మోస్టు వాంటెడ్ మాయగాళ్లు విదేశాల్లోనే..

Update: 2016-05-18 22:30 GMT
  ఇండియాలో బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను తిరిగి ఇండియాకు రప్పించడం అంత సులభంగా కనిపించడంలేదు. కేంద్ర ప్రభుత్వం అండ కూడా మాల్యాకు ఉందన్న ఆరోపణల నేపథ్యంలో అది సాధ్యమా కాదా అన్నది పక్కన పెడితే విదేశాలకు ఎస్కేప్ అయిన నిందితులను భారత్ కు రప్పించడానికి ఇక్కడి వర్గాలు చేస్తున్న ప్రయత్నాలు, వివిధ దేశాలతో ఉన్న ఒప్పందాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తాజాగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్ రప్పించే క్రమంలో ఈడీ ఆయనపై ఉచ్చు బిగిస్తోందన్న వార్తల నేపథ్యంలో విదేశాలకు పలాయనం చిత్తగించినవారిని రప్పించడానికి ఉన్న మార్గాలు గత అనుభవాలను ఒక్కాసారి పరిశీలిద్దాం.

వివిధ నేరాల్లో ఉండి విదేశాలకు పారిపోయిన వారిని దేశానికి రప్పించడానికి ఇండియన్ ఎక్స్ట్రాడిషన్ యాక్ట్-1962ను ప్రయోగించాల్సి ఉంటుంది. దీని ప్రకారం భారత్ కు 42 ప్రపంచ దేశాలతో ఒప్పందాలున్నాయి. ఆయా దేశాలకు పారిపోయినవారిని రప్పించడం కొంతవరకు సులభంగా ఉంటుంది. అలాంటి ఒప్పందాలు లేని దేశాలకు పారిపోయినవారిని రప్పించడం మాత్రం అంత ఈజీ కాదు. ఇక ఈ 42 దేశాల్లో కూడా తొమ్మిది దేశాలతో మరింత బలమైన ఒప్పందాలున్నాయి.  ఆ దేశాల్లో మన నేరగాళ్లు ఎవరైనా తలదాచుకుంటే వారిని అక్కడ కూడా నేరగాళ్లుగానే నమోదు చేస్తారు. న్యాయప్రక్రియలు కూడా ఆయా దేశాలతో సులభతరంగా, వేగవంతంగా ఉంటాయి.

గతంలో చాలామంది నేరగాళ్లను ఇలా వివిధ దేశాల నుంచి ఇండియాకు రప్పించారు. 2002 నుంచి ఆ వివరాలు పరిశీలిస్తే..

- 2002లో ముగ్గురిని దేశానికి రప్పించారు.

- 2003లో ఏడుగురిని దేశానికి లాక్కొచ్చారు

- 2004లో 7

- 2005లో 8

- 2006లో 5

- 2007లో 4

- 2008లో 4

- 2009లో అయిదుగురిని దేశానికి రప్పించారు.

- 2010లో ఒకరు

- 2011లో ఒకరు

- 2012లో 2

- 2013లో 3

- 2014లో 2

- 2015లో 8మందిని భారత్ కు రప్పించారు.

వివిధ దేశాల్లో పెండింగులో ఉన్న కేసులను పరిశీలిస్తే.. బ్రిటన్ లో 2012 నుంచి ఒక్కరిని కూడా రప్పించడం సాధ్యం కాలేదు. ఆ దేశం నుంచి 131 మందిని రప్పించడానికి సంబంధించిన కేసులు పెండింగులో ఉన్నాయి. మిగతా దేశాలు ఈ విషయంలో కొంత మెరుగ్గా స్పందిస్తున్నాయి.

ఎక్కడెక్కడినుంచి విజయవంతంగా రప్పించాం..

- అరబ్ ఎమిరేట్సు.. ఈ దేశం నుంచి 17 మందిని తీసుకురాగలిగారు.

- అమెరికాకు పారిపోయిన 11 మందిని ఆ దేశం మనకు అప్పగించింది.

- కెనడా 4

- దక్షిణాఫ్రికా 3

- జర్మనీ ముగ్గురిని మన దేశానికి పంపించింది. ఇంకా పలు దేశాల నుంచి విజయవంతంగా నిందితులును రప్పించారు.

