అమెరికా పొమ్మంటుంటే.. కెనడా రమ్మంటోంది..

Update: 2017-02-13 07:34 GMT
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తరువాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో అన్ని దేశాలతో పాటే ఇండియన్లూ ఆందోళన చెందుతున్నారు. హెచ్1బీ వీసాలు, గ్రీన్ కార్డులు ఇలా ప్రతి విషయంలోనూ ట్రంప్  కఠిన నిబంధనలు అమలుచేయడానికి పావులు కదుపుతుండడంతో ఇక అమెరికాలో ఉండడం కష్టమన్న భావన చాలామందిలో ఏర్పడుతోంది. అయితే... ఈ పరిణామాల నుంచి ఆందోళన చెందనవసరం లేదని.. తమ దేశానికి వచ్చి టెక్నాలజీ సేవలు అందించాలని అమెరికాకు పొరుగునే ఉన్న కెనడా పిలుస్తోంది.  దీంతో ఇకపై టెక్నాలజీ సేవలకు కెనడా కేంద్రం కాగలదన్న భావన కనిపిస్తోంది.

కెనడా ఉత్తర అమెరికాలో అతిపెద్ద దేశం. బలమైన ఆర్థిక వ్యవస్థ. అమెరికాతో పోల్చితే నేరాలు తక్కువ. మంచి లివింగ్ కండీషన్సు ఉంటాయి. రాజకీయంగానూ సుస్థిరత ఉంది. అంతేకాదు.. అక్కడ అమెరికాలో మాదిరిగా విద్వేషాలు కనిపించవు. ఎక్కడివారినైనా అడాప్టు చేసుకునే గుణం కెనడియన్లది. కెనడాలో మంత్రులుగా కూడా మన ఇండియన్సు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అలాంటి కెనడా ఇప్పడు టెక్ సేవల్లో అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఇదే మంచి అవకాశంగా భావిస్తోంది.

ట్రంప్ నిషేధానంతరం  కెనడాలో టెక్ రిక్రూట్ మెంట్, ఇన్వెస్ట్​‍మెంట్లు భారీగా పెరగనున్నట్టు  ఆ దేశం చెబుతోంది. ''భారత్ నుంచి వచ్చే ప్రతిభావంతులకు ఇదే చక్కని అవకాశం. కెనడాలోనే నివసిస్తూ, కెనడాలో ఉద్యోగం చేసుకోవచ్చు'' అని ఫాంటసీ 360 అనే సంస్థ సీఈవో షాఫిన్ డైమండ్ తేజ అంటున్నారు.  అంతేకాదు.. వాంకోవర్ లో ఉణ్న పలు టెక్ సంస్థలు ఇప్పటికే అమెరికాలోని టెక్ సంస్థల్లో ఉన్న ఇండియన్ల సమాచారం సేకరించాయట. వారిని కెనడాకు రప్పించేలా భారీ ఆఫర్లు ప్రకటించడానికి రెడీ అవుతున్నాయి.

 కెనడాకు చెందిన టెక్ సంస్థలు ఇంకో అడుగు కూడా వేశాయి. ట్రంప్ జారీచేసిన కార్యనిర్వాహక ఆదేశాలతో ప్రభావితులైన వారికి వీసాలు అందించాలని కెనడా ప్రధానికి కూడా లేఖ రాశాయి.  ప్రపంచంలో ఉన్న ప్రతిభావంతులను హైర్ చేసుకుని, వారికి ట్రైనింగ్ ఇప్పించి, గ్లోబల్ కంపెనీలను తమ దేశంలో స్థాపించి, తమ ఆర్థికవ్యవస్థను మరింత అభివృద్ధి చేసేలా చేస్తామని ఆ లేఖలో టెక్ కమ్యునిటీ పేర్కొంది. అక్కడి టాప్ స్టార్టప్ ఇంక్యుబేటర్లు కూడా భారత టెక్కీలను కెనడాలో నియమించుకోవడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. తాజాగా లాంచ్ అకాడమీ కెనడియన్ స్టార్టప్ ఓ వీసా ప్రొగ్రామ్ కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రొగ్రామ్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న స్టార్టప్ లు తమ ప్రధాన కార్యాలయాలను కెనడాలో నియమించుకునేలా అవకాశం కల్పిస్తోంది. ఆ ప్రొగ్రామ్ ద్వారా స్టార్టప్ లో ఐదుగురు ప్రధాన వ్యక్తులకు, వారి కుటుంబసభ్యులకు ఆరు నెలల్లో కెనడాలో శాశ్వత నివాసానికి ఆమోదం కల్పిస్తోంది.   మొత్తానికి అమెరికా పొమ్మంటున్నా కెనడా రమ్మంటుండడంతో మనవాళ్లంతా సేఫ్ జోన్లో పడుతున్నట్లే.
Tags:    

Similar News