటిని అదుపు చేసేందుకు ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.

అత్యవస సర్వీసులు మినహా మరెవరూ రోడ్ల మీదకు రాకూడాదని హెచ్చరిస్తున్నారు. ధరలు పెంచి అమ్మినా, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డా శిక్షలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు. నకిలీ పాస్ లతో తిరిగినా, తప్పుడు సమాచారం, వదంతులు వ్యాపింపజేసినా సహించబోమని స్పష్టం చేశారు. ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డా... జైలుకు పంపుతామని వివరించారు. కానీ ఆహార పదార్థాలు అందరికీ సరిపోయేలా అందినచప్పడే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండగలరని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నందున లాక్ డౌన్ కఠఇన ఆంక్షలు తప్పవని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తెలిపారు. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షలను తట్టుకోవడం ద్వారా మాత్రమే మహమ్మారిపై విజయం సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు వీలయినంత వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.
Tags:    

Similar News