అనుభవం లేని ఆర్టీసీ డ్రైవర్.. మాజీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

Update: 2019-10-08 06:53 GMT
నిజాయితీకి నిలువెత్తు రూపంగా.. ఎమ్మెల్యేగా వ్యవహరించి కూడా కోట్లు కూడబెట్టని నేతగా ప్రజల మనసుల్లో గుర్తుండిపోయే నేటితరం నేత సున్నం రాజయ్య. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. సొంత కారును సమకూర్చుకోలేకపోయారు. మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన నేటికి టూవీలర్ ను నడుపుతూ తన పని తాను చేసుకుంటూ ఉంటారు. అలాంటి సున్నం రాజయ్య తృటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్నారు.

తాజాగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా.. పట్టుదలకు పోయిన ప్రభుత్వం.. ఎవరిని పడితే వారిని ఆర్టీసీ డ్రైవర్లుగా నియమించటం తెలిసిందే. సరైన శిక్షణ.. క్రమశిక్షణ ఉందా?  లేదా? అన్న విషయాన్ని వదిలేసి.. లారీ డ్రైవర్ మొదలు జీపు తోలే వారి వరకూ ఆర్టీసీ బస్సుల్ని నడిపేందుకు తాత్కాలికంగా ఎంపిక చేసుకున్న కారణంగా పలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య విషయంలోనూ ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. భద్రాచలం డిపో నుంచి కూనవరం వెళుతున్న ఆర్టీసీ బస్సు కారణంగా రాజయ్య తృటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్నారు. బైక్ మీద వెళుతున్న ఆయన్ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఆయన్ను ఢీ కొట్టినంత పని చేశాడా ఆర్టీసీ డ్రైవర్. అయితే.. అలెర్ట్ గా ఉన్న సున్నం రాజయ్య క్షణంలో వెయ్యో వంతులో స్పందించి.. ప్రమాదం నుంచి తప్పించుకోవటంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు.

కాకుంటే.. వేగాన్ని నియంత్రించలేక రోడ్డు పక్కనే ఉన్న బురదగుంటలో పడిపోయారు. సమ్మె నేపథ్యంలో తాత్కాలికంగా ఎంపిక చేసుకున్న డ్రైవర్లు వేగ నియంత్రణ లేకుండా వ్యవహరించటం.. ఇష్టారాజ్యంగా డ్రైవ్ చేస్తూ.. పలు ప్రమాదాలకు కారణమవుతున్నారని చెబుతున్నారు. తాజా ఉదంతం ఇందుకో ఉదాహరణగా చెప్పక తప్పదు.

డ్రైవర్ చేసిన పనిని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్ఐ రేఖపల్లి వద్ద బస్సును ఆపి.. డ్రైవర్ ను మందలించారు. అనుభవం లేని డ్రైవర్లు బస్సుల్ని నడపటం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. పెద్ద ప్రమాదం నుంచి సున్నం రాజయ్య తృటిలో తప్పించుకోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News