కాగా విదేశాలకు చెక్కేస్తున్న నిందితుల్లో ఎక్కువ మంది హత్య కేసుల్లో ఉన్నవారే ఉంటున్నారు. 2002 నుంచి ఇప్పటివరకు ఇండియాకు 60 మందిని రప్పించగా వారిలో హత్యకేసుల నిందితులే ఎక్కువ మంది ఉన్నారు.

ఇండియాకు రప్పించిన నిందితుల్లో ఎవరు ఎందరు?

- హత్యకేసు నిందితులు 10 మంది.. 16.6 శాతం

- ఉగ్రవాద కేసుల నిందితులు 6గురు.. 10 శాతం

- నేరపూరిత కుట్రలో ఉన్నవారు 5గురు.. 8.3 శాతం

- మోసం కేసుల్లో ఉన్నవారు నలుగురు.. 6.6 శాతం

- ముంబయి బాంబుపేలుళ్ల నిందితులు ముగ్గురు.. 5 శాతం

- పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడినవారు ముగ్గుు.. 5 శాతం

- ఇండియాకు వ్యతిరేకంగా కిరాయి తీసుకుని యుద్ధం చేసినవారు ముగ్గురు.. 5 శాతం

- ఆర్థిక నేరాలు ముగ్గురు 5 శాతం

- ఫ్రాడ్ కేసుల్లో వెళ్లినవారు ముగ్గురు.. 5 శాతం

- ఆర్థిక మోసాలకు పాల్పడినవారు ముగ్గురు ... 5 శాతం

ఇండియా గత పద్నాలుగేళ్ల కాలంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ను కూడా దేశానికి రప్పించింది. అలాంటివారిలో అబూ సలెం ఒకరు. పోర్చుగల్ నుంచి ఆయన్ను రప్పించారు. 1993 ముంబయి పేలుళ్లలో కేసులో అబూ నిందితుడు.

- ఛోటా రాజన్ ను ఇండోనేషియా నుంచి రప్పించారు. మాదక ద్రవ్యాలు, హత్య కేసుల్లో నిందితుడైన రాజన్ పేరుమోసిన మాఫియా డాన్.

- జర్మనీ నుంచి దేవీందర్ సింగ్ భుల్లార్ ను రప్పించారు. ఆయన 1993 ఢిల్లీ కారు బాంబు కేసులోనిందితుడు.

- యాసిన్ భత్కల్ నుంచి నేపాల్ నుంచి ఇండియాకు తెచ్చారు. 2007, 2008 బాంబుపేలుళ్లో నిందితుడైన ఉగ్రవాది ఈయన.

కాగా ఇప్పటికీ పలు కీలక కేసుల్లోని నిందితులు, మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లు విదేశాల్లో తలదాచుకుని ఇండియాను ముప్పతిప్పలు పెడుతున్నారు.

- 2006లో ఇండియన్ నేవీ వార్ రూం రహస్యాలు లీక్ చేసిన రవి శంకరన్ బ్రిటన్ లో ఉన్నాడు.

- 1993 గుజరాత్ బాంబు పేలుళ్ల నిందితుడు టైగర్ హనీఫ్ కూడా బ్రిటన్ లోనే ఉన్నాడు.

- 1997లో జరిగిన గుల్షన్ కుమార్ హత్యకేసు నిందితుడు నదీం సైఫీ కూడా బ్రిటన్ లోనే ఉన్నాడు.

- ఇక మనీ లాండరింగ్ కేసుల్లో నిందితుడు లలిత్ మోడీ కూడా బ్రిటన్ నుంచి కదలడం లేదు.

- మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాక్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

- 26/11 ముంబయి దాడికేసు నిందితుడు హఫీజ్ సయీద్ పాకిస్థాన్ లో ఉన్నాడు.

- 26/11 ముంబయి పేలుళ్ల కేసు నిందితుడు డేవిడ్ హాడ్లీ అమెరికాలో ఉన్నాడు.

ఇండియా విషయంలో మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లయిన వీరిని రప్పించడానికి నిత్యం ప్రయత్నాలు జరుగుతున్నా ఫలించడం లేదు. తాజాగా విజయ్ మాల్యా కూడా ఈ జాబితాలో చేరారు.

- గరుడ
Tags:    

Similar News