పెద్దన్న ఇమేజ్ పోయింది..భారత్ పడిపోయిందట

Update: 2017-03-08 04:38 GMT
పదేళ్ల మౌన ప్రధాని తర్వాత.. మాట్లాడే ప్రధాని మోడీని చూసి మురిసిపోని భారతీయుడు ఉండడు. పెద్దరికంతో తరచూ ఆయన చెప్పే మాటలు విన్నవారంతా ఆయన మాటలతో ఎక్కడికో వెళ్లిపోతుంటారు. భారత్ వెలిగిపోతుందన్న రీతిలో ఆయనమాటలు ఉండటం తెలిసిందే. భారత్ ను ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తాను నడిపిస్తున్నానని.. అబివృద్ధి పథంలో దూసుకెళుతోందంటూ చాలానే మాటలు చెబుతుంటారు. అయితే.. ఆ మాటలకు చేతలకు మధ్య ఎలాంటి సంబంధం లేదన్న విషయం తాజాగా తేలిపోయింది.

అమెరికాకు చెందిన యుఎస్ న్యూస్.. వరల్డ్ రిపోర్ట్ సంస్థ 80 దేశాలతో కూడి అత్యుత్తమ దేశాల జాబితాను ప్రకటించింది. ఈ సందర్భంగా భారత్ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదన్నవిషయం ఈ రిపోర్ట్ చెప్పేసింది. అంతేనా.. మోడీ ప్రధాని అయ్యాక.. భారత్ దూసుకెళుతుందన్న మాటలు వినిపిస్తున్నా.. ఈ నివేదికలో మాత్రం గత ఏడాది కంటే మూడు స్థానాలు భారత్ పడిపోవటం గమనార్హం. గతేడాది కంటే భారత్ మూడు స్థానాలు దిగజారి 25వ ర్యాంకులో నిలిచింది. వృద్ధిరేటులో మూడో స్థానంలో.. చరిత్ర.. వారసత్వంతో 5వ స్థానం.. శక్తివంతమైన దేశాల్లో 16వ స్థానాలు భారత్ కు లభించాయి.

ఇక.. అగ్రరాజ్యమైన అమెరికా విషయానికి వస్తే..ఆదేశ పరిస్థితి దారుణంగా తయారైంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక పెద్దన్నగా ఉండే అగ్రరాజ్యం ఇమేజ్ దారుణంగా దెబ్బ తిన్న వైనం కనిపిస్తుంది. ట్రంప్ తీరు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. అత్యుత్త దేశాల జాబితాలో అమెరికా ఏకంగా ఏడో స్థానానికి దిగజారటం గమనార్హం. గత ఏడాది ఇదే జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన అమెరికా ఈసారి ఏడోస్థానానికి పడిపోయింది.

గత ఏడాది అగ్రస్థానంలో నిలిచిన జర్మనీ.. ఈసారి నాలుగో స్థానానికి పడిపోయింది. వరుస ఉగ్రదాడులతో ఆ దేశం అట్టుడికి పోవటం.. వ్యాపార అవకాశాలు.. పౌరసత్వం.. జీవన నాణ్యత విభాగాల్లో వెనుకబడిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా 21 వేల మంది వ్యాపారవేత్తలు.. ప్రముఖులు.. సగటు జీవుల నుంచి అభిప్రాయాల్ని సేకరించి ఈ నివేదికను సిద్ధం చేశారు. 65 అంశాలపై ప్రశ్నలు అడిగి.. తొమ్మిది విభాగాల్లో ర్యాంకుల్ని ఫిక్స్ చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత అగ్రరాజ్య నాయకత్వం పట్ల తాము కొంత గౌరవం కోల్పోయినట్లుగా సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది వెల్లడించటం విశేషం. బిజినెస్.. పౌరసత్వం.. పర్యాటకం.. విద్య.. పారదర్శకత.. సంస్థల స్థాపన తదితర విభాగాల్లో అమెరికా వెనుకపడిపోయింది. ఇక.. జాబితాలో ఫస్ట్ ఫ్లేస్ ను స్విట్జర్లాండ్ సాధించగా.. రెండో స్థానాన్ని కెనడా.. మూడో స్థానాన్ని బ్రిటన్ నిలిచాయి. జర్మనీ నాలుగో స్థానాన్ని.. జపాన్ ఐదో స్థానంలో నిలిచింది. పవర్ ఫుల్ దేశాల జాబితాలో మాత్రం అమెరికా తొలి స్థానంలోనే నిలిచింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News