భార‌తీయులు సిగ్గుప‌డే స‌ర్వే వివ‌రాలు వెల్ల‌డి!

Update: 2018-06-27 04:17 GMT
ప్ర‌పంచంలో చాలానే దేశాలున్న‌ప్ప‌టికీ.. భార‌త్‌కు ఉండే ఛ‌రిష్మా అంతా ఇంతా కాదు. పుణ్య‌భూమిగా ప‌లువురు కొలవ‌ట‌మే కాదు.. భార‌త్‌లో అడుగు పెట్ట‌టంతోనే త‌మ జీవితం ధ‌న్య‌మైంద‌ని ఫీల‌య్యే విదేశీయులు ఎంద‌రో.  సంస్కృతి సంప్ర‌దాయాల‌తో పాటు.. బ‌ల‌మైన కుటుంబ వ్య‌వ‌స్థ‌.. ఆచార వ్య‌వ‌హారాలతో పాటు విలువ‌లు ఎక్కువ‌న్న పేరుంది. అయితే.. అవ‌న్నీ ఉత్త‌మాట‌ల‌ని.. భార‌త్ ఎంత భ‌యంక‌ర‌మో తెలుసా? అన్న‌ట్లు తాజాగా వెల్ల‌డైన ఒక స‌ర్వే షాకింగ్ గా మారింది.

భార‌త్ ఇమేజ్ ను అంత‌ర్జాతీయంగా డ్యామేజ్ చేసేలా ఉన్న ఈ స‌ర్వే వివ‌రాలు చ‌దివే కొద్దీ.. విభ్రాంతికి గురి కావ‌టం ఖాయం. భార‌త్‌లో మ‌హిళ‌ల భ‌ద్ర‌త మీద చేప‌ట్టిన అంత‌ర్జాతీయ స‌ర్వే.. దేశ ప‌రువును బ‌జార్లో పెట్టిన‌ట్లైంది. మ‌హిళ‌ల‌కు భార‌త్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన దేశంగా థాంమ్స‌న్ రాయ‌ట‌ర్స్ ఫౌండేష‌న్ నిర్వ‌హించిన స‌ర్వేలో వెల్ల‌డించింది.

అత్యాచారాలు.. లైంగిక దోపిడీ.. మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణాలో భార‌త్ అగ్ర‌స్థానంలో ఉండ‌ట‌మే కాదు.. మ‌హిళ‌ల భ‌ద్ర‌త విష‌యంలో భార‌త్ మ‌హా డేంజ‌ర్ అంటూ స‌ర్వే వివ‌రాల్ని వెల్ల‌డించింది. లైంగిక వేధింపుల‌తో పాటు.. బ‌ల‌వంత‌పు పెళ్లిళ్లు.. బాల్య వివాహాలు.. ఇళ్ల‌ల్లో వెట్టి చాకిరీ.. భ్రూణ హ‌త్య‌లు.. మ‌హిళ‌ల ప‌ట్ల అనుస‌రిస్తున్న అమాన‌వీయ‌మైన సంప్ర‌దాయ ప‌ద్ధ‌తుల్ని వెల్ల‌డించింది.

దారుణ‌మైన విష‌యం ఏమిటంటే.. నిత్యం యుద్ధంతో అత‌లాకుత‌ల‌మ‌య్యే అప్ఘ‌నిస్తాన్.. సిరియాల‌లో కంటే మ‌న దేశంలోనే మ‌హిళ‌లు దుర్బ‌ర ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్న‌ట్లుగా పేర్కొంది. ఈ రిపోర్టు చూసిన వారంతా.. భార‌త్‌లో ఇంత దారుణ ప‌రిస్థితి నెల‌కొందా? అంటూ షాక్ కు గుర‌య్యే ప‌రిస్థితి. ఈ జాబితాలో భార‌త్ ప్ర‌ధ‌మ స్థానంలో నిలిస్తే.. అఫ్ఘ‌నిస్తాన్ రెండో స్థానంలో.. సిరియా మూడో స్థానంలో నిల‌వ‌టం గ‌మ‌నార్హం.

మ‌రో షాకింగ్ విష‌యం ఏమిటంటే.. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌పై ఇదే సంస్థ ఏడేళ్ల క్రితం చేప‌ట్టిన స‌ర్వేలో భార‌త్ నాలుగో స్థానంలో నిలిస్తే.. ఇప్పుడు మొద‌టిస్థానంలో నిల‌వ‌టం ఎవ‌రికీ మింగుడుప‌డ‌నిదిగా మారింది. ఇంత‌కీ ఈ స‌ర్వే ఎలా చేశారు?   దీనికి ప్రామాణికం ఏమిట‌న్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతికితే.. మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌మాదాలు.. ఆరోగ్యం.. ఆర్థిక వ‌న‌రులు.. లింగ వివ‌క్ష‌.. లైంగిక హింస‌.. వేధింపులు.. ఇత‌ర హింస‌ల‌తో పాటు.. అక్ర‌మ ర‌వాణా.. సాంస్కృతికంగా.. మ‌త‌ప‌రంగా వ‌స్తున్న సంప్ర‌దాయ ప‌ద్ధ‌తులాంటి అంశాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లు థామ్స‌న్ రాయ‌ట‌ర్స్ ఫౌండేష‌న్ చెబుతోంది.

ఈ అధ్య‌య‌నంలో భాగంగా మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేస్తున్న 548 మంది నిపుణుల అభిప్రాయాల్ని అడిగి తెలుసుకున్న‌ట్లుగా పేర్కొంది. మార్చి 26 నుంచి మే 4 వ‌ర‌కు అభిప్రాయాల్ని సేక‌రించిన సంస్థ‌.. తాజాగా త‌న స‌ర్వే వివ‌రాల్ని వెల్ల‌డించింది. మ‌హిళ‌ల‌కు అత్యంత ప్ర‌మాద‌క‌ర దేశాల్లో భార‌త్ మొద‌టి స్థానంలో నిలిస్తే ప‌దో స్థానంలో అగ్ర‌రాజ్యం అమెరికా ఉండ‌టం గ‌మ‌నార్హం.

1. భార‌త్‌

2. అఫ్ఘ‌నిస్తాన్

3. సిరియా

4. సోమాలియా

5. సౌదీ అరేబియా

6. పాకిస్తాన్

7. కాంగో

8. యెమ‌న్‌

9. నైజీరియా

10. అమెరికా

వేర్వేరు అంశాల్లో భార‌త్ కు ద‌క్కిన స్థానాల్ని చూస్తే..

+ లైంగిక హింస‌లో మొద‌టి ర్యాంక్‌

+ మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణాలో ఫ‌స్ట్ ర్యాంక్

+ సంప్ర‌దాయంగా అనాచారాల్లో మొద‌టి ర్యాంక్

+ గృహ‌హింస‌..ఇత‌ర శారీర‌క హింస‌ల్లో మూడో స్థానం

+ లింగ వివ‌క్ష‌లో మూడో ర్యాంక్‌

+ మ‌హిళ‌ల ఆరోగ్య ప‌రిస్థితుల్లో నాలుగో స్థానం






Tags:    

Similar News