శ‌వాలు ఇస్తాం..ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి!

Update: 2019-08-04 08:54 GMT
రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌తో భార‌త్‌ ను ముప్పుతిప్ప‌లు పెడుతున్న పాకిస్తాన్‌ ను అదే రీతిలో ఇండియా ఇర‌కాటంలో ప‌డేసింది. దెబ్బ‌కు దెబ్బ తీయడంలో భాగంగా కీల‌క ష‌ర‌తు విధించి త‌మ వారిని చివ‌రి చూపు చూసుకుంటారో లేదో తేల్చుకోవాల్సిన ప‌రిస్థితిని క‌ల్పించింది. పాకిస్థాన్‌ కు చెందిన బోర్డర్‌ యాక్షన్‌ టీం (బ్యాట్‌) దుందుడుకు చర్యలను భారత ఆర్మీ తిప్పికొట్టింది. ‘పాక్‌ బ్యాట్‌ కు చెందిన సభ్యులు - ఉగ్రవాదులతో కూడిన బృందం జమ్ముకశ్మీర్‌ కెరణ్‌ సెక్టార్‌ లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న భారత ఆర్మీ పోస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతుండ‌గా అప్రమత్తమైన మన జవాన్లు ధీటుగా బదులిచ్చారు. పాక్‌ కు చెందిన ఐదు నుంచి ఏడుగురు చొరబాటుదారులను హతమార్చారు. అయితే - వారి శవాల విష‌యంలో తెల్ల‌జెండాల‌తో వ‌స్తేనే...అందిస్తామ‌ని భార‌త్ ష‌ర‌తు పెట్టింది.

జూలై 31వ తేదీన అర్ధరాత్రి దాటాక జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లా కెరన్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద కొందరు వ్యక్తులు భారత్‌ లోకి చొరబడేందుకు యత్నించగా వారిలో దాదాపుగా 5 నుంచి 7 మందిని భారత సైనికులు మట్టుబెట్టారు. ఈ క్రమంలో చనిపోయిన వారు పాక్‌కు చెందిన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (ఎస్‌ఎస్‌జీ) కమాండోలు లేదా ఉగ్రవాదులు అయి ఉంటారని భావిస్తున్నారు. ఆ మృతదేహాలను తీసుకెళ్లేందుకు పాక్ సైనికులు తెల్ల జెండాలతో రావాలని భారత్ సూచించింది. అయితే పాక్ ఈ ఆఫర్‌ పై ఇంకా స్పందించలేదు.

కశ్మీర్‌ లోయలో శాంతికి విఘాతం కలిగించడంతోపాటు అమర్‌ నాథ్‌ యాత్రికులను లక్ష్యంగా చేసుకునేందుకు పాక్ గత నాలుగు రోజుల క్రితం అనేక ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో జరిగిన రెండు ఎన్‌ కౌంటర్లలో నలుగురు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు హతమయ్యారని  కల్నల్‌ రాజేష్‌ కాలియా వెల్లడించారు. పాక్‌ గుర్తులున్న తుపాకీతోపాటు ఐఈడీ - మైన్లు వారి వద్ద లభించాయని రాజేశ్‌ వివరించారు. ఇదే స‌మ‌యంలో - పాక్‌ ఆర్మీ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. శనివారం జమ్ముకశ్మీర్‌ లోని పూంచ్‌ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి భారత సైనిక పోస్టులు - గ్రామాలపై కాల్పులు జరిపింది.
Tags:    

Similar News