ముంచుకొస్తున్న కరెంటు సంక్షోభం

Update: 2022-09-08 14:42 GMT
ప్రపంచదేశాలను తొందరలోనే కరెంటు సంక్షోభం కమ్ముకోనున్నది. ఇప్పటికే కరెంటు సంక్షోభం ఛాయలు చాలాదేశాల్లో స్పష్టంగా కనబడుతోంది. చైనా, ఐరోపా దేశాలతో పాటు లాటిన్ అమెరికన్ దేశాల్లో కూడా కరెంటు కోతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కోవిడ్ సమస్యలకు తోడు, ఆర్ధికంగా పలుదేశాల్లో తీవ్రమైన సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు, ఐరోపాలో పెరిగిపోతున్న కరువు లాంటి అనేక పరిస్ధితులు కలిసి విద్యుత్ సంక్షోభానికి కారణమయ్యాయి.

ఇప్పటికే చైనాతో పాటు ఐరోపాలోని చాలా దేశాల్లో విద్యుత్ కోతలు ప్రారంభమైపోయాయి. నిరంతర విద్యుత్ సరఫరా లేనికారణంగా చైనాతో పాటు చాలా దేశాల్లో పరిశ్రమలకు హాలిడే ప్రకటించారు. బంగ్లాదేశ్ లాంటి అనేక దేశాల్లో పరిశ్రమలు, కార్యాలయాల్లో పనివేళలను తగ్గించేశారు. ఆర్ధికంగా, అభివృద్ధిలో ఎంతో గొప్పదేశాలని అనుకుంటున్నవి కూడా విద్యుత్ సంక్షోభం దెబ్బకు తల్లకిందులైపోతున్నాయి. పెరిగిన విద్యుత్ డిమాండును తట్టుకోవటం చాలా దేశాలవల్ల కావటంలేదు.

ప్రపంచంలోనే అత్యధికంగా అణువిద్యుత్ ను ఉత్పత్తిచేసే ఫ్రాన్స్ కూడా పెరిగిన డిమాండును తట్టుకోలేకపోతోంది. గడచిన 70 ఏళ్ళలో చూడని కరువు ఏర్పడటంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది.

ఐరోపా బ్యాటరీగా పాపులరైన నార్వేలో కూడా చాలా రిజర్వాయర్లు నిండిపోవటంతో జలవిద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. ఐరోపా ఖండంలోని చాలాదేశాలను నార్వేనే విద్యుత్ సరఫరా చేస్తుంది. స్ధానిక పరిస్ధితుల కారణంగా విదేశాలకు విద్యుత్ సరఫరాను నిలిపేసింది. దాంతో చాలా దేశాలు నానా అవస్తలు పడుతున్నాయి.

ఇక ఆసియా ఖండంలోని చాలాదేశాలు కూడా ఇదే పరిస్ధితులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా చైనా, బంగ్లాదేశ్ లో పరిస్ధితులు విషమిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్దదైన త్రి గార్జెస్ డ్యామ్ నుండి విద్యుత్ సరఫరా బాగా తగ్గిపోయింది. కారణం ఏమిటంటే దీనికి నీటిసరఫరా చేసే యాంగ్జీ నది దాదాపు ఎండిపోవటమే. దీని ప్రభావం వినియోగదారులు, పరిశ్రమలపై తీవ్రంగా పడింది. సో, పరిస్ధితులను చూస్తుంటే మనదేశంలో కూడా విద్యుత్ సంక్షోభం తప్పేట్లు లేదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News