భార‌త్ స్ఫూర్తి: ఆస్ట్రేలియాలో అదుపులోకి క‌రోనా

Update: 2020-04-26 07:35 GMT
వైర‌స్ రాక‌ను ముందే ప‌సిగ‌ట్టి ముంద‌స్తు చ‌ర్యల్లో భాగంతా భార‌త‌దేశంలో లాక్‌డౌన్ విధించారు. అయితే ఈ లాక్‌డౌన్ వ‌ల‌న భార‌త‌దేశంలో క‌రోనా వ్యాప్తి త‌గ్గ‌క‌పోయినా ఈ చ‌ర్య మాత్రం విదేశాల‌కు స్ఫూర్తిదాయ‌కంగా నిలిచింది. భార‌త‌దేశాన్ని చూసి మిగ‌తా దేశాలు ముందుగానే లాక్‌డౌన్ ప్ర‌క‌టించి క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌య‌త్నించాయి. అయితే ఆ దేశాల్లో ఆ ప్ర‌య‌త్నం విజ‌య‌వంత‌మైంది. దీంతో క‌రోనా వైర‌స్ వ్యాప్తి చాలా త‌క్కువ స్థాయిలో ఉంది. ఇదే ప‌రిస్థితి ఆస్ట్రేలియాలో ఉంది. ఆ దేశంలో అనూహ్యంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య త‌గ్గిపోయింది. ఆ దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 6,695 పాజిటివ్ కేసులు న‌మోదై ఉన్నాయి. వారిలో కోలుకున్నవారి సంఖ్య ఏకంగా 5,372 ఉంది. అయితే క‌రోనా బారిన ప‌డి కేవ‌లం 50మంది చ‌నిపోయారు.

ఆస్ట్రేలియాలో ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వ్యాప్తిలో వేగం త‌గ్గింది. వైరస్‌ను ఆ దేశంలో తీవ్రంగా క‌ట్ట‌డి చేశారు. ఇప్పుడు కేవ‌లం వంద‌ల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చలికాలం రాబోతోంది. ఉష్ణోగ్ర‌త్త‌లు అనూహ్యంగా త‌గ్గిపోయి క‌రోనా వైర‌స్ విజృంభించే అవ‌కాశం ఉంద‌ని గుర్తించిన ఆ దేశ ప్ర‌భుత్వం వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైంది. తీవ్రమైన నిర్ణ‌యాలు తీసుకుని దేశంలో క‌రోనాపై పోరు సాగించింది. లాక్‌ డౌన్ విధించి ఇప్పుడు సుర‌క్షితంగా ఆ దేశం బ‌య‌ట‌ప‌డ‌బోతోంది.

మార్చి రెండో వారం ఆస్ట్రేలియా అప్రమత్తమైంది. అప్పుడు భారత‌దేశం‌లో కొందరు ఆస్ట్రేలియావాసులు చిక్కుకుని ఉన్నారు. వారిని త‌మ దేశానికి రప్పించేందుకు చివరి తేదీ ప్రకటించగా అప్పటికే భారత్‌ లో కరోనా కేసులు మొద‌ల‌య్యాయి. ఈ క్ర‌మంలో భార‌త్‌ లో క‌రోనా క‌ట్ట‌డి కోసం లాక్‌ డౌన్ విధించారు. ఈ స‌మ‌యంలో తాము భార‌త్‌ లోనే ఉంటామ‌ని తమ దేశ ప్ర‌జ‌లు చెప్ప‌డాన్ని ఆ దేశం గుర్తించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆలోచించి భార‌త్ పాటించిన చ‌ర్య‌ల‌ను అమ‌లు చేసింది.

ఆస్ట్రేలియాలో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మేమిటంటే ఆ దేశ రాజధాని కాన్‌ బెర్రాలో ఒక్క క‌రోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఆ దేశంలో అత్య‌ధికంగా సిడ్నీలో క‌ర‌నా కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డం మొద‌లుపెట్టిన త‌ర్వాత‌ దేశ ప్రభుత్వం ఆంక్షలను కచ్చితంగా, క‌ఠినంగా అమలుచేసింది. ఆ దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ పూర్తి లాక్‌ డౌన్ విధించ‌లేదు. కొన్ని ఆంక్షలతో లాక్‌ డౌన్ అమ‌లుచేశారు. మందుల దుకాణాలు - పాలు - కూరలు - ఇతర నిత్యావసరాల కోసం ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు తెరిచి ఉంచారు. మిగతా స‌మ‌యం మూసి ఉంచారు. రెస్టారెంట్లు మూసి వేసి ఉంచ‌గా కేవలం పార్సిళ్ల‌కు అనుమ‌తి ఇచ్చారు. రోడ్లపైకి రాత్రిళ్లు ప్ర‌జ‌ల రాక‌పోక‌ల‌కు నిషేధం విధించారు. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపేశారు.

కరోనా పాజిటివ్‌ అని తేలిన వారిలో ఆరోగ్య పరిస్థితి మామూలుగా ఉంటే వారిని ఇంట్లో ఐసోలేట్‌ చేసి ఆన్‌ లైన్‌ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ వైద్య సాయం అందిస్తున్నారు. ఆరోగ్యం క్షీణిస్తేనే ఆస్ప‌త్రులకు తరలిస్తున్నారు. ఈ విధంగా ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు అమ‌లు చేస్తుండ‌డంతో ఆ దేశం ప్ర‌స్తుతం క‌రోనా నుంచి కొంత కోలుకుంది. ఇదే మాదిరి భార‌త్‌ లో అమ‌లుచేస్తున్నా కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ప్ర‌జ‌లు స‌హ‌క‌రిస్తే త్వ‌ర‌లోనే భార‌త్ కూడా క‌రోనా నుంచి కోలుకునే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News