సర్జికల్ వీడియోలు రెడీనా..?

Update: 2016-10-05 08:17 GMT
మరో సంచలనానికి భారత సర్కారు సిద్ధమవుతోంది. సర్జికల్ దాడుల తర్వాత ఆత్మరక్షణలో పడిన పాక్.. సర్జికల్ దాడులు జరగనే జరగలేదని బుకాయించటం.. తన వాదనను నమ్మించే ప్రయత్నంలో భాగంగా భారీగా చేస్తున్న ప్రచార నేపథ్యంలో సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోల్ని విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ను విడుదల చేయకూడదన్న ఆలోచనలోనే భారత సర్కారు ఉందని చెబుతారు.

తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో వీడియోలను విడుదల చేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. సర్జికల్ దాడులు మోడీ సృష్టించిన మాయాజాలమన్న విష ప్రచారం పెరుగుతుండటం.. మరోవైపు విదేశీ మీడియాను ప్రభావితం చేసేందుకు పాక్ సర్కారు చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో పాక్ దుష్టబుద్ధిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు వీలుగా సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోల్ని బయటకు తీసుకొచ్చే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది.  

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో సైన్యం జరిపిన సర్జికల్ దాడుల్ని డ్రోన్లతో చిత్రీకరించటం తెలిసిందే. సర్జికల్ దాడుల లైవ్ ను ఆర్మీలో అత్యంత కీలక అధికారులు రాత్రంతా కూర్చొని చూసినట్లుగా సమాచారం. రహస్య ఆపరేషన్ సందర్భంగా అనుకోనిది ఏదైనా జరిగితే దానికి తగ్గట్లు  రియాక్ట్ అయ్యేందుకు వీలుగా.. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను సిద్ధంగా ఉంచారు. సర్జికల్ వీడియోల్ని విడుదల చేయటం ద్వారా పాక్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టటంతో పాటు.. అబద్ధాల్ని పాక్ ఎంత అందంగా ప్రచారం చేస్తుందన్న విషయం కూడా అంతర్జాతీయంగా తెలియజెప్పే వీలుందని చెబుతున్నారు.

పక్కాగా సిద్ధం చేసిన వీడియోలను ఎప్పుడు విడుదల చేయాలన్న విషయంపై ప్రధాని మోడీ అంగీకారంతో ముడిపడి ఉందని చెబుతున్నారు. వీడియో క్లిప్పింగుల విడుదలపై మోడీదే తుది నిర్ణయంగా చెబుతున్నారు. సర్జికల్ వీడియోలతో సైన్యం సిద్ధమైన వేళ.. వాటి విడుదల ఎప్పుడన్నది మోడీ చేతుల్లో ఉంది. మరి.. ఆ వీడియో విడుదలకు మోడీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అదెప్పడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News