సౌత్ చైనా సముద్రంలోకి భారత యుద్ధ నౌక.. చైనా అభ్యంతరం

Update: 2020-08-30 16:30 GMT
భారత్- చైనా సరిహద్దులో నెలకొన్న వివాదాలకు పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు జరుగుతున్న వేళ చైనా తూర్పు లద్ధాక్ ప్రాంతంలో ఆర్మీ స్థావరాలను నిర్మిస్తూ వివాదం సృష్టిస్తుండగా.. భారత్ చైనాకు పెద్ద షాకే ఇచ్చింది. సౌత్ చైనా సముద్రంలో భారత్ తన యుద్ధ నౌకను మోహరించింది. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించేందుకు రెండు దేశాల మధ్య దౌత్య పరమైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో భారత్ తన యుద్ధనౌకను తమ భూభాగ పరిధిలోకి వచ్చే సముద్రంలో యుద్ధ నౌకను మోహరించడం తగదని చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాంతంలోకి భారత యుద్ధ నౌక చేరుకోవడాన్ని ఆ దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో అమెరికా తన యుద్ధనౌక మోహరింపజేయగా తాజాగా భారత్ కూడా అక్కడికి యుద్ధ నౌకను చేర్చింది. సరిహద్దు సమస్యలు పరిష్కరించుకుందామంటూనే చైనా తన వక్ర బుద్ధి ప్రదర్శిస్తోంది. ఇప్పటికే గాల్వన్ లోయలో భారత జవాన్లపై ఆకస్మికంగా దాడి జరిపి 20 మందికిపైగా పొట్టన పెట్టుకుంది.

సరిహద్దు సమస్యలున్న తూర్పు లద్ధాక్ ప్రాంతంలో 5జీ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు రెండు ఆర్మీ స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకుంటోంది. చైనా చర్యలను నిశితంగా గమనిస్తూ వస్తున్న భారత్ దక్షిణ చైనా సముద్రంలోకి తన యుద్ధనౌక తరలించి దీటుగా బదులిచ్చింది. దక్షిణ చైనా సముద్రంలో 2009 నుంచి చైనా కృత్రిమ ద్వీపాలను నిర్మిస్తోంది. భారత్ తో యుద్ధం వస్తే ప్రయోజనం ఉండేలా ఆ ద్వీపాల్లో ఇప్పటికే సైన్యాన్ని మోహరించింది. దక్షిణ చైనా సముద్రం చాలా వరకు తమ దేశ భూభాగంలోనే ఉందని.. ఆ ప్రాంతంలో ఇతర దేశాలకు సంబంధించిన యుద్ధ నౌకలను మోహరించడం అనుమతించమని చైనా అంటోంది. చైనా ఆధిపత్యానికి గండికొట్టేందుకు అమెరికా ఇప్పటికే తన యుద్ధ నౌకను మోహరించగా.. తాజాగా భారత్ కూడా తన యుద్ధనౌక మోహరించడంతో చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.




Tags:    

Similar News