ప‌వ‌ర్ షాక్‌.. ప్ర‌యాణం భారం

Update: 2021-12-03 07:30 GMT
తెలంగాణ‌లో క‌రెంట్‌ను ముట్టుకోకుండానే షాక్ కొట్టే ప‌రిస్థితులు రాబోతున్నాయా? ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణం మ‌రింత భారం కానుందా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇటు విద్యుత్ ఛార్జీల‌ను అటు టికెట్ రేట్ల‌ను పెంచే దిశ‌గా రంగం సిద్ధ‌మ‌వుతుండ‌డ‌మే అందుకు కార‌ణం.

నష్టాల్లో ఉన్నామ‌ని గట్టెక్కేందుకు రేట్లు పెంచ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని చెబుతున్న ఈ రెండు సంస్థ‌లు ప్ర‌జ‌ల వెన్ను విరిచేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అస‌లే క‌రోనా కార‌ణంగా అస్త‌వ్య‌స్త‌మైన ప్ర‌జ‌ల జీవితాల‌పై టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఇప్పుడు ఈ రేట్ల పెంపుతో దారుణంగా వ్య‌వ‌హ‌రించ‌బోతుంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

న‌ష్టాల్లో ఉన్న ఆర్టీసీని గ‌ట్టెక్కించాలంటే టికెట్ రేట్లు పెంచ‌క త‌ప్ప‌ద‌ని తెలంగాణ ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్‌, ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ప‌దేప‌దే చెబుతున్నారు. అందుకు త‌గిన‌ట్లుగానే టికెట్ రేట్ల పెంపుపై ప్ర‌తిపాద‌న‌ను సీఎం కేసీఆర్‌కు ఇప్ప‌టికే పంపించేశారు.

గ‌త నెల‌లోనే ఈ పెంపుపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని అనుకున్నారు. కానీ టీఆర్ఎస్ 20వ వార్షికోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా భారీ బ‌హిరంగ స‌భ పెట్టాల‌నుకోవ‌డంతో టికెట్ల పెంపు నిర్ణ‌యాన్ని వాయిదా వేశారనే వార్త‌లు వినిపించాయి.

కానీ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావ‌డంతో స‌భ వాయిదా ప‌డింది. దీంతో టికెట్ల రేట్ల పెంపు విష‌యంపై కూడా స్త‌బ్ధ‌త నెల‌కొంది. కానీ తాజాగా అజ‌య్ కుమార్ మ‌రోసారి టికెట్ రేట్లు పెంచాల్సిందే అని ప్ర‌క‌టించ‌డంతో తిరిగి చ‌ర్చ మొద‌లైంది.

గ‌డిచిన మూడేళ్ల‌లో ఆర్టీసీకి రూ.4,260 కోట్ల మేర న‌ష్టాలు వ‌చ్చాయ‌ని చెప్పిన మంత్రి.. పెరుగుతున్న న‌ష్టాల‌ను త‌గ్గించుకోవాలంటే ఛార్జీల పెంపు త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ప‌ల్లె వెలుగుకు కిలోమీట‌ర్కు రూ.25 పైస‌లు, మిగ‌తా స‌ర్వీసుల‌కు కిలోమీట‌ర్కు రూ.30 పైస‌ల చొప్పున పెంచాల‌ని ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపించిన‌ట్లు చెప్పారు.

దీనిపై త్వ‌ర‌లోనే కేసీఆర్ ఆమోద ముద్ర వేసే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు క‌రెంటు ఛార్జీల‌ను భారీగా పెంచాల‌ని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ప్ర‌భుత్వాన్ని కోరాయి. ఒక్కో యూనిట్‌కు స‌గ‌టున రూపాయి చొప్పున ఛార్జీలు పెంచితే త‌ప్ప ఆర్థిక క‌ష్టాలు తీర‌వ‌ని డిస్కంలు భావిస్తున్నాయి.

అయిదేళ్లుగా ఒక్క‌పైసా కూడా ఛార్జీ పెంచ‌క‌పోవ‌డంతో న‌ష్టాలు, ఆర్థిక లోటు పెరిగిపోయాయ‌ని డిస్కంలు చెబుతున్నాయి. గ‌తంలో లాగా యూనిట్‌కు 5 లేదా 10 పైస‌లు పెంచితే క‌ష్టాలు తీర‌వ‌ని అందుకే రూపాయి చొప్పున పెంచాల‌ని ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపించ‌నున్నాయి.

అలా పెంచితే ఏటా రూ.4 వేల కోట్ల ఆదాయం అద‌నంగా వ‌స్తుంద‌ని స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.6928 కోట్లు లోటు కొన‌సాగుతుంద‌ని డిస్కంలు అంచ‌నా వేశాయి. ఈ ప్ర‌తిపాద‌న‌కు కూడా ప్ర‌భుత్వం ఆమోదం తెలిపే అవ‌కాశాలే మెండుగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇటు పెరిగిన క‌రెంట్ రేటు క‌ష్టాలు.. అటు ఆర్టీసీ రేట్ల పెంపు ప్ర‌జ‌ల‌పై పెను భారంగా మారుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.





Tags:    

Similar News