రైళ్ల‌ల్లో ఈక్యూ అల‌వాటుందా? రూల్స్ మారాయ్!

Update: 2019-06-17 05:30 GMT
రైళ్ల‌ల్లో త‌ర‌చూ ప్ర‌యాణించే వారికి ఈక్యూ మాట బాగా తెలుసు. రైళ్లల్లో ప్ర‌యాణించే వారు ఎమ‌ర్జెన్సీ కోటా పేరుతో రైల్వే అధికారుల‌కు సిపార్సు లేఖ‌ల్ని అందించి.. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న త‌మ టికెట్ ను క‌న్ఫ‌ర్మ్ చేయించుకుంటూ ఉంటారు. ఇప్ప‌టివ‌ర‌కూ దీనికి సంబంధించి ఉన్న నిబంధ‌న‌ల్ని మార్చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. మారిన నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈక్యూ కోటా టికెట్ల‌ను పొందటం ఇక‌పై అంత ఈజీ కాదు. కొత్త రూల్స్ తో వీటిని సొంతం చేసుకోవ‌టం క‌ష్ట‌మైన ప‌నే.

ఈక్యూ విధానంలోని లోపాల్ని అస‌రా చేసుకొని వాటిని ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో..రైల్వే బోర్డు అలెర్ట్ అయ్యింది. ఈ విధానానికి సంబంధించి కొత్త రూల్స్ ను ఫ్రేమ్ చేసింది. తాజా నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈక్యూ టికెట్ పొందాల‌నుకునే వారు త‌మ టికెట్ తో పాటు త‌ప్ప‌నిస‌రిగా గెజిటెడ్ అధికారి సిఫార్సు లేఖ‌ను తీసుకురావాల్సి ఉంటుంది. సామాన్యులే కాదు.. రైల్వే అధికారులు..సిబ్బంది అయినా స‌రే గెజిటెడ్ అధికారి లేఖ‌ను త‌మ ఈక్యూ ద‌ర‌ఖాస్తుకు జ‌త చేయాల్సి ఉంటుంది.

అంతేకాదు.. ఈక్యూ కింద క‌న్ ఫ‌ర్మేష‌న్ కోసం ఇచ్చే లేఖ‌లో త‌మ మొబైల్ నెంబ‌రును త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాల్సి ఉంటుంది. సాధార‌ణ ప్ర‌జ‌లు ఈక్యూ కోసం త‌మ గుర్తింపు కార్డును చూపాల్సి ఉండ‌ట‌మే కాదు.. అత్య‌వ‌స‌ర ప్ర‌యాణానికి కార‌ణం వివ‌రించాల్సి ఉంటుంది. అంతే కాదు.. ఈక్యూ కోసం ప్రజాప్ర‌తినిధులు ఇచ్చే లేఖ‌ల‌ను సంబంధిత రైల్వే అధికారి ధ్రువీక‌రించుకున్న త‌ర్వాతే వాటిని ఆమోదించాల్సి ఉంటుంది. ఇన్ని రూల్స్ కంటే.. ఈక్యూ కింత లెట‌ర్ పెట్ట‌క‌పోవ‌టం ఉత్త‌మ‌మేమో?
Tags:    

Similar News