దుబాయిలో 1,000 కి.మీ న‌డిచిన త‌మిళ తంబీ

Update: 2016-12-01 09:44 GMT
నిజ‌మే... వింటేనే క‌ళ్ల వెంట నీళ్లు తిరిగే ఈ ఘ‌ట‌న దుబాయిలో చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం ప్రారంభ‌మైన ఈ క‌ష్టంపై అంత‌ర్జాతీయ మీడియా దృష్టి ప‌డ‌టం, ఆ త‌ర్వాత భార‌త నెటిజ‌న్లు దీనిపై స్పందించ‌డం, ఆ క‌ష్టానికి ముగింపు ప‌ల‌కాలంటూ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వ‌రాజ్‌కు అభ్య‌ర్థ‌న‌లు వెళ్లిపోవ‌డం... అంతా సినిమాటిగ్గానే జ‌రిగినా... ఇది ముమ్మాటికీ య‌దార్థ గాథే. పొట్ట‌కూటి కోసం దేశం కాని దేశం వెళ్లి ఓ త‌మిళుడు ప‌డ్డ బాధ‌కు సంబంధించిన ఈ గాథ వివ‌రాల్లోకెళితే... త‌మిళ‌నాడులోని తిరుచురాప‌ల్లికి చెందిన జ‌గ‌న్నాథ‌న్ సెల్వ‌రాజ్ జీవ‌నోపాధి వెతుక్కుంటూ చాలా కాలం క్రిత‌మే దుబాయి వెళ్లాడు. దుబాయిలోని సోనాపూర్‌లో ఉంటూ ప‌నిచేసుకుంటున్న అత‌డు.. కాలం క‌లిసి రాక‌పోతుందా? అని ఎదురుచూడ‌సాగాడు. అయితే కాలం క‌లిసి రాలేదు కాని... చేదు వార్త‌ను మోసుకొచ్చింది. సొంతూళ్లో త‌ల్లి మ‌ర‌ణించింద‌న్న వార్త అత‌డిని తీవ్ర వేద‌న‌లో ముంచేసింది. త‌ల్లిని క‌డ‌సారి చూసుకునేందుకు భార‌త్ తిరిగి వ‌ద్దామంటే కోర్టు అనుమ‌తి ల‌భించ‌లేదు. అప్ప‌టి నుంచి అతడు న్యాయ‌పోరాటం మొద‌లెట్టాడు. దుబాయిలోని కోర్టును ఆశ్ర‌యించాడు. భార‌త్‌ కు వ‌చ్చేందుకు అత‌డిని ప‌ర్మిష‌న్ ఇచ్చే విష‌యాన్ని సింగిల్ టేక్‌ లో ప‌రిష్కరించాల్సిన కోర్టు వాయిదాల‌పై వాయిదాలు వేసింది. ఈలోగా క‌డుపు నింపుతున్న ఉద్యోగం కాస్తా ఊడింది. చేతిలో ఉన్న అంతంత మాత్రం చిల్ల‌ర కూడా హార‌తిలా క‌రిగిపోయింది. దీంతో సోనాపూర్‌ లోని ఓ ప‌బ్లిక్ పార్కులోకి అత‌డి నివాసం మారిపోయింది.

ఈ క్ర‌మంలో ఎలాగైనా సొంతూరు చేరాల‌న్న అత‌డి ప‌ట్టుద‌ల అత‌డిని మ‌రింతగా ప్రోత్స‌హించింది. అయితే ఈ ప్రోత్సాహానికి ఆస‌రా లేదు. ఫ‌లితంగా అత‌డు త‌న కాళ్ల‌కే ప‌నిచెప్పాడు. రెండు వారాల‌కు ఓ వాయిదా ప‌డుతున్న కోర్టు విచార‌ణ కోసం అత‌డు 22 కిలో మీట‌ర్ల మేర న‌డిచి కోర్టుకు హాజ‌రై.. విచార‌ణ ముగియ‌గానే తిరిగి కాలి బాట‌నే ఆశ్ర‌యించాడు. ఇలా 50 కోర్టు వాయిదాల‌కు అత‌డు హాజ‌ర‌య్యారు. వెర‌సి ఏకంగా 1,000 కిలో మీట‌ర్ల మేర అత‌డు పాద‌యాత్ర చేశాడ‌ట‌. రెండేళ్ల పాటు సాగిన ఈ సుదీర్ఘ యాత్ర‌లో అత‌డికి అండ‌గా నిలిచిన వారెవ్వ‌రూ లేక‌పోయారు. అయితే అంత‌ర్జాతీయ మీడియా  అత‌డి అలుపెర‌గ‌ని పోరాటాన్ని గుర్తించి ప్ర‌త్యేక క‌థ‌నాలు రాసింది. దీంతో విష‌యం తెలుసుకున్న భార‌తీయ నెటిజ‌న్లు కూడా పెద్ద సంఖ్య‌లో స్పందించారు. సెల్వ‌రాజ్‌కు సాయం చేసి అత‌డిని అత‌డి సొంత గ్రామం చేర్చేలా సాయం చేయాల‌ని నెటిజ‌న్లంతా సుష్మా స్వరాజ్‌ కు విజ్ఞ‌ప్తి చేశారు. సుష్మా స్పందించాల‌ని, అత‌డు త‌న సొంతూరు క్షేమంగా చేరాల‌ని మ‌న‌మూ కోరుకుందాం.


Tags:    

Similar News