మహమ్మారికి భారత్ పోగొట్టుకున్న ఆదాయం ఎంతంటే?

Update: 2020-06-11 17:19 GMT
రాజు.. పేద.. ప్రముఖుడు..సామాన్యుడు.. వాడు వీడు అన్న తేడా లేకుండా అందరిని ఏదోలా దెబ్బేసిన ప్రత్యేకత మాయదారి రోగానిదేనని చెప్పాలి. ప్రపంచ గమనాన్ని మార్చేసిన ఈ మాహమ్మారి పుణ్యమా అని.. రానున్న రోజులో ప్రపంచం సరికొత్త ‘బీసీ’.. ‘ఎసీ’లు వచ్చేశాయని చెప్పాలి. రంగం ఏదైనా కానీ.. భవిష్యత్తులో ఏ ప్రస్తావన తెచ్చినా బిఫోర్ కరోనా (బీసీ).. ఆఫ్టర్ కరోనా (ఎసీ) పేర్లతో ప్రస్తావించటం పక్కా అని చెబుతున్నారు.

వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి నష్టాన్ని కలిగించిన ఈ మహమ్మారి కారణంగా దేశం ఎంత భారీ మూల్యాన్ని చెల్లించందన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ప్రస్తావించారు. ఆయన అంచనా ప్రకారం మాయదారి రోగం కారణంగా భారత్ రూ.10లక్షల కోట్ల నష్టాన్ని చవిచూసిందని నిపుణులు తనతో చెప్పినట్లుగా  గడ్కరీ చెబుతున్నారు.

తాజా పరిణామాలతో దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని.. దేశం రూ.10లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు చెప్పారు. పరిస్థితి చాలా భయంకరంగా ఉందని.. చాలా రాష్ట్రాల్లో వచ్చే నెలలో జీతాలు ఇచ్చేందుకు డబ్బుల్లేవని చెప్పారు. దేశ జీడీపీ రూ.200లక్షల కోట్లు అని.. అందులో పది శాతం అంటే రూ.20లక్షల కోట్లు పరిశ్రమల కోసం.. రైతుల కోసం కేటాయించారన్నారు.

ప్రస్తుత పరిస్థితిని భయంతోనో.. నిరాశతోనో ఎదుర్కోలేమని.. ఆత్మవిశ్వాసం.. సానుకూల శైఖరితో పోరాడాలన్నారు. కేంద్ర మంత్రే స్వయంగా పరిస్థితి దారుణంగా ఉందన్న వ్యాఖ్యలు చేస్తున్నారంటే.. పరిస్థితి ఎంతలా ఉందన్నది ఇట్టే అర్థం కాక మానదు. ఇక.. బుధవారం నమోదైన 9985 కేసులతో భారతలో మొత్తం పాజిటివ్ ల సంఖ్య 2.76లక్షలకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీ.. దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరాల్లో ఒకే రోజు 1500 కేసులు నమోదు కావటం ఆందోళనకు గురి చేస్తోంది.
Tags:    

Similar News