కుర్రాళ్లు ఇరగదీశారు.. ఆసియా అండర్ 19 కప్ మనదే

Update: 2022-01-01 05:31 GMT
పిల్లలు పిడుగులయ్యారు. కొత్త సంవత్సరం వేళ సరికొత్త జోష్ ఇచ్చేలా మన కుర్రాళ్లు ఇరగదీశారు. వరుసగా ఎనిమిదో సారి టైటిల్ ను సొంతం చేసుకొని.. శుభారంభాన్ని ఇచచారు. అండర్ 19 ప్రపంచ కప్ కు ముందు తమ సత్తా ఏమిటో చాటుతూ.. అండర్ 19 ఆసియా కప్ విజేతలుగా నిలిచారు. భారత విజయపతాకను ఎగురవేశారు.

దుబాయ్ లో జరిగిన అండర్ 19 ఆసియా కప్ లో శ్రీలంక అండర్ 19 జట్టును 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఘన విజయాన్ని.. కప్పును సొంతం చేసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అండర్ 19 జట్టు ఆసియా కప్ ను గెలుచుకోవటం ఇది ఎనిమిదోసారి కావటం.

దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 38 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 106 పరుగలే చేసింది. ఇందులో రోడ్రిగో 19 నాటౌట్ అత్యధిక స్కోరు. శ్రీలంక జట్టు స్కోరు 33 ఓవర్ల సమయంలో ఏడు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేయగా.. అప్పుడే వర్షం పడటంతో ఆట ఆగింది.

దీంతో.. మ్యాచ్ ను 38 ఓవర్లకు కుదించారు. భారత బౌలర్లలో 11 పరుగులకే మూడు వికెట్లు తీయటం ద్వారా విక్కీ ఒస్వాల్ శ్రీలంకను పరిమితమైన స్కోర్ కే కట్టడి చేయగలిగారు. మరో బౌలర్ కౌశల్ తాంబే రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 102 పరుగుల లక్ష్యాన్ని విధించారు.

బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు కుర్రాళ్లు 21.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టానికి 104 పరుగులు చేయటంతో విజేతగా నిలవటంతో పాటు ఆసియా కప్ మరోసారి సొంతమైంది. కేవలం 5 పరుగులకే ఓపెనర్ హర్నూర్ సింగ్ వెనుదిరిగినా.. 56 పరుగుల నాటౌట్ తో అంగ్రిష్ రఘువంశీ.. 31 పరుగులు నాటౌట్ తో ఏపీ క్రికెటర్ షేక్ రషీద్ అద్భుతంగా రాణించటంతో జట్టు సులువుగా ఫైనల్ మ్యాచ్ ను సొంతం చేసుకోగలిగింది. వీరిద్దరూ రెండో వికెట్ కు 96 పరుగుల్ని జోడించారు.

ఈ ఏడాది జనవరి 14న వెస్టిండీస్ వేదికగా అండర్ 19 ప్రపంచ కప్ జరగనుంది. ఈ టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్ ను జనవరి 15న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. గత ప్రపంచ కప్ రన్నరప్ గా భారత జట్టు నిలిచింది. కొత్త ఏడాదికి కొత్త శుభారంభాన్ని ఇచ్చిన అండర్ 19 జట్టు.. ఈసారి ప్రపంచ కప్ ను సొంతం చేసుకురావాలని కోరుకుందాం.



Tags:    

Similar News