మ‌న‌ల్ని చూసి పాక్ కొత్త‌గా భ‌య‌ప‌డుతోంది

Update: 2017-09-16 17:10 GMT
పొరుగుదేశం పాకిస్థాన్ మ‌న‌దేశాన్ని చూసి భ‌య‌ప‌డుతోంది. ఇంకా చెప్పాలంటే వణికిపోతోంది. అది కూడా బ‌హిరంగంగానే! అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే తమ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండటంతో తీవ్ర ఆందోళనలోకి కూరుకుపోయిన పాకిస్థాన్‌ తాజాగా భయంలోకి జారుకుంది. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో ఆ దేశం వణికిపోతోంది. దాదాపు 2 నుంచి 3 బిలియన్‌ డాలర్ల అంచనా 22 ప్రిడేటర్‌ డ్రోన్లను భారత్‌ కు విక్రయించేందుకు అమెరికా ఈ ఏడాది జూన్‌ లో తీసుకున్న నిర్ణయంతో పాక్‌ తెగ ఆందోళన చెందుతోంద‌ద‌ని అంత‌ర్జాతీయ విశ్లేష‌కులు చెప్తున్నారు.

పాక్‌ విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి నఫీజ్‌ జకారియా తాజాగా మీడియాతో మాట్లాడుతూ గత జూన్‌ లో భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ చేసిన అమెరికా టూర్‌ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అత్యంత ప్రతిష్టాత్మక ఒప్పందాన్ని మోడీ అమెరికాతో కుదుర్చుకున్నారని, అందులో జలాంతర్గాముల కోసం ఉపయోగించే 22 డ్రోన్‌ లకు ఒప్పందం కుదిరిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాక్‌-భారత్‌ కు మధ్య వ్యూహాత్మక బలం సమస్థాయిని కోల్పోయినట్లయిందని, ఇది భారత్‌ బలాన్ని పెంచినట్లు అవుతుందని ఒకింత ఆందోళ‌న‌తో త‌మ దేశం ప‌రిస్థితిని వెళ్ల‌డించారు. ``భారత్‌ కు అత్యాధునిక మిలిటరీ సాంకేతిక పరిజ్ఞానం విక్రయించడంపై మేం ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాం. అలా చేయడం ద్వారా ప్రాంతాల మధ్య బ్యాలెన్స్‌ తప్పి మొత్తం దక్షిణాసియాలోనే సుస్థిరత్వానికి ప్రమాదం ఉందని చెప్పాం. అయిన‌ప్ప‌టికీ ఈ నిర్ణ‌యం వెలువ‌డింది`` అని జకారియా వ్యాఖ్యానించారు.

భారత్‌-అమెరికా సంబంధాలకు ఈ ఒప్పందం గేమ్‌ చేంజర్‌ గా మిగలడంతోపాటు అమెరికాకు భారత్‌ అతిపెద్ద రక్షణ భాగస్వామిగా అవతరించనుంది. రక్షణ వ్యవహరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ హెచ్చరికలు జారీ చేసే డ్రోన్‌లు కావడం వీటిని భారత సబ్‌ మెరైన్‌ లకు అనుసంధానించి పనిచేయించడం పాక్‌ను కొంత భయపెడుతోందని అక్కడి మీడియా చెబుతోంది.
Tags:    

Similar News