ఇరగదీసిన టీమిండియా.. సఫారీల మీద గెలుపు

Update: 2015-11-07 11:45 GMT
ఐకమత్యంగా ఆడితే.. అసాధ్యమనుకున్న గెలుపు కూడా ఎంత సింఫులో అన్న విషయాన్ని తాజా టెస్ట్ మ్యాచ్ నిరూపించింది. టీమిండియా.. దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని చేజిక్కించుకుంది. మొహాలిలో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజున టీమిండియా బ్యాటింగ్ చూసిన టీమిండియా క్రికెట్  అభిమానులు ఎంతగా తిట్టుకున్నారో తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ ను కేవలం 201 పరుగులకే అలౌట్ కాగా.. తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన సఫారీలు తమ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 184 పరుగులకే అలౌట్ అయిపోయారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా శుక్రవారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. దీంతో.. శనివారం ఆటపై టీమిండియా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే.. శనివారం ఆట మొదలైన కాసేపటికి టపటపా పడిపోయిన వికెట్ల కారణంగా 200 పరుగులకే ఆలౌట్ కావటంతో టీమిండియా అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.

అద్భుతమైన స్పిన్ తిరుగుతున్న మొహాలీ పిచ్ మీద  తమ సత్తా చాటాలన్న పట్టుదలతో వ్యవహరించిన టీమిండియా బౌలర్లు.. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లకు తమ బంతులతో చుక్కలు చూపించారు. మాంచి ఊపు మీదున్న రవీంద్ర జడేజా ఏకంగా ఐదు వికెట్లు తీయటం.. అతనికి తోడుగా అశ్విన్ చెలరేగిపోయి మూడు వికెట్లు కొల్లగొట్టటంతో దక్షిణాఫ్రికా జట్టు కేవలం  109 పరుగులకే చాప చుట్టేసింది. దక్షిణాఫ్రికా జట్టులో జిల్ ఒక్కడు మాత్రమే 36 పరుగులు చేశారు. అ తర్వాత అత్యధిక వ్యక్తిగత స్కోన్ డీన్ ఎల్గర్.. డివిలియర్స్ లు 16 పరుగులు చేయగా.. హార్మర్ 11 పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన నాలుగో బ్యాట్స్ మెన్ గా నిలిచారు. అత్యధిక వ్యక్తిగత స్కోర్లు ఇలా ఉన్నాయంటే. మిగిలిన వారి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. సింగిల్ డిజిట్లు దాటనోళ్లు చాలామందే ఉన్నారు.

అద్భుతమైన బౌలింగ్ తో వికెట్లు టపా టపా రాలిపోవటంతో పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శించిందన్న భావనలో ఉన్న చాలామంది.. ఈ విజయానికి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తక్కువ స్కోర్ చేసినప్పటికీ.. వికెట్లను తీయటంలో బౌలర్లు తమ సత్తా ఏమిటో చూపించటంతో.. బలమైన దక్షిణాఫ్రికా జట్టుపై టీమిండియా 108 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి అభిమానుల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తారు.
Tags:    

Similar News