సెమీ ఫైనల్‌లో ఓటమి...ఆ మహిళా హాకీ ప్లేయర్‌‌పై కులం పేరుతో !

Update: 2021-08-06 05:47 GMT
టోక్యో ఒలింపిక్స్ చరిత్రలో మొదటిసారి ఫైనల్‌ కి చేరే సువర్ణావకాశాన్ని భారత మహిళల హాకీ టీమ్ చేజార్చుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా అర్జెంటీనా తో బుధవారం తలపడిన భారత మహిళల హాకీ టీమ్ 1-2 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఇక కాంస్య పతకం కోసం గ్రేట్ బ్రిటన్‌తో శుక్రవారం భారత్ ఢీ కొట్టింది. కాంస్య పతక మ్యాచ్‌ లో భారత్ మహిళల హాకీ టీం పోరాడి ఓడింది. బ్రిటన్‌ తో జరిగిన మ్యాచ్‌ లో 3-4 తేడాతో ఓడి కాంస్య పతకాన్ని తృటిలో మిస్ చేసుకుంది. పటిష్టమైన బ్రిటన్‌ తో మొదటి నుంచి నువ్వా నేనా అన్నట్లు తలపడ్డ భారత జట్టు చివరి క్వార్టర్‌ లో చేతులెత్తేసింది. పెనాల్టీ కార్నర్స్‌ ను గోల్స్‌ గా మార్చడంతో భారత జట్టు విఫలమైంది. గుర్జిత్ 2, వందన ఒక గోల్ చేశారు.

1980 మాస్కో ఒలింపిక్స్‌లో ఆరు జట్లు మాత్రమే పోటీపడగా.. రౌండ్ రాబిన్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. ఆ ఒలింపిక్స్‌లో టాప్-4లో నిలిచిన భారత మహిళల హాకీ టీమ్.. ఒలింపిక్స్‌ లో పోటీపడుతుండటం ఇది మూడోసారి మాత్రమే. 1980 ఆ తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో మాత్రమే భారత మహిళల హాకీ టీమ్ పోటీపడింది. ఇప్పుడు అద్భుత పోరాటం తో పథకం వైపు అడుగులు వేసి చివరి మెట్టు పై బోర్లాపడింది.

ఇదిలా ఉంటే .. ఇకపోతే , ఒలింపిక్స్‌ చరిత్రలోనే తొలిసారి సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చిన భారత మహిళా హాకీ టీమ్‌ను అందరూ ఘనంగా నెత్తిన పెట్టుకుంటే.. కొందరు కుల అహంకారంతో దూషించిన ఘటన ఉత్తరాఖండ్‌ లో జరిగింది. టీమ్‌ లో ఎక్కువ మంది దళితులే ఉండడం వల్ల గెలవలేకపోయారంటూ ఓ ప్లేయర్ ఇంటి ఎదుట గొడవ చేశారు. దీనితో ఈ పని చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఇద్దరిలో ఒకరిని అరెస్టు చేశారు. రెండో వ్యక్తి పరారీలో ఉండడంతో అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. మహిళా హాకీ టీమ్ ప్లేయర్ వందనా కటారియా స్వస్థలం ఉత్తరాఖండ్‌ లోని రోష్నాబాద్‌. బుధవారం టోక్యో ఒలింపిక్స్‌ లో అర్జెంటీనాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌ లో ఇండియా మహిళా హాకీ టీమ్ పోరాడి ఓడింది.

ఈ మ్యాచ్ చూసిన తర్వాత బుధవారం సాయంత్రం రోష్నాబాద్‌ కు చెందిన ఇద్దరు వ్యక్తులు, వందన ఇంటి ముందుకు వెళ్లి ఎగతాళి చేస్తూ చిందులు వేశారు. పటాకులు కాలుస్తూ కులం పేరుతో దూషించారు. టీమ్‌ లో దళిత ప్లేయర్లు ఎక్కువ మంది ఉన్నారని, అందుకే ఓటమిపాలయ్యారని అంటూ కామెంట్లు చేశారు. ఆ గోల విని వందన కుటుంబసభ్యులు బయటకు రాగా, వాళ్లను కూడా నోటి కొచ్చినట్లు కులం పేరు వాడుతూ తిట్టారు. దీంతో అక్కడ వాళ్ల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని వందన సోదరుడు చెప్పాడు. గొడవ చేసిన ఇద్దరిపై వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విజయ్ పాల్ అనే ఒకడిని గురువారం అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News