లాట‌రీలో 27కోట్లు.. అదృష్టంలో దుర‌దృష్టం అత‌డిదే!

Update: 2019-05-05 05:45 GMT
అప్పుడెప్పుడో 80ల‌లో భాగ్య‌ల‌క్ష్మీ బంప‌ర్ లాట‌రీ అంటూ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అదే ప‌నిగా హ‌డావుడి చేసి.. ఊరూరా భారీగా తిరిగి లాట‌రీ టికెట్లు అమ్మేవారు. ప్ర‌తి శుక్ర‌వారం డ్రా తీసి.. మొద‌టి బ‌హుమ‌తి కింద ల‌క్ష రూపాయిలు ఇచ్చేవారు. రూపాయి లాట‌రీ టికెట్ గా ఎంతోమంది మ‌న‌సును దోచేసి.. ఈజీగా డ‌బ్బు సంపాదించేందుకు లాట‌రీ టికెట్ ను కొనేందుకు మ‌క్కువ చూపేవారు. ఇది కాస్తా వ్య‌స‌నంగా మార‌టంతో.. ప్ర‌భుత్వం భాగ్య‌ల‌క్ష్మి బంప‌ర్ లాట‌రీని బ్యాన్ చేసేసింది. దీంతో.. ఇదొ గురుతుగా మిగిలిపోయింది.

క‌ట్ చేస్తే.. తాజాగా యూఏఈలో భార‌త సంత‌తికి చెందిన ఒక వ్య‌క్తి జాక్ పాట్ కొట్టారు. అదృష్టం అంటే అత‌గాడిదే అని అంద‌రూ అనుకునేంత భారీ మొత్తం అత‌గాడికి డ్రాలో త‌గిలింది. ప్రైజ్ మ‌నీ ఏకంగా రూ.27 కోట్లు కావ‌టం.. ఎలాంటి ప‌న్నులు లేక‌పోవ‌టం విశేషంగా చెప్పాలి. బిగ్ టికెట్ సిరీస్ డ్రాలో ఈ భారీ మొత్తాన్ని గెలుచుకున్న ల‌క్కీ మ్యాన్ గా కేఎస్ శోజిత్ గా ప్ర‌క‌టించారు.

లాట‌రీ ఫ‌లితాల‌ని తెలుసుకున్న వారంతా శోజిత్ అదృష్టానికి అసూయ ప‌డ్డారు. అయితే.. అత‌గాడు అదృష్ట‌వంతుడే కానీ.. దుర‌దృష్ట‌వంతుడు కూడా అన్న భావ‌న క‌లిగే ప‌రిస్థితి. ఎందుకంటే.. లాట‌రీ టికెట్ కొన్న శోజిత్ ఆ విష‌యాన్ని మ‌ర్చిపోయిన‌ట్లున్నార‌ని.. ఇప్ప‌టివ‌ర‌కూ అత‌ను త‌మ‌ను సంప్ర‌దించ‌లేద‌ని లాట‌రీ సంస్థ పేర్కొంది.

తాము ప‌లుమార్లు ఫోన్లు చేసినా అత‌ను త‌మ ఫోన్ ను ఎత్తేలేద‌ని పేర్కొన్నారు. అత‌డి అడ్రస్ ఉంద‌ని.. తామే స్వ‌యంగా వెళ్లి.. లాట‌రీలో అత‌డు సాధించిన బ‌హుమ‌తి మొత్తాన్ని అత‌నికి అందించి తీరుతామ‌ని చెబుతున్నారు. ఇదే డ్రాలో మ‌రో భార‌త్ సంత‌తి వ్య‌క్తికి (మంగేశ్‌) బీఎండ‌బ్ల్యూ 220ఐ కారును గెలుచుకున్నట్లు నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు. మొత్తానికి మ‌నోళ్లు మామూలు సుడిగాళ్లు కాదుగా?
Tags:    

Similar News