టీమిండియా క్రికెట్‌కు ఆశా కిరణమంటూ అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకున్న విరాట్ కోహ్లీ... ఆసీస్ జట్టును ఎదుర్కోవడంలో అంతగా సఫలం కాలేదనే చెప్పాలి. టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా నిన్నటిదాకా కోహ్లీ రికార్డు అరుదైనదేనని చెప్పాలి. వరుస విజయాలతో దూసుకెళ్లిన కోహ్లీ... భారత క్రికెట్ జట్టుకు కొరుకుడు పడనిదిగా రికార్డులకెక్కిన ఆస్ట్రేలియా జట్టు ముందు మాత్రం నిలబడలేకపోతున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి టెస్టులో ఆసిస్ చేతిలో చిత్తైన కోహ్లీ సేన బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ పరాజయం దిశగానే సాగుతోందన్న భావన కలుగుతోంది. నేటి ఉదయం బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో మొదలైన ఈ టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచిన కోహ్లీ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ అయితే ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యం నిర్దేశించాలన్న కోహ్లీ ఆశయాన్ని అతడి జట్టుతో పాటు అతడు కూడా సాకారం చేయలేకోయాడు.
భారీ లక్ష్యాన్నే నిర్దేశించాలని భావించి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఒక్క కేల్ రాహుల్ మాత్రమే అండగా నిలిచాడు. కెప్టెన్ కోహ్లీతో సహా ఏ ఒక్క బ్యాట్స్ మన్ కూడా అంచనాలకు తగ్గట్టుగా ఆడలేదనే చెప్పాలి. టీమిండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్కోరు 189 చేరుకోగానే... ఆలౌటైంది. ఈ పరుగుల్లో ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ చేసిన స్కోరే 90. కోహ్లీ సహా మిగిలిన బ్యాట్స్ మెన్ అంతా కలిసి కూడా టీమిండియా స్కోరును కనీసం 200 మార్కును కూడా దాటించలేకపోయారు. వెరసి రెండో టెస్టులోనూ టీమిండియా ఓటమి బాటలోనే పయనిస్తోందని తేటతెల్లమైపోయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/