హెచ్1బీ కుంభ‌కోణం:అమెరికాలో మ‌నోడి అరెస్ట్‌

Update: 2017-12-28 17:46 GMT
హెచ్‌1బీ వీసాల విష‌యంలో సంచ‌ల‌న విష‌యం తెర‌మీద‌కు వ‌చ్చింది. నైపుణ్యం గల విదేశీ ఉద్యోగుల కోసం సడలించిన హెచ్1బీ వీసా నిబంధనలను ఆధారంగా చేసుకుని రెండు కోట్ల డాలర్ల (రూ.128కోట్ల) కుంభకోణం వెలుగులోకి వ‌చ్చింది. ఈ స్కాంకు పాల్పడిన భారత సంతతి వ్యక్తి రాజు కోసూరి(45)ని అమెరికా ప్రభుత్వం దేశ బహిష్కరణ వేటు వేసింది. ఆయన కుటుంబాన్ని భారత్‌ కు పంపించేసింది.

హెచ్1బీ మార్గదర్శకాలను వినియోగించుకుని వీసా ఫర్ సేల్ వ్యవహారాన్ని కొన్నేళ్లుగా రాజు కోసూరి అనే వ్యక్తి నడుపుతూ వచ్చారని ఫెడరల్ కోర్టు నిర్ధారించడంతోపాటు అతడికి 28నెలల జైలుశిక్ష విధించారు. శిక్షాకాలం పూర్తవడంతో రాజును, ఆయన భార్య స్మృతి జరియాను - జన్మతః అమెరికన్ అయిన వారి కుమారుడిని భారత్‌ కు పంపేశారు. వర్జీనియాకు చెందిన వ్యాపారవేత్త రాజు కోసూరి (45) పలు డొల్లకంపెనీ లను నెలకొల్పి వాటి ద్వారా వేలాది మందికి దొంగ దారిన హెచ్1బీ వీసాలు ఇప్పించారని తేలింది. దీంతో 28నెలలపాటు ఫెడరల్ జైలులో రాజు శిక్ష అనుభవించాడు. శుక్రవారం ఆయన విడుదలపై ఫెడరల్ కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ప్రాసిక్యూషన్ రాజుపై తీవ్రమైన అభియోగాలు నిరూపించనందువల్లే తక్కువ శిక్ష పడిందని న్యాయమూర్తి లియోనీ బ్రింకెమా అభిప్రాయపడ్డారు.

కాగా, ప్ర‌తి ఏటా 85 వేల హెచ్‌-1బీ వీసాల‌ను అమెరికా జారీ చేస్తుంది. ఈ మొత్తం 85 వేల వీసాల్లో 65 వేలు జ‌న‌ర‌ల్ కేట‌గిరీ కాగా.. 20 వేల వీసాల‌ను అమెరికా విద్యాసంస్థ‌ల్లో మాస్ట‌ర్స్ - అంత‌ క‌న్నా ఉన్న‌త చ‌దువులు చ‌దివిన విదేశీ విద్యార్థుల‌కు జారీ చేస్తారు. ప్ర‌త్యేక నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగుల‌ను తాత్కాలికంగా త‌మ కంపెనీల్లో నియ‌మించుకొనే అవ‌కాశం హెచ్‌-1బీ వీసాల వ‌ల్ల క‌లుగుతుంది. సైన్స్‌ - ఇంజినీరింగ్‌ - ఐటీ రంగాల్లో ఎక్కువ‌గా హెచ్‌-1బీ వీసాదారుల అవ‌స‌రం ఉంటుంది.

ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా హెచ్‌1–బీ వీసాలపై వెళ్లి అక్కడ స్థిరపడుతుంటారు.  మన దేశం నుంచి చాలామంది ఉద్యోగులు హెచ్1బీ వీసా కోసం పోటీపడుతుంటారు. సాంకేతికపరంగా లేదా సైద్ధాంతికంగా నిపుణులైన విదేశీయులు ఈ వీసా కలిగి ఉన్నట్టయితే అమెరికా కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. భారత్ - చైనా దేశాలకు చెందిన వేలాదిమందిని అమెరికా కంపెనీలు ఈ వీసా ప్రాతిపదికన ప్రతి ఏడాది ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నియమిస్తుండడం సర్వసాధారణం.
Tags:    

Similar News