బూస్టర్ డోసులపై కీలక వ్యాఖ్యలు చేసిన భారత్ బయోటెక్ సీఎండీ

Update: 2021-11-11 23:30 GMT
కరోనా వచ్చింది.. కొత్త తిప్పలు ఎన్నింటినో తీసుకొచ్చింది. అన్నింటికి మించి లాక్ డౌన్ ను పరిచయం చేసింది. ఐసోలేషన్ ను అలవాటు చేసింది. ముఖానికి మాస్కులు.. చేతికి శానిటైజేషన్.. ఇలాంటి కొత్తవెన్నో తనతో తీసుకొచ్చింది. చిన్నతనంలో వేయించుకునే టీకాలు మాత్రమే తెలిసిన వారందరికి మళ్లీ రెండు టీకాల్ని వేసుకోక తప్పని పరిస్థితిని తీసుకొచ్చింది. ఒకవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతున్న వేళ.. ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకొని ఆర్నెల్లు పూర్తి అయిన వారిలో కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తి అయినా.. బూస్టర్ డోసు మాటేమిటి? అన్న దానిపై అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రాలు కానీ ఎలాంటి సమాధానాన్ని ఇవ్వటం లేదు. ఇలాంటి వేళలో..కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను రూపొందించిన భారత్ బయోటెక్ సీఎండీ క్రిష్ణా ఎల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా టైమ్స్ నౌ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సుకు హాజరైన ఆయన.. బూస్టర్ డోసుపైన స్పందించారు. కొవాగ్జిన్ వ్యాక్సిన్ పై జరిగిన దుష్ప్రచారంపైనా రియాక్టు అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే..

- కరోనా టీకా వేసుకున్న ఆర్నెల్ల తర్వాత బూస్టర్ డోసు పొందటం మేలు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే. మేం తయారు చేస్తున్న నాసల్ వ్యాక్సిన్ (ముక్కులో వేసే చుక్కలు) బూస్టర్ డోస్ గా చక్కగా పని చేస్తుంది. దీంతో వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు సాధ్యమవుతుంది.

- ఇప్పుడు ప్రపంచం మొత్తం నాసిల్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. కొవాగ్జిన్ తీసుకున్న వారిలో ఆర్నెల్ల తర్వత కూడా టీ సెల్ స్పందన కనిపిస్తోంది. అమెరికాలో అందిస్తున్న ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల కంటే కూడా కొవాగ్జిన్ మేలైన పని తీరును కనబరుస్తోంది.

- మేం తయారు చేస్తున్న వ్యాక్సిన్లలో ఐదింటికి ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉంది. ఆ ప్రక్రియ ఎలా సాగుతుందన్నది మాకు తెలుసు. కానీ కొన్ని మీడియా సంస్థలు కొవాగ్జిన్ కు వ్యతిరేకంగా రాశాయి. అలాంటి వాటి కారణంగా అనుమతుల్లో జాప్యం జరిగింది.

- ప్రధానమంత్రి మోడీ వ్యాక్సిన్ తీసుకున్నంతనే అది మోడీ వ్యాక్సిన్ అని.. బీజేపీ వ్యాక్సిన్ అని కొందరు ప్రచారం చేయటం మొదలు పెట్టారు. సైంటిస్టులుగా మాకు రాజకీయాల్ని అర్థం చేసుకోలేం. మాపై చేసిన ప్రచారం మమ్మల్ని బాధించింది. భవిష్యత్తులో వచ్చే అంకుర సంస్థలకు అడ్డంకిగా తయారైంది.

- ఏ విషయం మీదనైనా రాజకీయాలు చేయొచ్చు కానీ వైద్య ఆరోగ్యం మీద మాత్రం చేయకూడదు. నిజాయితీగా మేం ఉండటం వల్లే చివరకు ఆటలో గెలిచాం. దేశంలో జరిగిన ప్రతికూల ప్రచారం ప్రపంచ ఆరోగ్య సంస్థనీ ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. తాము చేస్తున్నది తప్పా? ఒప్పా? అన్నది తేల్చుకునేందుకు వారు ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చూసి సూక్ష్మంగా పరిశీలించాల్సిన పరిస్థితి వచ్చింది.

- మేం ఎదుర్కొన్న పరీక్షల్ని మరెవరూ ఎదుర్కోలేదు. చివరకు మేమే నెగ్గాం. ఎక్కువ మంది సవాళ్లు విసరటం మాకే మేలు చేసింది. మిగిలిన వారి కంటే ఉత్తమంగా నిలవటానికి దోహపడేలా చేసింది.

- దేశ ప్రధాని నరేంద్ర మోడీ మా వ్యాక్సిన్ తీసుకోవటం మాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాం. భారతీయ శాస్త్రవేత్తల పైనా.. అంకుర సంస్థల పైనా ఉన్న నమ్మకానికి అది అద్దం పట్టింది. వ్యాక్సిన్ ను డెవలప్ చేసే ప్రక్రియలో మేం ఏ ప్రక్రియను తగ్గించలేదు. ఏ నిబంధననూ ఉల్లంఘించలేదు.

- అలాంటి పనిని నేను చేసి ఉంటే జైలుకు వెళ్లి ఉండేవాడిని. భారత చట్టాల్ని వంద శాతం అమలు చేశాం. ఇక్కడ స్పీడ్ గా పూర్తి అయినది అనుమతుల ప్రక్రియ మాత్రమే. గతంలో నాలుగైదు నెలలు తీసుకునే అనుమతులు ఇప్పుడు నాలుగైదు రోజుల్లోనే వచ్చాయి. వ్యాక్సిన్ తయారీ సంస్థల్ని ప్రధానమంత్రి సందర్శించటంతో మార్పు వచ్చింది.

- మా గురించి మేం చెప్పుకోవాల్సి వస్తే.. ప్రపంచంలో మొట్టమొదటి టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ ను రూపొందించాం. బ్యాడ్ లక్ ఏమంటే.. మీడియా దాని గురించి పట్టించుకోలేదు. అత్యుత్తమ వ్యాక్సిన్ల తయారీలో మాకు మంచి చరిత్ర ఉంది. ప్రపంచంలో అధిక సంఖ్యలో గర్భిణులకు కొవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చింది భారత్ లోనే. దాదాపు పది లక్షల మందికి ఇచ్చారు. గర్భిణులకు ఈ వ్యాక్సిన్ సురక్షితమని తేలింది.

- అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థకు మాత్రం ఈ విషయాన్ని క్లినికల్ మోడ్ లో నిరూపించాల్సి ఉంది. ఆ ప్రక్రియను మరో రెండు.. మూడు నెలల్లో పూర్తి చేస్తాం. మాది గుడ్ సైన్స్ అని మరోసారి నిరూపించుకుంటాం.


Tags:    

Similar News