భార్య‌లను వేధించే ఎన్నారైలు బ‌హుప‌రాక్‌

Update: 2017-09-20 03:25 GMT
క‌ట్టుకున్న భార్య‌ను విదేశాల‌కు తీసుకువెళ్లాం..అక్క‌డ త‌న‌కంటూ ఎవ‌రూ ఉండ‌రు..ఏం చేసినా చెల్లుబాట‌వుతుంద‌నే ఎన్నారైలకు ఇక చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయం. భార్యలను వేధించే ఎన్నారైల భరతం పట్టే రోజులు రాబోతున్నాయి. ఎన్నారై బాధిత భార్యల రక్షణకు కేంద్రం కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టబోతోంది. ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే భార్య‌లను కడగండ్ల పాలు చేసే ఎన్నారైలకు గడ్డుకాలమే. వారు విదేశాల్లో ఉన్నప్పుడు భార్యను వేధించినా, స్వదేశంలో దిగబెట్టి ఉడాయించినా పాస్‌పోర్టు జప్తు చేస్తారు  లేదా ఏకంగా రద్దు చేస్తారు.

ఇటీవ‌లి కాలంలో విదేశాల్లో భార్య‌ల‌ను వేధిస్తున్న ఉదంతాలు  పెరిగిపోతున్న తీరు కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి వ‌చ్చింది. ఎన్నారై భర్తలు వదిలేసిన అనేకమంది మహిళల ఫిర్యాదు మేరకు విదేశాంగమంత్రిత్వశాఖ గత మేనెలలో ఒక కమిటీని నియమించింది. చట్టపరమైన సమస్యలు అధ్యయనం చేసి పరిష్కారాలు సూచించడం ఈ కమిటీకి అప్పగించిన బాధ్యతలు. మాజీ న్యాయమూర్తి అరవింద్‌కుమార్‌ గోయల్‌ నేతృత్వంలోని 9 మంది సభ్యుల కమిటీ ఈ సమస్య తీవ్రతను లోతుగా అధ్యయనం చేసిన పలు సిఫార్సులు చేసింది. ఈ ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌కారం ఇతర దేశాలతో కుదుర్చుకునే నేరస్థుల అప్పగింత ఒప్పందాల్లో గృహహింస కేసులనూ చేర్చాలని కమిటీ సూచించింది. కేంద్రం ఈ విషయంలో చట్టం తెచ్చేవరకు రాష్ట్రాలు అన్ని వివాహాలను, కనీసం ఎన్నారై వివాహాలను తప్పనిసరిగా రిజిష్టర్‌ చేసేలా చూడాలనేది కమిటీ చేసిన మరో సిఫార్సు. ఎన్నారై తన పాస్‌పోర్టు నంబరు, విదేశాల్లో సోషల్‌ సెక్యూరిటీ నంబరు, నివాస, కార్యాలయ చిరునామా వంటి వివరాలు తెలియపర్చిన తర్వాతనే వివాహ రిజిస్ట్రేషన్‌ చేయాలని కమిటీ తెలిపింది. ఒకవేళ ఎన్నారై తన బార్యను వదిలేస్తే అతణ్ణి పట్టికునేందుకు ఈ వివరాలు ఉపకరిస్తాయని కమిటీ అభిప్రాయ ప‌డింది. ఇలాంటి కేసులను పరిశీలించేందుకు హోం, విదేశాంగ మంత్రిత్వ శాఖలు, జాతీయ మహిళా కమిషన్‌తో కూడిన జాతీయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా కమిటీ పేర్కొన్నది. ‘దీనివల్ల ఎన్నారై భర్తలను భారత్‌లో విచారణకు రప్పించడం సులభమవుతుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం భార్యను వదిలేయడం, గృహహింసకు గురిచేయడం లేదా వరకట్నం కోసం వేధించడం వంటి నేరాలకు పాల్పడిన ఎన్నారైలను రప్పించడం దాదాపు అసాధ్యం’ అని అధికారులు పేర్కొంటున్నారు. కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉందని మహిళా, శిశు అభివృద్ధి విభాగం అధికారులు అంటున్నారు.

భార్య ఫిర్యాదు మేరకు భర్త పాస్‌పోర్టును రద్దు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ‘పాస్‌పోర్టును నిలిపివేస్తే ఆ సమయంలో ఎన్నారై భారత్‌లో ఉంటే కేసు పరిష్కారమయ్యేంతల వరకు విదేశాలకు వెళ్లడం కుదరదు.. ఒకవేళ విదేశాల్లో ఉంటే అక్కడి ప్రభుత్వం వెనుకకు పంపించాల్సి ఉంటుంది’ కమిటీతో సంబంధమున్న ఒక అధికారి చెప్పారు. నిజానికి పాస్‌పోర్టు చట్టంలోని 10(3) సెక్షన్‌లో ఎఫ్‌ఐఆర్‌ లేదా కోర్టు ఆదేశాల మేరకు ఎన్నారై భర్తల పాస్‌పోర్టును స్తంభింపజేయవచ్చు. కానీ బాధితుల్లో చైతన్యం లేకపోవడం, సంక్లిష్టమైన విధానం కారణంగా అది జరుగడం లేదు. విదేశాల్లోని బాధిత మహిళలకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని 3 వేల డాలర్ల నుంచి 6 వేల డాలర్లకు పెంచాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. దీనివల్ల విదేశీగడ్డపై ఆర్థికవనరులు, పరిచయాలు అంతంతమాత్రంగా ఉన్న మహిళలు తగినరీతిలో న్యాయసహాయం పొందేందుకు వీలవుతుంది. 2014లో ఎన్నారై భర్తల చేతుల్లో వేధింపులకు గురైన 346 మంది మహిళలు విదేశాంగశాఖకు ఫిర్యాదు చేశారు. పాస్‌ పోర్టులు లాగేసుకుని స్వదేశానికి వెళ్లకుండా చేయడం, పెండ్లి చేసుకుని ఉడాయించడం, విదేశాలకు వెళ్లిన తర్వాత భార్యలను వదిలేయడం, పిల్లలను తమవద్దే ఉంచుకుని తల్లికి దూరం చేయడం వంటి ఫిర్యాదులే వాటిలో అధికం. ఈ సంఖ్య కూడా వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించదని మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు అంటున్నారు. ఎందుకంటే చాలామంది మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రారని పేర్కొంటున్నారు.
Tags:    

Similar News