డ్రాగన్‌ పైకి విల్లు ఎక్కుపెట్టిన రాముడు: భారత్‌ కు హాంగ్‌ కాంగ్ - తైవాన్ సంఘీభావం

Update: 2020-06-17 18:41 GMT
చైనా దుర్మార్గంగా భారత భూభాగంలోకి రావడంతో జరిగిన ఘర్షణలో 20 మంది ఇండియన్ ఆర్మీ అమరులయ్యారు. చైనా వైపు కూడా భారీ నష్టమే వాటిల్లింది. డ్రాగన్ తీరుపై భారత్‌ లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. సోషల్ మీడియా వేదిక ఫేస్‌ బుక్ - వాట్సాప్‌ తో పాటు వివిధ మార్గాల్లో భారతీయులు తమ సంఘీభావాన్ని తెలిపారు. చైనా దుందుడుకు చర్య వల్ల ఇరవైమంది భారత జవాన్లు అమరులయ్యారనే విషయం తెలియడంతో తైవాన్ - హాంగ్‌ కాంగ్ నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా సంఘీభావం తెలిపారు.

హాంగ్‌ కాంగ్ సోషల్ మీడియా వేదిక LIHKGలో హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు తన విల్లును చైనా డ్రాగన్ పైకి ఎక్కుపెట్టినట్లుగా ఉన్న ఓ ఇన్ ఫోగ్రాఫిక్ ఫోటోను సంఘీభావంగా పోస్ట్ చేశారు. దీనిని హాంగ్‌ కాంగ్ ట్విట్టర్ యూజర్ హోసేయ్‌ లీ అనే నెటిజన్ షేర్ చేశాడు. ఇది వెంటనే వైరల్‌ గా మారింది. దేశ సరిహద్దులు దాటి విస్తరణకు అర్రులు చాస్తున్న చైనాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ఇండియన్ నెటిజన్లకు హాంగ్‌ కాంగ్ జనాలు కూడా తోడయ్యారు. రాముడు ఎక్కుపెడుతున్న విల్లు ఫోటో 800 వరకు రీట్వీట్స్ కాగా - 2,000 మందికి పైగా లైక్ చేసారు. 80కి పైగా కామెంట్స్ వచ్చాయి.

హాంగ్‌ కాంగ్ ట్విట్టర్ యూజర్లు భారత్‌ కు తమ మద్దతు తెలుపుతూ #HKstandswithIndia (హాంగ్‌ కాంగ్ స్టాండ్ విత్ ఇండియా) హ్యాష్‌ ట్యాగ్‌ ను ట్రెండ్ చేశారు. హాంగ్‌ కాంగ్ మద్దతు తెలిపినందుకు గాను ఇండియన్ నెటిజన్స్ కూడా వారికి ధన్యావాదాలు తెలిపారు.

ఈ అద్భుత ఫోటోపై తైవాన్ మీడియా ఆర్గనైజేషన్ కూడా ప్రశంసించింది. తైవాన్‌ లోని ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఆర్గనైజేషన్ ది తైవాన్ న్యూస్ డ్రాగన్ పైకి విల్లు ఎక్కుపెట్టిన రాముడి చిత్రరూపం హాంగ్‌ కాంగ్ - తైవాన్ - ఇండియాలను ఏకం చేసిన దృష్టాంతం గురించి - చైనా సరిహద్దుదాహం గురించి రాసింది. హాంగ్‌ కాంగ్ - తైవాన్‌ లకు చైనాపై ఆగ్రహం ఉంది. ఇటీవల హాంగ్‌ కాంగ్‌ కు సంబంధించి నేషనల్ సెక్యూరిటీ లాను చైనా ఆమోదించింది. దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి.


Tags:    

Similar News